
వ్యక్తి దారుణ హత్య
చిట్యాల(కృష్ణగిరి):
మండల పరిధిలోని చిట్యాల గ్రామంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పండగ పూట చోటుచేసుకోవడంతో గ్రామలో విషాదం అలుముకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చిన్నకేశన్న(26), దేవానంద్ కుటుంబాలు ఐదేళ్ల క్రితం కొంతకాలం హైదరాబాద్‌లో చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగించేవారు. అప్పట్లో చిన్నకేశన్న తనకు తెలిసిన వారి వద్ద దేవానంద్‌కు రూ.లక్షన్నర అప్పు ఇప్పించాడు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు గ్రామానికి వచ్చి జీవనం సాగిస్తున్నారు. అప్పు చెల్లించే విషయంలో తరచూ గొడవ పడుతుండే వారు.
అదే విషయమై గురువారం రాత్రి కూడా మరో సారి చిన్నకేశన్న, దేవానంద్ గొడవ పడ్డారు. ఈక్రమంలో రాత్రి భోజనం చేసి మిద్దెపై నిద్రించిన చిన్నకే శన్న ఉదయానికల్లా రక్తం మడుగులో పడిఉండటం చూసి కుటుంబ సభ్యులు భోరన విలపించారు. మృతుడి భార్య మాదేవి ఏడునెలల గర్భిణి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. దుండగులు గొడ్డలితో నరికి చంపినట్లు నిర్ధారించారు. మృతుడి అన్న సుధాకర్ ఫిర్యాదు మేరకు దేవానంద్‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు.