బూర్గంపాడు, న్యూస్‌లైన్ : తెలంగాణ విజయయాత్రలో భాగంగా శనివారం రాత్రి బూర్గంపాడుకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు, కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్, రాష్ట్ర మాజీ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రేగా కాంతారావు, డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావును స్థానికులు అడ్డుకున్నారు.
బూర్గంపాడు మండలాన్ని తెలంగాణలోనే ఉంచుతామని స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ నిలదీశారు. ఈ మేరకు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆందోళనకారులు శాంతించారు. బూర్గంపాడు ప్రధాన కూడలిలో జరిగిన సభలో కాంగ్రెస్ నేతలు ప్రసంగిస్తున్న సమయంలోనూ ‘బూర్గంపాడును తెలంగాణలోనే ఉంచాలి’ అంటూ నినాదాలు హోరెత్తాయి.
ఆందోళన చెందొద్దు
బూర్గంపాడును సీమాంధ్రకు వదులుకునే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మాజీ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి స్థానికులకు భరోసానిచ్చారు. బూర్గంపాడు తెలంగాణలోనే ఉంటుందని, దీనికి సంబంధించి ఎలాంటి ఆందోళనకు గురికావద్దని అన్నారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపితే ఉత్పన్నమయ్యే నష్టాలను యూపీఏ చైపర్సన్ సోనియాగాంధీకి, కేంద్ర మంత్రులకు వివరించామని తెలిపారు.
లక్షలాది మంది ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పామన్నారు. పరిపాలనపరంగా, భౌగోళికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారి దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. బీజేపీతో పాటు కొందరు సీమాంధ్ర నాయకుల ఒత్తిళ్ల కారణంగానే ముంపు గ్రామాలు సీమాంధ్రలో విలీనమయ్యే అంశం ఉత్పన్నమైందన్నారు. జిల్లాలోని అన్ని ముంపు గ్రామాలనూ తెలంగాణలో ఉంచేందుకు కృషిచేస్తున్నామని స్పష్టం చేశారు.
రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు మాట్లాడుతూ బూర్గంపాడు వాసులు నిశ్చింతగా ఉండాలని, ఆందోళన పడే అవసరమే లేదని అన్నారు. ఈసభలో పీసీసీ కార్యదర్శి ఎడమకంటి రోశిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మానుకొండ రాధాకిశోర్, చెన్నం సూర్యప్రసాద్, వెంకట్‌గౌడ్, డాక్టర్ చెన్నం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నేతలకు నిరసన సెగలు
Published Sun, Mar 2 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM
Advertisement
Advertisement