అసెంబ్లీ చర్చపై ప్రజల పెదవి విరుపు | peoples response on assembly meeting | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ చర్చపై ప్రజల పెదవి విరుపు

Published Fri, Jan 10 2014 2:09 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

peoples response on assembly meeting

 అన్నపూర్ణ లాంటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించే బిల్లుపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చను వివిధ వర్గాల ప్రజలు, మేధావులు తప్పుబడుతున్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే చర్చకు ముందు ఓటింగ్ జరపాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. సీమాంధ్ర ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఓటింగ్ లేకుండా చర్చ జరిపి బిల్లును పంపితే.. విభజనకు అనుకూలంగా ఆమోదం తెలిపినట్లే అవుతుందని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు డ్రామాలాడుతున్నారని దుయ్యబట్టారు. విభజన బిల్లుపై చర్చను అడ్డుకోవాల్సిన సీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేల తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. ఓటింగ్ కోసం డిమాండ్ చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. మొదటి నుంచి సమైక్యవాణి వినిపిస్తున్న పార్టీ సభ్యులు సభలో లేకుండా ఎలా చర్చ జరుపుతారని ప్రశ్నిస్తున్నారు. - న్యూస్‌లైన్,
 కర్నూలు విద్య/ కలెక్టరేట్
 
 కిరణ్, చంద్రబాబు డ్రామాలాడుతున్నారు
 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అసలు అసెంబ్లీకే రాకుండా విభజనకు సహకరిస్తూ డ్రామాలాడుతున్నారు. ప్రజలు దీనిని గమనించడం లేదనుకుంటే పొరపాటు. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు ఏనాడూ విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఒకవైపు సమైక్యవాదినని చెబుతూనే అధిష్ఠాన వర్గానికి అనుకూలంగా పావులు కదుపుతున్నారు.
 - అలిబాషా, అలి కమ్యూనికేషన్స్
 
 చర్చ జరిగితే విభజనకు అంగీకరించినట్లే
 తెలంగాణా బిల్లు ముసాయిదాపై చర్చ జరిపితే పరోక్షంగా రాష్ట్ర విభజనకు అంగీకరించినట్లే. దీనిని వ్యతిరేకించిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సరికాదు. వారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు. ఓటింగ్ తర్వాత చర్చ జరపాలని వారు చేస్తున్న డిమాండ్ సరైనదే. రాష్ట్ర విభజన చేయకూడదని బిల్లును ఓటింగ్ ద్వారా తిప్పిపంపించకుండా చర్చ జరపడం సీమాంధ్రులకు అవమానకరం.
 -కె. విజయభాస్కర్‌యాదవ్,
 ఉపాధ్యాయుడు
 
 చర్చ వల్ల ఒరిగేదేమీ లేదు
 రాష్ట్ర విభజనపై శాసనసభ్యుల ఎలాంటి అభిప్రాయం చెప్పినా చివరకు రాష్ట్రపతి, పార్లమెంటుకే నిర్ణయాధికారం ఉంది.  చర్చ వల్ల ఒరిగేదేమీ లేదు. ముందుకు శాసనసభలో సమైక్య తీర్మానం చేసి చర్చ జరిపితే దాని ఫలితం నిర్ణయంపై పడుతుంది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒకరిపై విమర్శలు మానుకుని రాష్ట్ర విభజనను కలసికట్టుగా అడ్డుకోవాలి
 - సి.పి.మద్దిలేటి, న్యాయవాది
 
 సమైక్యానికి అనుకూలంగా
 తీర్మానం చేయాల్సిందే
 తెలంగాణా బిల్లు ము సాయి బిల్లుపై చర్చ జరిపి ఓటింగ్ జరపాలా లేక ఓటింగ్ జరిపి చర్చ మొదలెట్టినా చివరగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తీ ర్మానం చేసి పంపించాల్సిందే. అయితే చర్చ పేరు తో ఓటింగ్‌ను దాటేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. ఓటింగ్ జరపాలని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టడం సరైంది.
 - పి. లింగేశ్వరరెడ్డి,
 నారాయణ
 విద్యాసంస్థల సీఈవో
 
 ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి
 రాష్ట్ర శాసనసభలో విభజన బిల్లుపై చర్చ అవసరం లేదు. కేవలం సభలో ఓటింగ్ జరిపి మెజారిటీ సభ్యుల నిర్ణయాన్ని రాష్ట్రపతికి పంపితే సరిపోతుంది. ప్రత్యేక తెలంగాణపై రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని, రాబోవు సాధారణ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలలో రాష్ట్ర విభజనపై ఓటర్ల అభిప్రాయం కోసం ఒక కాలం ఏర్పాటు చేయాలి. తెలంగాణలో సైతం ప్రజలు సమైక్య రాష్ట్రానికే మద్దతు పలికే వారు ఉన్నారు.
 - ఎన్.నారాయణరెడ్డి, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్
 
 చర్చను అడ్డుకోవాలి
 అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఆమోదించుకునే ప్రయత్నంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. వారు సీమాంధ్ర ప్రజల మనోభావల కోసం పోరాడుతుంటే సస్పెండ్ చేయడం దారుణం. వెంటనే వారిని సభలోకి ఆహ్వానించి ఓటింగ్‌లో పాల్గొనేటట్లు చేయాలి. తెలంగాణ బిల్లు ముసాయిదాపై చర్చ జరుపుతూనే తప్పనిసరిగా ఓటింగ్ పెట్టాలి. ఓటింగ్ లేకుండా జరుగుతున్న చర్చను సీమాంధ్ర ఎమ్మెల్యేలందరూ వ్యతిరేకించాలి. అలా చేయకపోతే వారిని ప్రజల్లో తిరగనివ్వం.
 - వి. జనార్థన్‌రెడ్డి, విద్యా సంస్థల జేఏసీ అధ్యక్షులు
 
 చర్చతో ప్రయోజనం లేదు
 ఓటింగ్ లేకుండా చర్చ జరపడంతో రాష్ట్ర విభజన అడ్డుకోలేం. సభలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు కలసి కట్టుగా సమైక్య వాణిని వినిపిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు చర్చకు అంగీకరించడం తగదు. ప్రజల్లోకి వచ్చినప్పుడు ఒకలా.. సభలో మరోలా వ్యవహరించడం సమంజసం కాదు. రాష్ట్ర విభజన జరిగితే ఆ రెండు పార్టీలే బాధ్యత వహించాలి.
 - శ్రీరాములు, జిల్లా ఎన్‌జీఓ అసోసియేషన్ కార్యదర్శి   
 
 
 తెలంగాణ బిల్లును ఓడించాలి
 తెలంగాణ బిల్లును ఓడించాల్సిన అవసరం ఎంతుందో సమైక్య తీర్మానం చేయాల్సిన అవసరం కూడా అంతే ఉంది. రాష్ట్రం సమైక్యంగా ఉండటానికి తెలంగాణ బిల్లును ఓడించడం, సమైక్య తీర్మానం చేయడం రెండూ ప్రధానమే. వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి సమైక్య తీర్మాణానికి కట్టుబడి ఉండటం ఆ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనం. మిగిలిన పార్టీలు కూడా ఇలాగే ముందుకు రావాలి.
 - కె.సి.హెచ్.కృష్ణుడు, జిల్లా ఎన్‌జీఓ సంఘం నేత  
 
 సమైక్య వాదానికి కట్టుబడిందే వైఎస్‌ఆర్‌సీపీనే
 వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ మాత్రమే మొదటి నుంచి సమైక్యవాదానికి కట్టుబడి ఉంది. దీంతో విభజనకు ఎక్కడ అడ్డుపడతారోనని భావించి రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్‌సీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఉభయసభల నుంచి సస్పెండ్ చేసింది. సీఎం కిర్‌ణ్ కుమార్‌రెడ్డి తెలంగాణా ముసాయిదా బిల్లుపై ఒకసారి ఓటింగ్ ఉంటుందంటే, ఆనం నారాయణరెడ్డి మాత్రం లేదంటారు. మొత్తానికి టీడీపీ, కాంగ్రెస్ కలిసి అసెంబ్లీలో రసవత్తర నాటకమాడుతున్నాయి.
 - అల్లం చంద్రమోహన్, మెడికల్‌రెప్
 
 విభజన అడ్డుకోవాల్సింది ఎమ్మెల్యేలే
 రాష్ట్ర విభజను అడ్డుకోవాల్సిన బాధ్యత సీమాంధ్ర ఎమ్మెల్యేపై ఉంది. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేస్తేనే ఇది సాధ్యం. వైఎస్‌ఆర్‌సీపీలా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు సభలో పట్టుబట్టాలి. ఓటింగ్ లేని చర్చతో ఎటువంటి ఉపయోగం లేదు. రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యేలందరూ విభజనను అడ్డుకుని రాష్ర్టం సమైక్యంగా ఉంచేందుకు కృషి చేయాలి.
 - జి.రామకృష్ణారెడ్డి,
 ఎన్‌జీఓ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
 
 బిల్లుకు వ్యతిరేకంగా ఓటింగ్ జరపాలి
 తెలంగాణ ముసాయిదా బిల్లుకు తప్పనిసరిగా ఓటింగ్ జరిపి తీరాలి. 9 కోట్ల రాష్ట్ర ప్రజలు ఆకాంక్షలను, అభిప్రాయాలను సభలో ఎమ్మెల్యేలు వినిపిస్తారని, వారి అభిప్రాయాన్నిచెబుతారని వారికి ఓట్లేశాం. కానీ కొన్ని రాజకీయపార్టీలు కేవలం వారి స్వార్ధరాజకీయ ప్రయోజనాల కోసం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తూ ప్రజలను గందరగోళానికి నెట్టేస్తున్నాయి. బిల్లుపై ఏం జరుగుతుందో అంతుబట్టకుండా అయోమయానికి గురి చేస్తున్నాయి.  ప్రతి ఎమ్మెల్యే తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేయ్యాలి.
 -డాక్టర్ కాకర వాడ చిన్న వెంకటస్వామి,
 సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి చైర్మన్
 
 ముఖ్యమంత్రి ద్వంద్వ వైఖరి వీడాలి
 వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యం కోసం చేస్తున్న కృషి అభినందనీయం. ఈ సమయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ బిల్లుపై ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నారు. సమైక్యవాదినని చెప్పుకుంటూనే విభజనకు అనుకూలంగా వ్యవ హరిస్తున్నారు. ఆర్టికల్-3 ప్రకారం కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాలను చీలుస్తోంది. దీనికి ఆయన వత్తాసు పలకడం మరింత దారుణం. బిల్లుపై అసెంబ్లీలో తప్పనిసరిగా ఓటింగ్ జరపాలి.
 - బి.సుబ్బరాయుడు,
 ఏపీ ఎస్సీ,ఎస్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు
 
 స్పీకర్ చర్యను ఖండించాలి
 ఓటింగ్‌పై డిమాండ్ చేసిన వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను ఉభయసభల నుంచి సస్పెండ్ చేయడం తప్పు. స్పీకర్ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వ అనుసరించే ఈ చర్య సీమాంధ్రకు జరుగుతున్న అన్యాయం గురించి అడిగే వారి నోరునొక్కే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రజల పక్షాన నిలిచే వారిని సభల నుంచి బయటకు పంపించి ఏం తీర్మానం చేస్తారు.
 - సాయిబాబా, ఎస్సీ,
 ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు
 
 సస్పెండ్ చేయడం అన్యాయం
 రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్‌ఆర్‌సీపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ అసెంబ్లీలో ఓటింగ్ జరపాలని కోరుతోంది. తీర్మానం చేసిన తర్వాత చర్చ చేపట్టాలని డిమాండ్ చేయడం మంచి పరిణామం. ఈ డిమాండ్‌కు సమైక్యాన్ని కోరుకునే ఇతర పార్టీలు కలిసి రావాలి. తీర్మానం చేయకుండా చర్చకు పోయి విభజన జరిగితే ఆ పాపం కాంగ్రెస్, టీడీపీలదే.
 - సోమశేఖర్, డిగ్రీ కళాశాలల
 అధ్యాపకుల జేఏసీ నాయకులు
 
 సమైక్య తీర్మానం అత్యవసరం
 రాష్ట్రం విడిపోకుండా సమైక్య తీర్మానం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇందుకు వైఎస్సార్‌సీపీ చేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. సమైక్య తీర్మానంతో పాటు తెలంగాణ బిల్లుపై ఓటింగ్ జరిపి ఓడించాలి. అన్నిదారుల్లో వెళ్లి రాష్ట్ర విభజనను అడ్డుకోవాలి. ఉద్యోగ సంఘాలు కూడా సమైక్య తీర్మానాన్ని డిమాండ్ చేస్తున్నాయి.
 - వి.సి.హెచ్.వెంగల్‌రెడ్డి,
 జిల్లా ఎన్‌జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement