ఏం కష్టమొచ్చిందో...ఓ పాతికేళ్ల యువతి పట్టణ శివారు ప్రాంతంలో ఎవరికీ కనబడకుండా తుప్పల్లోకి వెళ్లి వస్తువులన్నీ పక్కన పెట్టి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొంది. కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మృత్యుఒడిలోకి చేరింది. చికిత్స సమయంలో ఆమె పోలీసులకు చెప్పిన మాటలకు, సంఘటన స్థలం వద్ద ప్రమాదం జరిగిన తీరు అనుమానాలకు తావిస్తుండడంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్స్, డాగ్ స్క్వాడ్‌తో పాటు ఏడు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎస్పీ జి.పాలరాజు పర్యవేక్షణ చేశారు. సీసీ పుటేజీలలో ఆమె స్థానిక కలెక్టరేట్ వద్ద నుంచి కెఎల్.పురం వైపు వెళ్లే పెట్రోల్ బంకులో పెట్రోల్ కొనుగోలు చేస్తున్న దృశ్యాలను కనుగొన్నారు. ఆమెకు ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
విజయనగరం టౌన్: పట్టణ శివారు ద్వారపూడి గ్యాస్ గోడౌన్స్ దాటిన తర్వాత ఉన్న రియల్ ఎస్టేట్ ఖాళీ స్థలం లోపలికి పట్టణానికి చెందిన ముదునూరి అశ్విని (25) శుక్రవారం సాయంత్రం వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఆమెను గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె రాత్రి 12 గంటల ప్రాంతంలో మృతి చెందింది. పోలీసుల విచారణలో మాత్రం పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు.
విచారణ వేగవంతం
కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ జి.పాలరాజు ఏడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. యువతి చెప్పిన ఆధారాలతో తమదైన శైలిలో అశ్వినిది హత్య, ఆత్మహత్య అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. శనివారం ఉదయం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడ లభ్యమైన యువతి బైక్ కీ, కర్చీఫ్, కళ్లద్దాలు, కాలిన వస్త్రాలు, చర్మం, వంటి వాటిని గుర్తించారు. డాగ్ స్క్వాడ్ ఆమె కాలిన తర్వాత కొంత దూరం వచ్చిన దూరాన్ని గుర్తించగలిగింది. ఈ సందర్భంగా సంఘటనా çస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ జి.పాలరాజు మాట్లాడుతూ పూర్తి ఆధారాలు సేకరించామన్నారు.
పెట్రోల్ బాటిల్ ఇంట్లోదే..
సంఘటనా స్థలం వద్ద లభించిన పెట్రోల్ బాటిల్‌ను అశ్వని తండ్రి వెంకటసాయిరామ్ గుర్తించారు. అది ఇంట్లో బాటిలేనని తెలిపారు. కర్చీఫ్, కళ్లద్దాలు కూడా ఆమెవేనని చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు.
సీసీ పుటేజీల్లో...
అశ్విని ఆత్మహత్యకు ముందు కలెక్టరేట్ నుంచి కెఎల్.పురం వెళ్లే రహదారిలో ఉన్న పెట్రోల్ బంకులో పెట్రోలు కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 3.41 నిమషాల నుంచి ఆమె పెట్రోల్ బంక్ వద్దకు చేరుకుని పెట్రోల్ ముందు బైక్‌లో కొట్టిం చి, తర్వాత బాటిల్‌లో నిండుగా పోయించింది. ఒకానొక సమయంలో టెన్షన్‌తో ఉన్నట్లు అక్కడ పుటేజీలో కనబడింది. పెట్రోల్ కొనుగోలు తర్వాత బాటిల్ ముందున పెట్టుకుంటే అది కాస్త కిందపడిపోయింది. దాన్ని అక్కడ పని చేస్తున్న సిబ్బంది అందించడంతో వెనుక సీట్ కిందన పెట్టి వేగంగా వెళ్లిపోయినట్లు గుర్తించారు.
ఒబిసిటీయే కారణమా?
అతి లావు, పెరిగిన వయసు, పెళ్లి కాకపోవడం వంటి కారణాలు తల్లిదండ్రులు చెప్పుకొస్తున్నారని పోలీసులు తెలిపారు. అవి కారణాలు కాకపోయి ఉండవచ్చనే అనుమానాలు బలమవుతున్నాయి. ఆమె ఆత్మహత్యకు ఇంకా బలమైన కారణమేదో ఉంటుందని ఆ కోణంలో దర్యాప్తు చేసి విచారణ పూర్తి చేస్తామని ఎస్పీ తెలిపారు.
ఎందుకలా...
అశ్విని మృత్యువుతో పోరాడుతున్న సమయంలో పోలీసులకు ఇచ్చిన సమాచారంలో ఎవరో ఇద్దరు దుండగులు తన దగ్గరకు వచ్చి పేరేంటని ప్రశ్నించి, పేరు చెప్పగానే కిరోసిన్ పోసి నిప్పంటించారని, మరోసారి కాళ్లు చేతులు కట్టేశారని చెప్పుకొచ్చింది. పట్టణంలోని సీసీ కెమెరాల పరిశీలనలో ఆశ్చర్యకరమైన విషయం బట్టబయలైంది. పెట్రోల్ బంక్‌లో అశ్వినియే పెట్రోల్ కొనుగోలు చేసినట్లు రికార్డ్ అయింది. దీని ఆధారంగా యువతిపై దాడి జరగలేదని తనే ఆత్మహత్యకు పాల్ప డినట్లు తెలుస్తోందని పోలీసులు స్పష్టం చేశారు. చివరి నిమిషంలో ఎందుకలా చెప్పింది, ఆ యువతికి వచ్చిన కష్టమేంటి, ఆత్మహత్యకు గల కారణాలేంటి? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment