![Heavy Rains: Kadem Project Now Out Of danger Flood Flow Reduced - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/14/111.jpg.webp?itok=T9NH0nzq)
సాక్షి, నిర్మల్ జిల్లా: జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌కు పెను ప్రమాదం నుంచి బయటపడింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా తగ్గుముఖం పట్టింది. వరద నీరు తగ్గడంతో ముప్పు తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రమాదం ఏం లేదని చెబుతున్నారు. అలాగే ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లో కాస్త తగ్గుముఖం పట్టిందని, ఇంకా తగ్గితే ప్రమాదం తప్పినట్టేనని కలెక్టర్ ప్రకటించారు. అయితే వానలు పడుతూనే ఉండటం, మరింత పెరగొచ్చనే వాతావరణ శాఖ సూచనలతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. అవుట్ ప్లో 2 .5 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 17 గేట్లను ఎత్తి అధికారులు నీటిని కిందకు వదులుతున్నారు.
కాగా గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద వస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గతంలో ఎన్నడూ లేనివిధంగా 64 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తూ వరదనీరు వచ్చి చేరుతోంది. వరద నీరు తీవ్రంగా పోటెత్తుతుండటంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు ప్రకటించారు. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు పడటంతో అక్కడి నుంచి వాగుల్లో భారీ వరద మొదలైంది. దానికితోడు మంగళవారం సాయంత్రం నుంచి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో కురిసిన వాన నీళ్లూ కడెం వైపు పరుగులు తీస్తూ వచ్చాయి.
మహారాష్ట్రలోని వాగుల సమాచారం తెలియకపోవడం, అటవీ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాల స్థాయి తెలిసే పరిస్థితి లేకపోవడంతో.. అధికారులు భారీ వరదను అంచనా వేయలేకపోయారు. ఒక్కసారిగా ఐదు లక్షల క్యూసెక్కుల వరద రావడంతో అవాక్కయ్యారు. అప్పటికప్పుడు మొత్తం 18 గేట్లలో 17 గేట్లను ఎత్తేశారు. ఒక గేటు మొరాయించడంతో వదిలేశారు. ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని జీవించారు. అయితే ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు ప్రమాదం లేదని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment