పెట్రోల్‌పై రూ.3.17, డీజిల్‌పై రూ.2 పెంపు
జిల్లాపై రోజుకు రూ.1.20 కోట్ల అదనపు భారం
నిత్యావసర సరుకుల రేట్లపై ప్రభావం
వాహనదారుల సంతోషం కొన్ని రోజులకే ఆవిరైపోయింది. అంతర్జాతీయ విపణిలో చమురు ఉత్పత్తుల ధరలు దిగి వస్తుంటే నెలవారీ బడ్జెట్‌లో మిగులు కనిపిస్తుందని ఆశించిన సగటు జీవికి నిరాశే మిగిలింది. తగ్గించేటప్పుడు రూపాయి, అర్ధ చొప్పున తగ్గించిన కేంద్ర ప్రభుత్వం పెంచేటప్పుడు మాత్రం పెద్దవాత పెట్టింది. ప్రస్తుతం ఏకంగా పెట్రోల్‌పై రూ.3.17, డీజిల్‌పై రూ.2 పెంచేసింది. దీంతో జిల్లాలో పెట్రోల్ లీటరు ధర రూ.65.37కు, డీజిల్ ధర రూ.54.23కు పెరగనున్నారుు. ఈ దెబ్బతో జిల్లావాసులపై రోజుకు రూ.1.20 కోట్ల మేర అదనపు భారం పడనుంది. ఇక ఆర్టీసీపై నెలకు రూ.50 లక్షల వరకూ అదనపు భారం తప్పదు. మరోవైపు రవాణా వాహనాల బాడుగలూ పెరిగి ఆ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుంది. అసలే వేసవి కాలం.. దీనికి చమురు వాత కూడా తోడవ్వడంతో ధరలు చుక్కలు చూపిస్తాయని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, కాకినాడ/ అంబాజీపేట : జిల్లాలో రోజూ పెట్రోల్, డీజిల్ విక్రయాలు సగటున రూ.15 కోట్ల మేర జరుగుతుంటాయి. హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, రిలయన్స్, భారత్ పెట్రోలియం బంకులు 650 వరకు ఉన్నాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్‌లో ధరల ఆధారంగా పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం, తగ్గడం జరుగుతోంది. ఇటీవల చమురు ధరల పతనం కొనసాగడంతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను ఆ దామాషాలో తగ్గించుకుంటూ వచ్చింది. వాహనదారులు కాస్త ఊరట చెందారు. ఇటీవల పెట్రోలు ధర లీటరుకు రూ.2 పైగా తగ్గడంతో రూ.62.20 ఉండేది. మూడు నెలలు తిరగక ముందే ఏకంగా రూ.3.17లు పెంచడంతో ఇప్పుడు రూ.65.37కు చేరింది. ఇక డీజిల్ ధర గతంలో లీటరు రూ.52.25లు ఉండగా ఇప్పుడు అదనంగా రూ.1.98లను పెంచడంతో రూ.54.23కి చేరింది.
అన్నింటి పైనా అదనపు భారం..
చమురు ఉత్పత్తుల ధరలు దిగివస్తాయని వినియోగదారులు ఆశిస్తున్న తరుణంలో మళ్లీ పెరగడం వారిని హతాశుల్ని చేసే పరిణామమే. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) వాత వేస్తోంది. లీటరు పెట్రోలుపై ప్రస్తుతం 32.55 శాతం, డీజిల్‌పై 21.33 శాతం ఈ భారమే పడుతోంది. ఈ పన్నుల భారంతో కలిపి జిల్లాలోని వాహనదారులపై నెలకు దాదాపు రూ.36 కోట్ల వరకూ అదనపు భారం పడనుంది. దీని ప్రభావం జిల్లాలోని కొబ్బరి, అరటి, బియ్యం, పౌల్ట్రీ వ్యాపారాలపైనా పడుతుంది. మరోవైపు వేసవిలో సాగునీటి కోసం డీజిల్ మోటార్లను వినియోగించే రైతులపైనా అదనపు భారం పడుతుంది. మెట్ట భూముల్లో దుక్కు చేయడానికి ట్రాక్టరు అద్దె కూడా పెరిగిపోతుంది. ఇక జిల్లాకు రవాణా అయ్యే కూరగాయలు, దుంపలు ఇతర నిత్యావసర వస్తువుల పైనా డీజిల్ ధర పెంపు ప్రభావం కనిపిస్తుంది. దీంతో సామాన్యుల బడ్జెట్‌కు సెగ తప్పదు.
ఆర్టీసీపై అరకోటి భారం
జిల్లాలోని అన్ని డిపోల ఆర్టీసీ బస్సులకు నెలకు 65 వేల లీటర్లు డీజిల్ వినియోగమవుతోంది. వ్యాట్ తదితర పన్నులతో కలిపి డీజిల్‌పై లీటరుకు రూ.2.25 చొప్పున ఆర్టీసీపై అదనపు భారం పడుతుంది. ఇలా సగటున నెలకు రూ.50 లక్షల వరకూ ఆర్టీసీకి నష్టం వస్తుంది. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో డీజిల్ రూపేణా రూ.6 కోట్ల మేర అదనపు భారం పడుతుంది. అసలే నష్టాలతో కునారిల్లుతున్న ఆర్టీసీకి ఈ పెంపు పుండు మీద కారమనే చెప్పాలి. దీని ప్రభావం ప్రయాణికులపై పడుతుందనడంలో సందేహం అక్కర్లేదు.
చమురు వాత
Published Fri, Mar 18 2016 1:57 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM
Advertisement
Advertisement