రాజమహేంద్రవరం సిటీ: కార్తికమాసంలో పంచారామాలు, శ్రీశైలం తీర్థయాత్రలకు, నవంబర్‌లో శబరిమల వెళ్లే భక్తుల కోసం 490 ప్రత్యేక బస్ సర్వీసులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రత్యేక సర్వీసులకు నిర్ణయించిన ధరల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. నవంబరు 23, 29 తేదీలలో శబరిమలకు 4 రోజులు, 5 రోజుల తీర్థయాత్ర ప్యాకేజీతో సూపర్ లగ్జరీ బస్సులు సిద్ధం చేసామన్నారు. 4 రోజుల ప్యాకేజీలో విజయవాడ, తడ బైపాస్, తేనేగాటి, శబరిమల ఉంటాయని, ధర రూ.3500 అని చెప్పారు. 5 రోజుల యాత్రలో కాణిపాకం, ఎరుమేళి, శబరిమల, తిరుపతి, విజయవాడ, రాజమహేంద్రవరం ఉంటాయని, ధర రూ.3800గా నిర్ణయించామన్నారు. గత ఏడాది 22 బస్సులు నడపడం ద్వారా రూ.29 లక్షల ఆదాయం గడించగా ఈ ఏడాది 60 బస్సులు నడపనున్నట్టు చెప్పారు.
ఆదాయంలో తూర్పు రీజియన్‌కు అగ్రస్థానం..
ఆరు నెలల కాలంలో ఆర్టీసీలో తూర్పురీజియన్ రూ.9.83 కోట్ల రాబడి సాధించి రాష్ట్రవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచిందని ఆర్‌ఎం చెప్పారు. రీజియన్ చరిత్రలో ఇంత ఆదాయం సాధించడం ఇదే మొదటి సారన్నారు. దసరాకు గత ఏడాది 610 ప్రత్యేక బస్సులు నడపడం ద్వారా రూ.1.18 కోట్లు ఆదాయం సాధించామని, ఈ ఏడాది 925 బస్సులను నడిపి రూ.రెండు కోట్లు సాధించామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం డిపో మేనేజర్ టి.పెద్దిరాజు, అసిస్టెంట్ మేనేజర్ కుమార్, ప్రత్యేక బస్సుల నిర్వహణాధికారి బాషా, పీఆర్‌ఓ రాజబాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment