పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి
ఏపీ ఆటో ట్రాలీ, డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాస్తారోకోకర్నూలు: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఏపీ ఆటో ట్రాలీ, డ్రైవర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో కృష్ణానగర్‌లోని ఐటీసీకి ఎదురుగా జాతీయ రహదారిపై బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఆటోడ్రైవర్లంతా భారీగా తరలివచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవునా ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, పాణ్యం డివిజన్ కార్యదర్శి గోపాల్, అధ్యక్షుడు సుధాకర్ తదితరులు ఆటో కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.
చమురు ధరలపై ప్రభుత్వం నియంత్రణ ఎత్తివేయడంతో కంపెనీలు తమకు ఇష్టమొచ్చినట్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నాయన్నారు. అధికారంలోకి రాకముందు వాటి ధరలు తగ్గిస్తామని హామీచ్చిన బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు విస్మరించిందని విమర్శించారు. ఒక్క మే నెలలోనే మూడుసార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం దారుణమన్నారు. ఆటో యూనియన్ నాయకులు మహమూద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ నాయకులు సాయిబాబా, ఏసు, అయ్యస్వామి, సుధాకర్, మురళి, శాలు, నరసింహ, సుంకన్న, రాముడు, భాస్కర్, మధు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.