సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం అక్రమ రవాణాకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పీలేరు నియోజక వర్గం అడ్డాగా మారుతోంది. పీలేరు నుంచి చెన్నై, బెంగళూరుకు వెళ్లే రహదారులు ఉన్నాయి. ఎర్రచందనం ఎక్కువగా ఉన్న శేషాచలం అడవులు అక్కడకు దగ్గర. స్మగ్లర్లకు రాజకీయ నేతలు, అధికారుల సహకారం ఇవన్నీ కూడా అక్రమరవాణా పెరగడానికి కారణాలు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి జిల్లా అయిన చిత్తూరులో ఎర్రచందనం స్మగ్లర్లు ఆదివారం రెచ్చిపోయి ఇద్దరు అటవీశాఖ అధికారులను హతమార్చడం, మరో ఆరుగురిని గాయపర్చడంతో పీలేరు కేంద్రంగా సాగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా మరోమారు చర్చనీయాంశమైంది. అక్రమ రవాణా ద్వారా కిరణ్‌కుమార్ రెడ్డి ఆయన అనుచరులు వందల కోట్లు సంపాదించారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పలు పర్యాయాలు బహిరంగంగానే ఆరోపించారు.
గతంలో పీలేరుకు ప్రాతినిధ్యం వహించిన అటవీశాఖా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరో అడుగు ముందుకేసి పీలేరు కేంద్రంగా ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతున్న తీరును బహిర్గతం చేశారు. పీలేరు నుంచే ముఖ్యమంత్రి అనుచరులు వందలాది మంది కూలీలను తరలిస్తున్న వైనాన్ని పెద్దిరెడ్డి బయటపెట్టినా సంబంధిత అధికారులెవ్వరూ స్పందించలేదు. ఈ ఆరోపణలకు ఎన్నడూ సమాధానం ఇవ్వని ముఖ్యమంత్రి స్మగ్లింగ్ నివారణకు తీసుకున్న చర్యలూ నామామాత్రమే. ఇవన్నీ కూడా అనుమానాలను పెంచుతున్నాయి. పైగా, ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈ మూడేళ్లలోనే ఎన్నడూ లేనంతగా వందల కోట్ల ఎర్రచందనం తరలిపోయింది. దట్టమైన అడవుల్లోకి వెళ్లి ఎర్రచందనం చెట్లను నరికి రహదారులపై చేర్చేందుకు తమిళనాడు నుంచి వచ్చే వందలాది మంది కూలీలను ఎదుర్కొనేందుకు అటవీశాఖ బీట్ అధికారులకు తుపాకులిస్తామన్న ముఖ్యమంత్రి హామీ నేటికీ ఆచరణరూపం దాల్చలేదు.
రెండేళ్ల క్రితం అటవీశాఖాధికారుల సమావేశంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు అటవీశాఖాధికారులకు తుపాకులివ్వనున్నట్టు ఆయన ప్రకటిం చారు. ముఖ్యమంత్రి హామీ మేరకు వైఎస్‌ఆర్, చిత్తూరు జిల్లాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టేందుకు 400 తుపాకులు కొనుగోలు చేయాల్సి ఉంటుందంటూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. నేటికీ తుపాకుల కొనుగోలు జరగలేదు. ఆదివారం నాటి సంఘటనలో తుపాకులు లేకపోవడం వల్లే కూలీల దాడులను తిప్పికొట్టేలేక పోయామని ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న సిబ్బంది చెప్పారు. అధికార పార్టీ నేతలతో పాటు పోలీసు, అటవీ శాఖలకు చెందిన కొందరు అధికారులు, కింది స్థాయి సిబ్బంది స్మగ్లర్లకు సహకరిస్తూ టాస్క్‌ఫోర్స్‌ను నీరుగారుస్తున్నారు. మూడున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి నియోజకవర్గ కేంద్రంలోనే పనిచేస్తున్న ఒక సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరిస్తున్నా చర్యలు మాత్రం తీసుకోలేదు.
ఇటీవల బదిలీపై వెళ్లిన ఎస్‌పీ కాంతి రాణా టాటా సదరు సీఐకి ఈ ఆరోపణలపై మెమో కూడా ఇచ్చారు. అయితే ముఖ్యమంత్రి సోదరుడి అండదండలు ఉండడంతో ఆయనపై చర్యలు కాదుకదా బదిలీ కూడా చేయలేకపోయారు. ఇక టాస్క్‌ఫోర్సు అధికారులు కూడా ఎర్రచందనం కూలీల అరెస్టులకే పరిమితమై స్మగ్లర్లను ఏమీ చేయలేకపోతున్నారు. కూలీలు ఇచ్చే సమాచారం ఆధారంగా స్మగ్లర్ల వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో అధికార పార్టీ నేతల నుంచి వస్తున్న ఒత్తిడులే ఇందుకు కారణమని చెబుతున్నారు.
పీలేరే స్మగ్లింగ్ కేంద్రం
Published Mon, Dec 16 2013 3:05 AM | Last Updated on Mon, Oct 22 2018 2:02 PM
Advertisement
Advertisement