మీది చిత్తూరే...మాది చిత్తూరే!
ఎట్టకేలకు చంద్రబాబునాయుడు దీక్ష ముగిసింది. ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి అండతో అత్యంత నాటకీయంగా ఆయన హస్తినలో దీక్షను దిగ్విజయంగా పూర్తి చేశారు. మీది చిత్తూరే మాది చిత్తూరే...అంటూ ఇద్దరు..... ఒకరికొకరు సహకరించుకునే ప్రహసనంలో మరో అధ్యాయం విజయవంతంగా పూర్తయింది. బాబు కోరినట్టుగా కిరణ్ మద్దతిచ్చారు. ఆ ప్రకారమే బాబు దీక్ష కొనసాగింది. చంద్రబాబు దీక్షా రాజకీయాల లక్ష్యాలపై ముఖ్యమంత్రికి ఓ అవగాహన రాగానే దీక్ష భగ్నం చేయడానికి ఆయన ఒప్పుకోవడం... అందుకు అనుగుణంగానే పోలీసులు వ్యవహరించడం...చంద్రబాబు తప్పుకోవడం జరిగాయని ఢిల్లీ వర్గాల సమాచారం.
గత అయిదు రోజులుగా ఏపీ భవన్లో చంద్రబాబు చేస్తున్న దీక్షను పోలీసులు శుక్రవారం బలవంతంగా భగ్నం చేసి రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఎందుకు దీక్ష చేస్తున్నారో క్లారిటీ ఇవ్వని చంద్రబాబు.... తన దీక్షను ఆది నుంచి మీడియాలో హైలెట్ చేసుకునేందుకు ప్రయత్నించారు. జంతర్ మంతర్ వద్ద కంటే ఆంధ్రాభవన్‌లో దీక్ష నిర్వహించటం వల్లే ఎక్కువ లాభమని భావించిన బాబు చివరిక్షణంలో వ్యూహాత్మకంగా నిర్ణయం మార్చుకున్నారు. దాంతో ఏపీభవన్ అధికారులు పలుమార్లు బాబు దీక్షను అనుమతి లేదంటూ వెంటనే శిబిరాన్ని ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోయింది.
ఈ దీక్షకు అనుమతి లేదంటూ ఏపీ భవన్ అధికారులు పైకి నోటీసులిచ్చినా, దీక్ష కొనసాగడానికి చంద్రబాబు అనుకున్న దీక్షా లక్ష్యాలు నెరవేరేందుకు తమ వంతు సహకారం అందించారు. సీఎం కిరణ్ డైరెక్షన్ ప్రకారమే ఏపీ భవన్ అధికారులు సాయం అందించినట్టు సమాచారం.. ఢిల్లీలో ఎన్నికలకోడ్ అమలులో ఉన్నప్పుడు ప్రభుత్వ అతిథి గృహాలను జడ్ ప్లస్ భద్రత ఉన్న వారికి మినహా ఇతరులకు ఇవ్వరాదు. కానీ ఏపీభవన్‌లోని సుమారు 40 గదులను చంద్రబాబు దీక్షకు వచ్చిన నేతలకే కేటాయించారు. అంతేకాకుండా ఏపీ భవన్ మొత్తం తెలుగుదేశం జెండాలతో కళకళలాడింది.
ఇక ఎన్నెన్నో అంశాల్లో మొదటినుంచీ సీఎం కిరణ్, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుల సహకార యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగిన విషయం అందరికీ తెలిసిందే. ఉప ఎన్నికలు, అవిశ్వాస తీర్మానం తదితర సందర్భాల్లో చంద్రబాబు చేసిన సాయానికి సీఎం కిరణ్ కూడా తగిన సాయం చేస్తూనే ఉన్నారు. తాజాగా చంద్రబాబు చేసిన ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ దీక్షకు కిరణ్ అందించిన సాయం ఈ సహకార యజ్ఞంలో భాగమేననే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. బాబు దీక్ష విషయాన్ని రాష్ట్రప్రభుత్వమే చూసుకుంటుందని స్వయంగా కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటించడం కూడా బాబు, కిరణ్‌ల బంధానికి గీటురాయిగా చెప్పుకోవచ్చు.
మొత్తం మీద చంద్రబాబు అనుకున్న విధంగా ఆయన దీక్షా నాటక లక్ష్యాలు నెరవేరాయని కిరణ్‌కు తెలియగానే దీక్ష భగ్నానికి ఒప్పుకోవడం పోలీసులు చర్యలు తీసుకోవడం చంద్రబాబు దీక్ష ఆపేయడం నాటకీయంగా సాగాయి. ఇక బాబు దీక్షకు జాతీయ పార్టీల నుంచి ఆశించిన స్పందన లభించక పోవటం గమనార్హం. వామపక్షాలతో బాబుకు సన్నిహిత సంబంధాలున్న విషయం తెలిసిందే. ఇద్దరు, ముగ్గురు నేతలు తప్పా ....అయితే సీపీఎం లేదా సీపీఐ నేతలెవ్వరూ శిబిరానికి రాలేదు. ఇంకో కొసమెరుపు ఏంటంటే బావయ్య దీక్షలో.....బావమరిది బాలయ్య కనిపించకపోవటం.