గండం గడిచినట్టే! | Phailin storm out of Danger in Kakinada | Sakshi
Sakshi News home page

గండం గడిచినట్టే!

Published Sun, Oct 13 2013 1:00 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM

Phailin  storm out of Danger in Kakinada

 
 ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లావాసుల గుండెల్లో ప్రకంపనాలు సృష్టించిన ‘పై-లీన్’ తీరం దాటింది. ప్రజలతో పాటు సమైక్యాంధ్ర సమ్మెలో ఉంటూనే తుపాను ప్రభావంతో ఉత్పన్నం కాగల పరిస్థితిని ఎదుర్కొనేందుకు కంటికి కునుకు లేకుండా అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం కూడా గండం నుంచి జిల్లా గట్టెక్కినట్టేనని ఊపిరి పీల్చుకున్నారు. అయితే రానున్న 24 గంటల్లో జిల్లాలోని తీర మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో ఎలాంటి నష్టం వాటిల్లకుండా అవసరమైన అన్ని చర్యలూ చేపట్టారు.
 
 సాక్షి, కాకినాడ :కోనసీమను కకావికలం చేసిన 1996 తుపాను కంటే నాలుగైదు రెట్ల విధ్వంసం సృష్టించగల ‘పై- లీన్’ విరుచుకు పడుతోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా ప్రజలు వణికిపోయారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తుపాను  నిజంగానే తమ పాలిట యమగండంగా మారుతుందేమోనని భయకంపితులయ్యారు. ఆంధ్రా-ఒడిశాల మధ్య శనివారం అర్ధరాత్రి తీరం దాటుతుందని వాతావరణ శాఖ   
 హెచ్చరించడం, దానికి తోడు తుపాను గంటకొక దిశగా పయనించడంతో జిల్లా వాసులు ఆందోళనకు గురయ్యారు. వాతావారణ శాఖ అంచనాల కంటే ముందే ‘పై-లీన్’ ఒడిశాలో తీరం దాటడంతో జిల్లాకు గడిచినట్టయ్యింది. 
 
 కోనపాపపేట వద్ద తీరం కోత
 తుపాను తీరం దాటే సమయంలో అధికారులు హెచ్చరించినట్టే తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ వద్ద అలలు 12 మీటర్ల ఎత్తున ఎగసిపడుతుండడంతో తీరవాసులు భయకంపితులయ్యారు. ఉప్పాడ, అంతర్వేది, ఓడలరేవు, కోనపాపపేట తదితర తీరప్రాంతాల్లో సముద్రం తీరం పైకి చొచ్చుకొచ్చింది. వాకలపూడి బీచ్‌లో 40 అడుగుల మేర, ఉప్పాడ తీరంలో వంద అడుగుల మేర చొచ్చుకు వచ్చింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో అలలు బీచ్ రోడ్‌పైకి ఉవ్వెత్తున ఎగసిపడడంతో వాకలపూడి లైట్‌హౌస్ నుంచి ఉప్పాడ వరకు సుమారు పది కిలోమీటర్ల మేర బీచ్‌రోడ్డును పూర్తిగా మూసివేశారు. కోనపాపపేట తీరప్రాంతం తీవ్ర కోతకు గురైంది.  తీరమండలాల్లో సుమారు 1.50 లక్షల మంది తుపాను ప్రభావానికి గురవుతారని అంచనా వేసిన యంత్రాంగం 25 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. అయి తే తుపాను తీరం దాటడంతో పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు అత్యధికులు ఆసక్తి చూపలేదు. వాసాలతిప్ప లో 117 మంది వలస మత్స్యకారులతో పాటు తీరమండలాల్లో సుమారు వెయ్యి మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తొలిసారిగా తుపాను నేపథ్యంలో జిల్లాకు చేరుకున్న 40 మంది సిబ్బంది కలిగిన నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ దళాన్ని అత్యంత సమస్యాత్మక ప్రాంతాలకు పంపి, పునరావాస చర్యలను చేపట్టారు. 
 
 అధికారుల పర్యటన
 జిల్లా తుపాను ప్రత్యేకాధికారి ఎం. రవిచంద్ర శనివారం ఉదయం జిల్లా అధికారులతో సమా వేశమయ్యారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.  కలెక్టర్ నీతూప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ట్రైనీ కలెక్టర్ కర్ణన్ తీరమండలాల్లో పర్యటించారు. తుపాను తీరం దాట డంతో జిల్లాలోని తీరగ్రామాల్లో ఈదురు గాలుల జోరు కొద్దిగా పెరగడం తప్ప ఎక్కడా చెప్పుకోతగ్గ స్థాయిలో వర్షాలు  కురవలేదు. గత 24 గంటల్లో కేవలం 15 మండలాల్లో 2.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో ‘పై-లీన్’ వల్ల జిల్లాకు ఎలాంటి నష్టం ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒడిశాలో తీరం దాటడంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడకపోవచ్చని భావిస్తున్నారు. దీంతో 2.25 లక్షల ఎకరాల్లో సాగవుతున్న వరికి నష్టం వాటిల్లే అవకాశం లేదని రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా జిల్లా, డివిజన్ స్థాయిల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లను రానున్న 48 గంటల్లో అత్యవసరసేవల కోసం అందుబాటులో ఉంచారు. 
 
 కొన్ని రైళ్ల రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
 రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ : పై-లీన్ తుపాను కారణంగా రైల్వేశాఖ రాజమండ్రి మీదుగా ప్రయాణించే రైళ్లలో కొన్నింటిని రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. చెన్నై-హౌరా మెయిల్‌ను రాజమండ్రి నుంచి వెనక్కు విజయవాడ పంపి, అక్కడ నుంచి బల్లార్షా మీదుగా మళ్లించారు. ముంబై-భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ను సామర్లకోట వరకే నడిపారు. వాస్కోడిగామా-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను విశాఖపట్నం వరకూ నడిపి అక్కడి నుంచి తిరిగి వాస్కాడిగామా పంపారు. యశ్వంతపూర్-హౌరా, తిరుచునూర్-హౌరా, ధన్‌బాద్ -అలెప్పి బొకారో ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-గౌహటి, చెన్నై-హౌరా కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లను బల్లార్షా, నాగపూర్‌ల మీదుగా మళ్లించారు. 
 
 యశ్వంతపూర్-హౌరా ఎక్స్‌ప్రెస్‌ను రాయపూర్ మీదుగా మళ్లించారు. సికింద్రాబాద్-విశాఖపట్నం విశాఖ ఎక్స్‌ప్రెస్, సత్రాగంచి-కొలెచ్చి, సత్రాగంచి-చెన్నై, చెన్నై-అసన్‌సోల్, అలెప్పి-బొకారో ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. విజయవాడ-విశాఖపట్నం ప్యాసింజర్ రైలును రాజమండ్రిలో నిలిపివేసి, దానిలోని ప్రయాణికులను  వెనుకగా వచ్చిన సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కించారు. విజయవాడ -రాయగడ ప్యాసింజర్‌ను అనకాపల్లి వరకే నడిపి, అక్కడి నుంచి తిరిగి విజయవాడ పంపారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే రైళ్లన్నీ యథావిధిగా నడిచాయి. రైళ్ల రద్దు, దారి మళ్లింపుతో రిజర్వేషన్లు రద్దు చేయించుకున్న వారికి రైల్వే అధికారులు పూర్తి మొత్తం చెల్లించారు. కాగా ప్రయాణికుల సౌకర్యార్థం రాజమండ్రి స్టేషన్‌లో 0883-2420541,2420543 నంబర్లతో  హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement