కడెం: సరిగ్గా ఏడాది..మళ్లీ అదే ఉధృతి. మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో కడెం వాగు ఉప్పొంగుతోంది. కడెం మండల కేంద్రంలోని ప్రాజెక్టు గేట్ల పైనుంచి వరద ప్రవహించింది. వరదను కిందకు అదేస్థాయిలో పంపించే సమయంలో తొలుత నాలుగు గేట్లు మొరాయించడంతో గురువారం సాయంత్రం వరకు వాటి పైనుంచి ప్రవాహం కొనసాగింది.
అర్ధరాత్రి నుంచి పెరుగుతూ..: బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు 10,256 క్యూసెక్కులతో వరద మొదలైంది. అప్పటికి ప్రాజెక్టులో 691.600 అడుగుల వద్ద 5.598 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో భారీగా వస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రాజెక్టు అధికారులు నాలుగు వరద గేట్లు ఎత్తి 24,750 క్యూసెక్కులు వదిలారు.
గంట గంటకు ఇన్‌ఫ్లో పెరుగుతుండటంతో 14 గేట్లను ఎత్తారు. జర్మన్ క్రస్ట్ గేట్లయిన 6, 12, 2, 3 నంబర్ గేట్లు మొరాయించాయి. గురువారం వేకువజామున 5 గంటలకు 3,87,583 క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టు డేంజర్ జోన్‌లో పడింది. అప్రమత్తమైన అధికారులు 14 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తివేసి, 2,18,922 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
నాలుగు గేట్లు మొరాయించిన నేపథ్యంలో అవుట్‌ఫ్లో కంటే ఇన్‌ఫ్లో ఎక్కువై ప్రాజెక్టు గేట్ల పైనుంచి వరద ప్రవాహం కొనసాగింది. ఈ క్రమంలో ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందని, కట్ట తెగుతుందనే ఆందోళన వ్యక్తమయ్యింది. దీంతో అధికారులు డేంజర్ జోన్ ప్రకటించి, సైరన్ మోతతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు.
గేట్లతోనే సమస్య..: కడెం ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లు ఉన్నాయి. ఇవి పూర్తిస్థాయిలో ఎత్తితే ప్రమాదకర పరిస్థితులు తలెత్తేవి కాదన్న వాదన ఉంది. గత ఏడాది వరదకు 2, 3 గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు రెండో గేటుకు వెయిట్ బిగించారు. అయినా గురువారం ఈ గేటు పనిచేయలేదు. మూడో గేట్ పనులు ఇంకా పూర్తికాలేదు. ఇక 6, 12 నంబర్ గేట్లు సైతం ఎంతకు లేవకుండా మొరాయించాయి.
మాన్యువల్‌గా హ్యాండిల్ తిప్పుతూ గేట్లను ఎత్తేందుకు ప్రయత్నించినా వరదలో కొట్టుకువచ్చిన చెట్లు, చెత్తాచెదారం తట్టుకోవడంతో సాధ్యం కాలేదు. చివరకు మధ్యాహ్నం పొక్లెయినర్ సహాయంతో వరద గేట్ల వెనుక భాగంలో ఇరుక్కున్న చెట్లను తొలగించడంతో 6, 12 గేట్లను మాన్యువల్‌గా ఎత్తారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, జిల్లా అధికారులు మొత్తం కడెంలోనే మకాం వేశారు.
డ్యాంగూడ, కన్నాపూర్, కొండుకూర్ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత ఏడాది ఇదే సీజన్‌లో కడెంకు ఆరు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడం, ప్రాజెక్టు మునిగిపోవడం గుర్తు చేసుకుంటున్న స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment