అసాంఘిక కార్యకలాపాలను అణచివేయడంలో పోలీసుల మెతకవైఖరి సరికాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఎస్పీ, కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు. ప్రధానంగా పేకాట క్లబ్‌లపై మెరుపు దాడులు నిర్వహించి వాటి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం ఆదేశించారు. దీంతో పట్టణంలోని రిక్రియేషన్ క్లబ్‌లో జరుగుతున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. క్లబ్‌లో పేకాట జరగకుండా పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
సాక్షి, కదిరి(అనంతపురం) : పట్టణంలో సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఎదురుగానే పెద్దల పేకాట అడ్డా ఉంది. కొన్నేళ్లుగా అక్కడ రిక్రియేషన్ ముసుగులో పేకాట జోరుగా సాగుతోంది. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి చెందిన రాజారెడ్డి ఆ పేకాట క్లబ్‌కు అధ్యక్షుడిగా ఉంటూ దాన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పేకాట కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని, జిల్లా ఎస్పీ దానిపై దృష్టి సారించాలని పట్టణవాసులు కోరుతున్నారు.
పేరుకే రిక్రియేషన్ క్లబ్
కమ్యూనిటి రిక్రియేషన్ క్లబ్(సీఆర్‌సీ) పేరుతో పట్టణ నడిబొడ్డున అది కూడా పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలో నిర్వహిస్తున్నారు. వాస్తవంగా అక్కడ క్యారమ్స్, చెస్, టేబుల్ టెన్నిస్ లాంటి ఇండోర్ గేమ్స్ మాత్రమే ఆడుకోవడానికి గతంలో అనుమతి నిచ్చారు. కేవలం రిక్రియేషన్ మాత్రమే అక్కడ కన్పించాలి. అయితే అందులో ఎక్కడా ఇండోర్ గేమ్స్ కనిపించవు. కింద అంతస్తులోనే కాకుండా పై అంతస్తులో కూడా పేకాట ఆడేందుకు పలు టేబుళ్లు ఏర్పాటు చేశారు. పేకాట రాయుళ్లకు ఉక్కపోత ఉండకూడదని ఏసీలు కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌లో ప్రతి ఆటకు పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి పేకాట ఆడుతున్నారు. ఇది ఇక్కడున్న పోలీసు అధికారులకు తెలియదనుకుంటే పొరపాటే. వారు దీన్ని ‘మామూలు’గా తీసుకుంటున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పేకాట క్లబ్ వైపు పోలీసులు తొంగి చూసిన పాపాన పోలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడినా అక్కడ ఎలాంటి మార్పు కనబడటం లేదు.
ఇక్కడ కందికుంటదే హవా
‘2009 నుంచి ఇప్పటి దాకా ఏటా జనవరి 26న మా నాయకుడు, టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కందికుంట వెంకట ప్రసాదే ఈ క్లబ్‌లో జాతీయ జెండా ఎగరేస్తున్నారు. 2014లో చాంద్‌బాషా ఎమ్మెల్యే అయినప్పటికీ ఇక్కడ మాత్రం కందికుంటే ఎమ్మెల్యే. అందుకే మా నాయకుడు కందికుంటే ఇక్కడ జాతీయ జెండాను ఎగరేస్తున్నాడు. ఇక భవిష్యత్‌లో కూడా కందికుంటే ఎగరేస్తాడు. దమ్ముంటే క్లబ్‌ను టచ్ చేసి చూడండి’ అని ఈ క్లబ్‌లో ఉన్న కొందరు కందికుంట అనుచరులు సవాల్ విసురుతున్నారు. ఇక్కడ పేకాట జరుగుతున్న బహిరంగ రహస్యమని కూడా వారంటున్నారు.
క్లబ్ ఫలితంగా ఎన్నో కుటుంబాలు నాశనం
సీఆర్‌సీ క్లబ్‌లో పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయి పట్టణానికి చెందిన రాజారెడ్డి, వెంకటేష్ అనే ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. రామాంజులురెడ్డి అనే మరో ఎల్‌ఐసీ ఉద్యోగి పేకాటలో భారీగా డబ్బు పోగొట్టుకున్నారు. దీనిపై ఆయన భార్య అప్పట్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో చేసేది లేక ఆ కుటుంబం హైదరాబాద్‌కు బదిలీ చేసుకొని వెళ్లిపోయారు. ఆ క్లబ్‌ను ఆనుకునే అమ్మాయిల హాస్టల్ కూడా ఉంది. క్లబ్‌లోని కొందరు సభ్యులు క్లబ్‌లోనే మద్యం సేవించి హాస్టల్ అమ్మాయిలనే వేధించడంతో పాటు హాస్టల్‌ల్లోకి రాళ్లు విసిరిన సంఘటనలు కూడా లేకపోలేదు. దీనిపై గతంలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేశారు. సభ్యుల మధ్య కూడా పలుమార్లు గొడవలు జరిగి స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు. కేవలం కాలక్షేపం కోసం ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి అనుమతిస్తే పేకాట రిక్రియేషన్ క్లబ్ కాస్తా పేకాట క్లబ్‌గా మార్చేశారని కొందరు క్లబ్ సభ్యులే వాపోతున్నారు. జిల్లా ఎస్పీ బూసారపు సత్య యేసుబాబు పరిశీలించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment