సారొచ్చారొచ్చారు
సారొచ్చారొచ్చారు
Published Wed, Apr 19 2017 11:14 PM | Last Updated on Sat, Oct 20 2018 7:44 PM
- నూతన కలెక్టర్ కాకినాడకు రాక
- పాత కలెక్టర్ అరుణ్ కుమార్ సాదర స్వాగతం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లా పాలనా పగ్గాలు చేపట్టేందుకు కొత్త సారథి వచ్చేశారు. ఆయన రాకతో రెండేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న పాత సారథికి వీడ్కోలు పలికారు. ఇదంతా బుధవారం రాత్రి 7.30 గంటల నుంచి 9 గంటల మధ్య జరిగింది. రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్‌పోర్టు నుంచి ప్రైవేటు కారులో కాకినాడ కలెక్టర్ బంగ్లాకు రాత్రి 7.30 గంటలకు వచ్చారు. బంగ్లాలో ప్రస్తుత కలెక్టర్ హెచ్.అరుణ్ కుమార్‌తో సుమారు గంట సేపు భేటీ అయ్యారు. సుమారు గంటపాటు వీరిద్దరూ సమావేశమయ్యారు. జిల్లా పాలనా వ్యవహారాలు, భౌగోళిక, సామాజిక, రాజకీయ పరిస్థితులపై సుమారు గంటపాటు ఇద్దరూ చర్చించుకున్నారు. అనంతరం ప్రస్తుత కలెక్టర్ అరుణ్‌కుమార్ విధుల నుంచి రిలీవ్ అవుతున్నట్టు రికార్డుల్లో సంతకాలు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ, పెద్దాపురం, రామచంద్రపురం ఆర్డీఓలు రఘుబాబు, విశ్వేశ్వరరావు, కొమ్ముల సుబ్బారావు, సమాచార శాఖ డీడీ ఫ్రాన్సిస్ తదితర అధికారులు బంగ్లాలో కొత్త కలెక్టర్ కార్తికేయను కలిసి స్వాగతం పలికారు. కొత్త కలెక్టర్‌ను పరిచయం చేసుకున్నాక రామచంద్రపురం, పెద్దాపురం ఆర్డీఓలను తమ, తమ ప్రాంతాలకు వెళ్లిపోవాలని చెప్పిన కొత్త కలెక్టర్ మిశ్రా కాకినాడ ఆర్డీఓ రఘుబాబుకు మాత్రం ఉదయం రావాలని సూచించారు. కలెక్టర్ బంగ్లా నుంచి రాత్రి 8.30 గంటలకు కార్తికేయ కలెక్టరేట్ ఆవరణలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకుని అక్కడే బస చేశారు. అరుణ్‌కుమార్ రిలీవ్ కావడంతో కొత్త కలెక్టర్ మిశ్రా బాధ్యతలు తీసుకోవడం ఇక లాంఛనమేనంటున్నారు.
మిశ్రా గురువారం ఉదయం 10 గంటల తరువాత మిశ్రా జిల్లా 145 కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2009 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన కార్తికేయ మిశ్రా ఇంతవరకు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌గా పనిచేస్తూ తొలిసారి జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపడుతున్నారు. ముక్కుసూటి మనస్తత్వం కలిగిన మిశ్రా ఇంత పెద్ద జిల్లా పాలనను ఎలా నిర్వహిస్తారా అని అటు జిల్లా యంత్రాంగం, ఇటు జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రెండేళ్లపాటు ఇక్కడ కలెక్టర్‌గా పనిచేసి రిలీవ్ అయిన అరుణ్‌కుమార్ స్త్రీ, శిశుసంక్షేమశాఖ కమిషనర్‌గా వెళ్లనున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ పదోన్నతిపై కర్నూలు కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జేసీగా ఎవరు వస్తారనేది ఒకటి, రెండు రోజుల్లో తేలిపోనుంది. జేసీ పోస్టు కోసం రాజమహేంద్రవరం కార్పొరేషన్ కమిషనర్ విజయరామరాజు, కాకినాడ పోర్టు డైరెక్టర్ ప్రసన్నవెంకటేష్ ప్రయత్నాల్లో ఉన్నారని అధికారవర్గాల ద్వారా తెలియవచ్చింది.
Advertisement