పెట్రోల్ ధర మళ్లీ భగ్గుమంది. నాలుగు నెలల్లో ఇది ఏడో సారి పెరగడం. లీటర్‌కు రూ. 1.63 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : పెట్రోల్ ధర మళ్లీ భగ్గుమంది. నాలుగు నెలల్లో ఇది ఏడో సారి పెరగడం. లీటర్‌కు రూ. 1.63 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. పెరిగిన ధర ప్రకారం ఆదిలాబాద్‌లో ప్రస్తుతం పెట్రోల్ ధర లీటర్‌కు రూ.81.65 పైసలు ఉండ గా రూ.83.28 పైసలకు చేరుకుంది. దీనికి స్థానిక పన్నులు అదనంగా కలవనున్నాయి. సెప్టెంబర్ 1న ప్రభుత్వం పె ట్రోల్‌పై రూ. 2.35 పైసలు పెంచింది. తాజాగా మళ్లీ పెంచడంతో పెట్రోల్ వినియోగదారులపై భారం పడనుంది.
రూ.9 కోట్ల భారం
జిల్లాలో సుమారు 100కుపైగా పెట్రోల్ బంక్‌లు ఉండగా వీటిలో నిత్యం 1.50 లక్షల లీటర్ల పెట్రోల్ వినియోగం జరుగుతుంది. ఈ లెక్కన పెంచిన రూ.1.63 పైసల లెక్కల ప్రకారం రోజుకు రూ.2.44లక్షలు, నెలకు రూ.73.35లక్షలు, ఏడాదికి రూ.8.80 కోట్లు వినియోగదారులపై అదనంగా భారం పడుతుంది. ప్రభుత్వం ఎడాపెడా పెట్రోల్ ధరలు పెంచుతుండటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. రానున్న రోజుల్లో డీజిల్‌పై భారీగా లీటర్‌కు రూ.5 పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్యాస్ ధర కూడా పెంచనున్నారని చెబుతుండటంతో వినియోగదారుల్లో ధరల గుబులు నెలకొంది. ఇదిలా ఉంటే పెంచిన పెట్రోల్ ధరపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. యూపీఏ సర్కార్ ప్రజలపై భారం మోపుతుందని ధ్వజమెత్తుతున్నారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు నింగినంటాయని, పెట్రోల్ ధరలు పదేపదే పెంచుతుండటంతో వాహనాలు నడపలేని పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటున్నారు.