బూర్గంపాడు,న్యూస్‌లైన్: తెలంగాణ చారిత్రక నేపధ్యం ఉన్న బూర్గంపాడును సీమాంధ్రలో కలపడం పట్ల స్థానికులు కలవరం చెందుతున్నారు. వందల ఏళ్లుగా తెలంగాణలో మమేకమైన బూర్గం పాడు ఇక ఆంధ్రప్రాంతానికి వెళుతుందనే దానిని జీర్ణించుకోలేకపోతున్నారు. గోదావరినదిపై బ్రిడ్జి నిర్మించకముందు తెలంగాణ- ఆంధ్రాప్రాంతాల రాకపోకలకు కూడలైన బూర్గంపాడును సీమాంధ్రలో కలపటం అన్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతం పరిశీలిస్తే....
భద్రాద్రి రామాలయం నిర్మాణసమయంలో కూడా అన్నిరకాల వస్తురవాణా బూర్గంపాడు నుంచే జరిగేదని చరిత్రచెబుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వాహనాలలో వచ్చిన వస్తువులు, సరుకులు ఇక్కడే దిగుమతి అయ్యేవి. భద్రాచలం వచ్చే భక్తులు ఇక్కడే సేదతీరేవారు. బూర్గంపాడు నుంచి కాలిదారిన, ఎడ్లబండ్లపై గోదావరి నీటివరకు వెళ్లి, అక్కడ్నుంచి పడవలలో భద్రాచలం చేరేవారు. నిజాం నవాబుల కాలంలో కంచర్ల గోపన్న(రామదాసు) పాల్వంచ పరగణాకు తహశీల్దార్‌గా ఉండి ఈ ప్రాంత ప్రజల నుంచి వసూలు చేసిన శిస్తులతోనే రామాలయం నిర్మించారని స్థానికులు అంటున్నారు. భద్రాచలాన్ని తెలంగాణలో ఉంచి బూర్గంపాడును సీమాంధ్రలో కలపటం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
గోదావరి బ్రిడ్జి నిర్మాణ అనంతరం బూర్గంపాడు మీదుగా సారపాక నుంచి భద్రాచలానికి రోడ్డుమార్గం వేశారు. 2009 నియోజకవర్గాల పునర్విభజన వరకు శాసనసభ నియోజకవర్గ కేంద్రంగా బూర్గంపాడుకు జిల్లాలో విశిష్టస్థానం ఉంది. నిజాం నవాబుల నాటి భవనాలు నేటికీ ఇక్కడ ఉన్నాయి. తహశీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి, పోస్ట్‌ఆఫీస్‌లు వీటిలోనే కొనసాగుతున్నాయి. ఇంకా విశేషమేమంటే ఆకాలంలో ఇక్కడ చెలామణిలో ఉన్న నాణేలు ఆంధ్రలో చెల్లుబాటయ్యేవి కావు. పూర్వం నుంచి సాగుతున్న తెలంగాణ ఉద్యమాలలో ఇక్కడి నాయకులు క్రియాశీలకంగా పాల్గొన్నారు.
నిజాం నవాబుల పాలనలో ఉన్న తెలంగాణ పాలన వ్యవహారం ఉర్దూలోనే కొనసాగింది. బూర్గంపాడుకు సంబంధించిన అన్నివిభాగాల పాత రికార్డులు ఉర్దూలోనే ఉన్నాయి. ఎంతో తెలంగాణ చారిత్రక నేపధ్యం ఉన్న బూర్గంపాడును సీమాంధ్రలో కలపడటం దారుణమని స్థాని కులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాలలో లేని బూర్గంపాడును ఇప్పుడు ఏ ప్రాతిపదికన సీమాంధ్రలో కలిపారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
బంద్‌కు పిలుపు: బూర్గంపాడును సీమాంధ్రలో కలపటాన్ని నిరసిస్తూ గురువారం అన్నిరాజకీయపార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనిని తెలంగాణలోనే కొనసాగించాలనే డిమాండ్‌తో ఆందోళనలను ఉధృతం చేసేందుకు ఐక్యకార్యచరణను రూపొందిస్తున్నారు.
విలీనం.. అన్యాయం...
Published Thu, Feb 20 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM
Advertisement
Advertisement