సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయటాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల కమిషన్ ఈనెల 15వ తేదీన ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి 7న జారీ చేసిన షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ కృష్ణా జిల్లా ఎస్‌ఏ పేట గ్రామానికి చెందిన కంచర్ల నిర్మల కుమారి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులు సోమవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాదులు తాండవ యోగేష్, పలేటి మహేశ్వరరావులు వాదనలు వినిపించారు.
పిటిషనర్ వాదనలు ఇవీ..
- ఎన్నికల కమిషన్ తొలుత జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెలాఖరులోపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మునిసిపల్, పంచాయతీ ఎన్నికలను పూర్తి చేయాల్సి ఉంది.
- షెడ్యూల్ ప్రకటనతో ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. ఎన్నికల కమిషనర్ అకస్మాత్తుగా 6 వారాలు ఎన్నికలను వాయిదా వేస్తూ ఈ నెల 15న నోటిఫికేషన్ జారీ చేశారు.
- ఎన్నికల కమిషనర్‌ది ఏకపక్ష నిర్ణయం. ఎన్నికల వాయిదా విషయంలో రాజకీయ పార్టీలను, అభ్యర్థులను సంప్రదించలేదు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారు. ప్రభుత్వంతో సంప్రదించడం గానీ, ప్రభుత్వ విభాగాల నుంచి నివేదికలు తెప్పించుకోవడం గానీ చేయలేదు.
- ఎన్నికల వాయిదాకు కరోనా వైరస్‌ను సాకుగా చూపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసు ఇప్పటి వరకు ఒక్కటే నమోదైంది.
- ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా నెల రోజుల్లోగా ఎన్నికలు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు. కమిషనర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం.
విచారణ 19కి వాయిదా
ఎన్నికల వాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణ జరగనుందని ప్రభుత్వ న్యాయవాది చింతల సుమన్ కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై విచారణను ఈనెల 19కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
ఉల్లంఘనలపై చర్యలు తీసుకున్నాం: ఎస్‌ఈసీ
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తగిన చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) హైకోర్టుకు నివేదించగా ఈ వివరాలను అఫిడవిట్ రూపంలో అందచేయాలని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వీవీ ప్రభాకరరావును ఆదేశిస్తూ విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరుగుతున్నా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
ఎన్నికల కమిషనర్ నిర్ణయం ఏకపక్షం
Published Tue, Mar 17 2020 4:41 AM | Last Updated on Tue, Mar 17 2020 5:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment