burgam padu
-
‘సీతారామ’ వేగం పెంచాలి
బూర్గంపాడు: ‘సీతారామ’ ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎంగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన అనంతరం శనివారం ఆయన ప్రగతిభవన్‌లో ఇంజనీరింగ్ అధికారులతో సీతారామ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సమీక్షించారు. పనుల్లో వేగం పెంచేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన పర్యావరణ అనుమతులకు లైన్ క్లియర్ అయిందని తెలిపారు. పనుల నిర్వహణకు రూ.11వేల కోట్ల నిధుల సేకరణ కూడా పూర్తయిందని స్పష్టం చేశారు. పనుల వేగాన్ని పెంచి అనుకున్న సమయానికి పొలాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో ఎలాంటి ఆలసత్వం, నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పనులు నిర్వహిస్తున్న వర్క్ ఏజెన్సీలతో కూడా తాను స్వయంగా మాట్లాడుతానని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌పై సీఎం ప్రత్యేక దృష్టి సారించటంతో అధికారులు, కాంట్రాక్టర్లలో ఉరుకులు, పరుగులు మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లాలో 7 లక్షల ఎకరాలకు సాగునీరు.. సీతారామ ప్రాజెక్ట్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇందుకు గాను ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి, కాలువలకు మొత్తంగా 21 వేల ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే పట్టాభూముల సేకరణ ప్రక్రియ పూర్తయింది. ఇక అసైన్డ్ భూములు, ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూముల సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. దీన్ని త్వరితగతిన పూర్తిచేసి భూనిర్వాసిత రైతులకు వెంటనే పరిహారం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటితో పాటు 3800 ఎకరాల అటవీ భూములను కూడా ఈ ప్రాజెక్ట్ కోసం సేకరించాల్సి ఉంది. ఇందుకు కేంద్రప్రభుత్వ పర్యావరణ అనుమతులు తప్పనిసరిగా మారాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన పర్యావరణ అనుమతుల మదింపు కమిటీ సమావేశంలో సీతారామ ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇక కేంద్రప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు జారీ చేయటం లాంచనంగా మారింది. ఇప్పటికే కేంద్రం భూసేకరణ, అటవీ, వన్యప్రాణి సంరక్షణ అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఇప్పటి వరకు నెమ్మదిగా సాగిన పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. గత వర్షాకాలంలో సీతారామ కాలువల్లోకి నీరు చేరటంతో పనుల నిర్వహణకు ఒకింత ఇబ్బందులు ఎదురయ్యాయి. మళ్లీ వర్షాకాలం నాటికి కాలువ పనులను పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. భూసేకరణ, పనుల నిర్వహణలో ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు తాను నివేదికలను పరిశీలించటంతో పాటు పనులతీరును స్వయంగా పరిశీలిస్తానని ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు. పనుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, అభ్యంతరాలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ పరిణామాలతో సీతారామ ప్రాజెక్ట్ పనులు వేగవంతమయ్యేలా కనిపిస్తోంది. -
అభ్యర్థులు వారే.. కూటములే మారాయి
సాక్షి, బూర్గంపాడు: పినపాక నియోజకవర్గం ఎన్నికల ముఖచిత్రం రివర్సయింది. 2009లో మహాకూటమి అభ్యర్థిగా సీపీఐ నుంచి పాయం వెంకటేశ్వర్లు బరిలో నిలిచారు. పోటీగా కాంగ్రెస్ నుంచి రేగా కాంతారావు బరిలో దిగి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థిగా రేగా కాంతారావు బరిలో నిలిచారు. ఆయనకు ప్రత్యర్థిగా అధికార టీఆర్ఎస్ నుంచి పాయం వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు. వీరిద్దరూ రెండోసారి తలపడుతున్నారు. 2009 2009లో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలు మహాకూటమిగా జట్టు కట్టాయి. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సారథ్యంలో కాం గ్రెస్ ఒంటరిగా పోటీలో నిలిచింది. ఆ ఎన్నికల్లో గెలిచిన, ఓడిన పూర్తి బాధ్యత తనదేనని వైఎస్ ప్రకటించారు. 2009లో నియోజకవర్గాల పునర్విజనలో భాగంగా బూర్గంపాడు నియోజవర్గాన్ని రద్దుపరిచి కొత్తగా పినపాక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 2009లో అనూహ్య పరిస్థితుల మధ్య కాంగ్రెస్ టిక్కెట్ దక్కించుకున్న రేగా కాం తారావు మహాకూటమి అభ్యర్థి పాయంపై 350 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన రేగా కాంతారావు విజయానికి వైఎస్ చరిష్మా ఎంతగానో ఉపయోగపడింది. 2014 2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీపీఐతో జట్టు కట్టగా, టీడీపీ, బీజేపీలు జట్టుగా నిలిచాయి. ఈ రెండు కూటములకు వైఎస్సార్సీపీ, సీపీఎం కూటమి పోటీగా నిలిచాయి. టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా బరిలో నిలిచింది. 2014 ఎన్నికల్లో సీపీఐతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీ సిట్టింగ్ సీటును సీపీఐకి కేటాయించింది. దీంతో ఈ ఎన్నికల్లో రేగా కాంతారావు పోటీలో నిలిచే అవకాశం లేకుండా పోయింది. అప్పటికే సీపీఐ నుంచి వైఎస్సార్ సీపీలో చేరిన పాయం వెంకటేశ్వర్లు వైసీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచి విజయం సాధించారు. ఆ తరువాత పరిణామాలలో ఆయన అధికార టీఆర్ఎస్లో చేరారు. 2018 ప్రస్తుత ఎన్నికల్లో పాత ప్రత్యర్థులు మళ్లీ తలపడుతున్నారు. ప్రజాకూటమి అభ్యర్థిగా రేగా, టీఆర్ఎస్ అభ్యర్థిగా పాయం మధ్య రసవత్తర పోరు నడుస్తోంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో జట్టు కట్టిన సీపీఐ అభ్యర్థిగా పాయం వెంకటేశ్వర్లు పోటీలో నిలిచి.. టీడీపీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లుపై విజయం సాధించారు. ప్రస్తుతం ప్రధానపోటీదారులైన పాయం వెంకటేశ్వర్లు సీపీఐ నుంచి ఒకసారి, వైఎస్సార్సీపీ నుంచి ఒకసారి గెలిచారు. ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. పోటీచేసిన తొలిసారే కాంగ్రెస్ తరఫున విజయం సాధించిన రేగా కాంతారావు మరోసారి గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తున్నారు. -
పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య
బూర్గంపాడు: అప్పులు తీర్చే దారి కానరాక ఓ రైతు బలవన్మరణం చెందాడు. ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మదమంచి నర్సింహారావు(43) ఆదివారం రాత్రి పొలానికి వెళ్లి అక్కడే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పంటలు సరిగా పండకపోవటంతో అప్పుల బాధ తాళలేకనే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. -
గర్భిణి ఆత్మహత్యాయత్నం
బూర్గంపాడు: భర్తతో మనస్పర్థల కారణంగా ఓ గర్భిణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సోంపాక అనూష ఏడు నెలల గర్భిణి. లక్ష్మీపురంలోని పుట్టింటికి ఆమె భర్తతో కలసి వచ్చింది. గురువారం రాత్రి భార్యభర్తల మధ్య చిన్న గొడవ జరిగింది. దీంతో తాను చనిపోతానని బెదిరించిన అనూష... తెల్లవారుజామున ఇంటి ముందు వంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను భద్రచాలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
కాంగ్రెస్ నేతలకు నిరసన సెగలు
బూర్గంపాడు, న్యూస్‌లైన్ : తెలంగాణ విజయయాత్రలో భాగంగా శనివారం రాత్రి బూర్గంపాడుకు చేరుకున్న కాంగ్రెస్ నాయకులు నిరసనలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు, కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్, రాష్ట్ర మాజీ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రేగా కాంతారావు, డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావును స్థానికులు అడ్డుకున్నారు. బూర్గంపాడు మండలాన్ని తెలంగాణలోనే ఉంచుతామని స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ నిలదీశారు. ఈ మేరకు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఆందోళనకారులు శాంతించారు. బూర్గంపాడు ప్రధాన కూడలిలో జరిగిన సభలో కాంగ్రెస్ నేతలు ప్రసంగిస్తున్న సమయంలోనూ ‘బూర్గంపాడును తెలంగాణలోనే ఉంచాలి’ అంటూ నినాదాలు హోరెత్తాయి. ఆందోళన చెందొద్దు బూర్గంపాడును సీమాంధ్రకు వదులుకునే ప్రసక్తే లేదని కేంద్ర మంత్రి బలరాం నాయక్, రాష్ట్ర మాజీ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి స్థానికులకు భరోసానిచ్చారు. బూర్గంపాడు తెలంగాణలోనే ఉంటుందని, దీనికి సంబంధించి ఎలాంటి ఆందోళనకు గురికావద్దని అన్నారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపితే ఉత్పన్నమయ్యే నష్టాలను యూపీఏ చైపర్సన్ సోనియాగాంధీకి, కేంద్ర మంత్రులకు వివరించామని తెలిపారు. లక్షలాది మంది ఆదివాసీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పామన్నారు. పరిపాలనపరంగా, భౌగోళికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారి దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. బీజేపీతో పాటు కొందరు సీమాంధ్ర నాయకుల ఒత్తిళ్ల కారణంగానే ముంపు గ్రామాలు సీమాంధ్రలో విలీనమయ్యే అంశం ఉత్పన్నమైందన్నారు. జిల్లాలోని అన్ని ముంపు గ్రామాలనూ తెలంగాణలో ఉంచేందుకు కృషిచేస్తున్నామని స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు మాట్లాడుతూ బూర్గంపాడు వాసులు నిశ్చింతగా ఉండాలని, ఆందోళన పడే అవసరమే లేదని అన్నారు. ఈసభలో పీసీసీ కార్యదర్శి ఎడమకంటి రోశిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మానుకొండ రాధాకిశోర్, చెన్నం సూర్యప్రసాద్, వెంకట్‌గౌడ్, డాక్టర్ చెన్నం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
విలీనం.. అన్యాయం...
బూర్గంపాడు,న్యూస్‌లైన్: తెలంగాణ చారిత్రక నేపధ్యం ఉన్న బూర్గంపాడును సీమాంధ్రలో కలపడం పట్ల స్థానికులు కలవరం చెందుతున్నారు. వందల ఏళ్లుగా తెలంగాణలో మమేకమైన బూర్గం పాడు ఇక ఆంధ్రప్రాంతానికి వెళుతుందనే దానిని జీర్ణించుకోలేకపోతున్నారు. గోదావరినదిపై బ్రిడ్జి నిర్మించకముందు తెలంగాణ- ఆంధ్రాప్రాంతాల రాకపోకలకు కూడలైన బూర్గంపాడును సీమాంధ్రలో కలపటం అన్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతం పరిశీలిస్తే.... భద్రాద్రి రామాలయం నిర్మాణసమయంలో కూడా అన్నిరకాల వస్తురవాణా బూర్గంపాడు నుంచే జరిగేదని చరిత్రచెబుతోంది. సుదూర ప్రాంతాల నుంచి వాహనాలలో వచ్చిన వస్తువులు, సరుకులు ఇక్కడే దిగుమతి అయ్యేవి. భద్రాచలం వచ్చే భక్తులు ఇక్కడే సేదతీరేవారు. బూర్గంపాడు నుంచి కాలిదారిన, ఎడ్లబండ్లపై గోదావరి నీటివరకు వెళ్లి, అక్కడ్నుంచి పడవలలో భద్రాచలం చేరేవారు. నిజాం నవాబుల కాలంలో కంచర్ల గోపన్న(రామదాసు) పాల్వంచ పరగణాకు తహశీల్దార్‌గా ఉండి ఈ ప్రాంత ప్రజల నుంచి వసూలు చేసిన శిస్తులతోనే రామాలయం నిర్మించారని స్థానికులు అంటున్నారు. భద్రాచలాన్ని తెలంగాణలో ఉంచి బూర్గంపాడును సీమాంధ్రలో కలపటం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గోదావరి బ్రిడ్జి నిర్మాణ అనంతరం బూర్గంపాడు మీదుగా సారపాక నుంచి భద్రాచలానికి రోడ్డుమార్గం వేశారు. 2009 నియోజకవర్గాల పునర్విభజన వరకు శాసనసభ నియోజకవర్గ కేంద్రంగా బూర్గంపాడుకు జిల్లాలో విశిష్టస్థానం ఉంది. నిజాం నవాబుల నాటి భవనాలు నేటికీ ఇక్కడ ఉన్నాయి. తహశీల్దార్ కార్యాలయం, ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి, పోస్ట్ఆఫీస్లు వీటిలోనే కొనసాగుతున్నాయి. ఇంకా విశేషమేమంటే ఆకాలంలో ఇక్కడ చెలామణిలో ఉన్న నాణేలు ఆంధ్రలో చెల్లుబాటయ్యేవి కావు. పూర్వం నుంచి సాగుతున్న తెలంగాణ ఉద్యమాలలో ఇక్కడి నాయకులు క్రియాశీలకంగా పాల్గొన్నారు. నిజాం నవాబుల పాలనలో ఉన్న తెలంగాణ పాలన వ్యవహారం ఉర్దూలోనే కొనసాగింది. బూర్గంపాడుకు సంబంధించిన అన్నివిభాగాల పాత రికార్డులు ఉర్దూలోనే ఉన్నాయి. ఎంతో తెలంగాణ చారిత్రక నేపధ్యం ఉన్న బూర్గంపాడును సీమాంధ్రలో కలపడటం దారుణమని స్థాని కులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం ముంపు గ్రామాలలో లేని బూర్గంపాడును ఇప్పుడు ఏ ప్రాతిపదికన సీమాంధ్రలో కలిపారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. బంద్‌కు పిలుపు: బూర్గంపాడును సీమాంధ్రలో కలపటాన్ని నిరసిస్తూ గురువారం అన్నిరాజకీయపార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీనిని తెలంగాణలోనే కొనసాగించాలనే డిమాండ్‌తో ఆందోళనలను ఉధృతం చేసేందుకు ఐక్యకార్యచరణను రూపొందిస్తున్నారు.