ఫైలిన్ తుఫాను కాస్తా తీవ్ర పెను తుఫాను అని భారత వాతావరణ శాఖ నిర్ధారించింది. ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి సుమారు 530 కిలోమీటర్ల దూరంలో.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల మధ్య కళింగపట్నం- పారాదీప్ ప్రాంతాల నడుమ రేపు సాయంత్రానికల్లా తీరం దాటొచ్చని అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో ఫైలిన్ వేగం గంటకు సుమారు 205-215 కిలోమీటర్లుగా ఉంటుంది.
ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే అత్యంత భారీ వర్షపాతం కురుస్తుంది. రాబోయే పన్నెండు గంటల్లో ఉత్తర కోస్తాలో గంటకు 45-55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తీరం దాటే సమయంలో గాలుల వేగం 210-220 కిలోమీటర్ల వరకు ఉండొచ్చని చెబుతున్నారు. శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో అలలు మూడు మీటర్ల పైబడి ఎత్తుకు ఎగసే అవకాశం ఉంది. తీరప్రాంతంలోని ఇళ్లకు తీవ్రనష్టం వాటిల్లే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. విద్యుత్తు, కమ్యూనికేషన్ల వ్యవస్థకు భారీ నష్టం కలగొచ్చు. రోడ్డు, రైలు మార్గాలకు కూడా తీవ్ర ఆటంకం వాటిల్లే అవకాశం ఉంది. పంటలు తీవ్రంగా నష్టపోవచ్చు.
ప్రభుత్వం సచివాలయంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూంను ఏర్పాటుచేసింది. దాంతోపాటు తీరప్రాంతాల్లోని అన్ని జిల్లా కేంద్రాల్లో, డివిజన్, మండల కేంద్రాల్లో ఫోన్, మొబైల్, వైర్లెస్, హ్యామ్ రేడియో సెట్లతో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం నెంబర్లను ప్రచారం చేశారు. విపత్తు నివారణ కేంద్రాలను అప్రమత్తం చేశారు.
రాష్ట్రస్థాయిలో తొమ్మిది మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను పర్యవేక్షణ అధికారులుగా నియమించారు.
శ్రీకాకుళం- జి.వెంకట్రామిరెడ్డి, విజయనగరం- రజత్ కుమార్, విశాఖపట్నం- హర్ప్రీత్ సింగ్, తూర్పుగోదావరి - ముద్దాడ రవిచంద్ర, పశ్చిమగోదావరి - సంజయ్ జాజు, కృష్ణా- కె.ప్రవీణ్ కుమార్, గుంటూరు - బి.వెంకటేశం, ప్రకాశం - ఆర్. కరికాల వల్లవన్, నెల్లూరు- బి.రాజశేఖర్
ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని తెలిపారు. తీరంలో ఉన్నవాళ్లు సముద్రంలోకి వెళ్లొద్దన్నారు. చేపల వేటను పూర్తిగా నిలిపివేశారు. పౌరసరఫరాల కేంద్రాల వద్ద ఇప్పటికే బియ్యం, కిరోసిన్, తాగునీరు... ఇలాంటివాటిని నిల్వచేసి ఉంచారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విశాఖలో 40వేల మంది, శ్రీకాకుళంలో 20 వేల మంది, విజయనగరంలో 4వేలమందిని ఇలా తరలించారు. వైద్య బృందాలను సిద్ధంగా ఉంచారు. ఈ వారంలో ప్రసవాలు కావచ్చని భావిస్తున్న గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.
విశాఖపట్నంలోని తూర్పు నేవల్ కమాండ్, ఆర్మీ వర్గాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడికైనా వెంటనే వెళ్లేందుకు వీలుగా హెలికాప్టర్లు, సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. నాలుగు కాలమ్ల ఆర్మీని విశాఖకు తరలించారు.
తీవ్ర పెను తుఫానుగా మారిన ఫైలిన్
Published Fri, Oct 11 2013 8:21 PM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM
Advertisement
Advertisement