వాడవలస(ఎల్.ఎన్.పేట), న్యూస్‌లైన్: వరదలు సంభవించే సమయంలో ముంపు గ్రామాల్లో ప్రజలకు వంట చేయడానికి బియ్యం నిల్వ చేసిన గిడ్డంగిపై కొందరు గ్రామస్తులు దాడి చేసి సరుకులు ఎత్తుకువెళ్లిపోయారు. సుమారు 20 క్వింటాళ్ల బియ్యంను వారు పట్టుకుపోగా రంగంలోకి దిగిన పోలీసులు 6 మూటల్లో ఉన్న సుమారు రెండు క్వింటాళ్ల బియ్యాన్ని అడ్డుకున్నారు. ఎల్.ఎన్.పేట మండలం వాడలవలసలో గురువారం ఉదయం జరిగిన ఈ సంఘటన వివరాలు ఇవీ... వంశధార నదికి ఇటీవల వరదలు రావడంతో గ్రామాల్లో లోతట్టు గ్రామాలైన దబ్బపాడు, వాడవలస, మిరియాపల్లి, బసవరాజుపేట, లక్ష్మీనర్సుపేటల్లో వంట వండడానికి అధికారులు ఒక్కో గ్రామానికి 30 క్వింటాళ్ల బియ్యం, 100 కిలోల కందిపప్పు, 15 ఆయిల్ ప్యాకెట్లు, 5 కిలోల ఉప్పు, 2 కిలోల కారం తదితర సామగ్రి అధికారులు డీలర్ల ఆధ్వర్యంలో ఉంచారు.
ఈ క్రమంలో వాడవలస గ్రామానికి వచ్చిన సరుకులో వరదల సమయంలో 3 క్వింటాళ్ల బియ్యం వినియోగించారు. మిగిలిన 27 క్వింటాళ్ల బియ్యంలో పాటు 90 కిలోల కందిపప్పు, 11 ప్యాకెట్లు ఆయిల్, 4 ప్యాకెట్లు ఉప్పు, ఒక ప్యాకెట్ కారం గ్రామీణ పౌరసరఫరాల గిడ్డంగిలో నిల్వ చేసినట్లు డీలర్ పి.సీతారాం నివేదికలో పేర్కొన్నట్లు డీటీ బి.గోపాల్ చెప్పారు. ఇదిలా ఉండగా గిడ్డంగిలో నిల్వ చేసిన సరుకులను ముఖ్యంగా బియ్యం తమకు ఇవ్వాలంటూ గ్రామస్తులు రెండు రోజులుగా తహశీల్దార్ రమణమూర్తి, డీలర్ సీతారాంప ఒత్తిడి చేస్తున్నారు. వంటలు చేయడానికి ఉద్దేశించిన బియ్యం ఎలా పంచుకుంటారని తహశీల్దార్ చెప్పి గ్రామస్తుల ప్రతిపాదనను వ్యతిరేకించారు. దీంతో గ్రామస్తులు గురువారం ఉదయం గ్రామీణ పౌరసరఫరాల గిడ్డంగి తాళాలు పగలగొట్టి బియ్యం పట్టుకుపోయారు.
ఈ విషయం తెలిసి తహశీల్దార్ రమణమూర్తి సరుబుజ్జిలి ఎస్‌ఐ ఎస్.సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్‌ఐ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ పోగుపోసిన బియ్యంతో పాటు ఎనిమిది బస్తాలతో ఉన్న 4 క్వింటాళ్ల బియ్యాన్ని, గ్రామీణులు పంచుకుని మూటలతో తీసుకుని వెళ్లేందుకు సిద్ధం చేసిన 12 మూటల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తులతో సమావేశమైన తహశీల్దార్, ఎస్‌ఐ వారికి నచ్చచెప్పారు. ఇంకా కొంతమందికి బియ్యం అందలేదని, బియ్యాన్ని పంచుకునే అవకాశం ఇవ్వాలని గ్రామస్తులు పట్టుబట్టారు. బియ్యం సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువె ళతామని, వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ చెప్పారు. ఇదిలా ఉండగా గ్రామీణ పౌరసరఫరాల సరుకులు నిల్వ ఉన్న గిడ్డంగిని లూటీ చేసి సరుకులు దోపిడీ చేసినందుకు గాను గ్రామస్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నట్లు తహశీల్దార్ రమణమూర్తి చెప్పారు. డీలరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 15 మందిపై ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తులో మరికొంతమందిపై చర్యలు తప్పవన్నారు.