పిస్తోలు చూపి బెదిరింపులు
పోలీసులపైనే తిరుగుబాటు?
వెపన్, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు
చిత్తూరు: ఓ అధికారపార్టీ నేత దూకుడు నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే స్థాయికి చేరింది. బుధవారం రాత్రి ఆ నేత నగరంలోని తన కార్యాలయం వద్ద కొందరు వ్యాపారులను నిర్బంధించి వారికి దేహశుద్ధి చేయడమే కాక పిస్తోలు చూపి బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలంటూ ఢిమాండ్ చేసినట్లు ప్రచారం సాగింది.
ఈ నేపధ్యంలో ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నగరంలో పనిచేసే ఓ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ హుటాహుటిన రాత్రి పది గంటల ప్రాంతంలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ జనం పోైగె ఉండడాన్ని గమనించిన సీఐ అందరినీ మందలించే ప్రయత్నం చేయగా, అధికార పార్టీ నేత సీఐపై ఎదురుతిరిగినట్లు సమాచారం. తనజోలికొస్తే పరిస్థితి వేరుగా ఉంటుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. అంతటితో వదలక ఒక దశలో దమ్ముంటే తనను అరెస్ట్ చేసి చూడాలని ఆ నేత సీఐ కి సవాల్ విసిరినట్లు సమాచారం. ఇద్దరి మధ్య కొద్దిసేపు వాగ్యుద్ధం జరిగింది. ఇంతలో నేత వద్ద ఉన్న పిస్తోల్,మూడు బుల్లెట్లను గమనించిన సీఐ వాటిని స్వాధీనం చేసుకున్నారు. నాగాలాండ్ లెసైన్సు,తమిళనాడు అడ్రస్సుతో పిస్తోలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పూర్తి స్థాయి విచారణ జరిపిన తరువాత అది లైసన్సుగల పిప్తోలా ? కాదా అనే విషయాలను వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.
పోలీస్ సీరియస్: అధికార పార్టీ నేత వ్యవహారాన్ని జిల్లా పోలీసు అధికారి తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆయనకు భయపడిన బాధితులు ఫిర్యాదు ఇచ్చేందుకు జంకుతున్నట్లు సమాచారం. పిస్తోలు, బుల్లెట్లు ఎక్కడ నుంచి వచ్చాయి? అవి లైసన్స్‌డా?కాదా? ఒకవేళ లైసన్స్ ఉన్నవి అయితే ఎవరి పేరు మీద ఉన్నాయి? అనే వివరాలను పోలీసులు ఇప్పటికే ఆరా తీసే పనిలో పడ్డారు. పిస్తోల్, బుల్లెట్లు స్వాధీనం చేసుకోవడంతో అధికారపార్టీ నేత జిల్లా పోలీసు అధికారిపై హైదరాబాద్ స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
చిత్తూరులో టీడీపీ నేత ఆగడాలు
Published Fri, Mar 20 2015 2:58 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM
Advertisement
Advertisement