కామాంధుడిని కొట్టి చంపారు..?
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మండలం వెంకటాపురంలో ఏడేళ్ల చిన్నారి లావణ్య (పూర్తి కథనం) పై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సురేష్ను స్థానికులు కొట్టి చంపారు. పోలీసులు అదుపులో ఉన్న అతడిని శుక్రవారం గ్రామస్తులు బలవంతంగా లాక్కుని వెళ్లి హతమార్చారు. ఇప్పటికే పలు దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ ఇంట్లోని ట్రంక్ పెట్టెలో లావణ్య మృతదేహాన్ని స్థానికులు గుర్తించిన విషయం తెలిసిందే.
ఈ కేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న సురేష్ ను గ్రామస్థులు బలవంతంగా లాక్కుని దాడికి దిగారు. నిందితుడిపై పిడిగుద్దులు కురిపించి, కాళ్లతో తన్నారు. ఆ దెబ్బలకు చివరికి సురేష్ చనిపోవటంతో స్థానికులను చెరదగొట్టి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అయితే, ఈ ఘటనపై మరో వాదన కూడా వినిపిస్తోంది. నిందితుడిని వదిలేశారంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఏలూరు ఫైర్ స్టేషన్ వద్ద ఆందోళనకు కూడా దిగినట్లు తెలుస్తోంది. ఈ ధర్నా జరుగుతున్న సమయంలోనే సురేష్ను కొట్టి చంపినట్లు సమాచారం. దాడి సమయంలో భయపడి సురేశ్ ఏలూరు బస్టాండ్ సెంటర్ లోని ప్లై ఓవర్ పై నుంచి దూకేశాడని, అయినా వదిలిపెట్టకుండా స్థానికులు దాడి చేసి రైలు పట్టాలపై పడేశారని రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.