‘గుడు.. గుడు’ చప్పుడు విన్పిస్తే గుండె ఆగినంత పనవుతోంది. వెనుక వైపు నుంచి బైక్ ఏమాత్రం వేగంగా వచ్చినా అదిరిపడే పరి స్థితి. వీధిచివరన ఒకరి కన్నా ఎక్కువ మంది యువకులు మాట్లాడుకుం టున్నా.. అడుగు ధైర్యంగా ముందుకేయలేని దుస్థితి. కనీసం బంగారు తాళితో బయటకెళ్లినా అతివకు రక్షణ కరువైంది. బండిమీద రయ్.. అని వచ్చి.. చైన్లు లాక్కుని జుయ్ అని దూసుకెళ్తున్నారు దొంగలు. -న్యూస్‌లైన్, కరీంనగర్ క్రైం
సమయం రాత్రి 8 గంటలు: సిరిసిల్లలోని గాంధీనగర్‌లో నడుస్తూ వెళ్తున్నారు కందూకూరి అనందం-విజయలక్ష్మి దంపతులు. ఖరీదైన బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు విజయలక్ష్మి మెడలోని 12 తులాల బంగారు నగలను లాక్కుని క్షణాల్లో మాయమయ్యారు.
సమయం సాయంత్రం 5 గంటలు: కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన ఓ ఉద్యోగిని ఇం టికి వెళ్తోంది. వీధి చివర పల్సర్‌బైక్‌పై నీట్‌గా త యారైన ఇద్దరు యువకులు కబర్లు చెప్పుకుంటున్నారు. కాసేపటికే బైక్‌పై వచ్చి ఆమె మెడలోని రెండు తులాల బంగారం చైక్ లాక్కుపోయారు.
సమయం ఉదయం 7గంటలు: కరీంనగర్‌లోని పాతబజారుకు చెందిన మహిళ గుడికి వెళ్తోంది. వీధి మలుపు తిరిగిందో లేదో.. బైక్‌పై రయ్యని దూసుకొచ్చిన ఇద్దరు లిప్తపాటులో ఆమె మెడలోని బంగారు గొలుసు నొక్కేశారు.
వారం వ్యవధిలో వీటితోపాటు10 చోరీలు జరిగాయి. పోలీసుల నిఘా వైఫల్యంతో చోరులు రెచ్చిపోతున్నారు. రెప్పపాటులో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఖరీదైన బైకులు వాడుతూ పెద్దింటి బిడ్డల్లా నమ్మిస్తున్నారు. అనుమానం రాకుండా వెంబడించి సొత్తుతో మాయమవుతున్నారు. ఎవరైనా ప్రతిఘటిస్తే దాడులకూ తెగబడుతున్నారు. వీరంతా ప్రొఫెషనల్సేం కాదు. దొంగల్లో ఉన్నత విద్యావంతులూ ఉండడం కలవరపరుస్తోంది.
జల్సాల కోసం..
కొంతకాలం క్రితం పోలీసులు కొందరు దొంగలను అరెస్టు చేశారు. వీరంతా ఇంజినీరింగ్ విద్యార్థులే అని తెలిసి ఆశ్చర్యపోయారు. చాలామంది ఖరీదైన బైక్‌లపై వచ్చి చోరీలు చేస్తున్నారు. ఇందులో జల్సాలకు అలవాటుపడినవారే అధికం. జిల్లాలో సుమారు 120 మందిదాక దొంగలు ఉన్నారు. ఇందులో 80 శాతం మంది 22 -28 ఏళ్లలోపువారే. బంగారం ధర బాగా పెరగడంతో నగల చోరీపై దృష్టిసారించారు. సులభంగా అమ్ముతూ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు పొందుతున్నారు. నగలతో సంచరించే మహిళలపై నజర్ వేసి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఏ మాత్రం అనుమానం రాకుండా ఆహార్యంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జనావాసాల్లో, జనసమ్మర్థ ప్రాంతాల్లోనూ సులువుగా పనికానిచ్చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు.
పోలీస్ నిఘా జాడేది?
ఇటీవల పోలీస్ నిఘా కొరవడింది. మూడు నెలల్లో జరిగిన భారీ చోరీలే దీనికి తార్కాణం. నగరంలాంటి ప్రాంతాల్లో బ్లూకోట్, ఇంటెలిజె న్స్, స్పెషల్‌బ్రాంచ్, ఐడీ పార్టీ పోలీసులు జనాల్లో తిరుగుతుంటారు. గ్రామాల్లో వీపీవోల ను ఏర్పాటు చేశారు. ఇవేవీ దొంగలకు చెక్ చె ప్పడం లేదు. ఘటన జరిగాక వివరాల సేకరణలోనూ వెనకంజే కన్పిస్తోంది. చోరీ జరిగిందని ఫిర్యాదు చేసినా ఘటన స్థలానికి పోలీసులు వెళ్లని సందర్భాలున్నాయి. మరికొన్ని చోట్ల ఫి ర్యాదు స్వీకరించినా చాలారోజుల దాక కేసులు నమోదు చేయడం లేదని సమాచారం. ఈ నిర్లక్ష్యం దొంగలకు అయాచిత వరం అవుతోంది.
రికవరీలోనూ చేతివాటం
అదృష్టం బాగుండి దొంగలు దొరికితే.. సొత్తు రికవరీలోనూ పోలీసులు చేతివాటం చూపుతున్నారు. పూర్తిస్థాయిలో రికవరీ అయినా సొత్తును బాధితులకు ఇవ్వడం లేదనే ఆరోపణలున్నాయి. లేకపోతే కల్తీ బంగారం కట్టబెడుతున్నట్లు సమాచారం. తాజాగా ఓ ఠాణా నుంచి బాధితుడికి కోర్టు ద్వారా సుమారు 36 గ్రాముల బంగారం రికవరీ చేశారు. తీరా దాన్ని పరిశీలిస్తే 14 గ్రాములు రాగి కలిపారు.
రయ్.. గయ్..!
Published Fri, Aug 23 2013 3:13 AM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM
Advertisement