
కవరే కదా అని పాడేశావో.. నిన్నే కబళిస్తా. నాకు చావు లేదు. సౌకర్యం కోసం యూజ్ అండ్ త్రో అంటే నిన్ను వదలా. నేను భూమిలో కలసిపోనూ. నీకు ఆధారమైన భూమినే నాశనం చేసేస్తా. ఇకనైనా మేలుకో.. చికెన్ షాప్‌నకు వెళ్లేటప్పుడు స్టీల్ బాక్స్ తీసుకెళ్లు.. మార్కెట్‌కు వెళ్తే జనపనార సంచి వెంట పట్టుకుపో. ఎవరైనా కవరుందా అని అడిగితే కళ్లు తెరిపించు. భవిష్యత్ తరాలకు సురక్షి తమైన పర్యావరణాన్ని అందించేందుకు ప్లాస్టిక్‌ను వదిలేయ్.. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో ‘బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్’ అని నినదించండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు నో చెప్పండి.
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): గాలివానకు చెట్టు పడిపోతే ప్రమాదం.. గొడ్డలి పట్టి నరికేస్తే నేరం.. కూర్చున్న కొమ్మనే కొట్టేస్తే మూర్ఖత్వం.. పర్యావరణ పరిరక్షణ విషయంలో జనం అదే చేస్తున్నారు. భూమిలో ఎన్నటికీ కలవ ని ప్లాస్టిక్ వినియోగం ఏటా పెరిగిపోతోంది. ప్లాస్టిక్ కవర్ల విక్రయాలు, వినియోగం నిషేధించినా ఎవరూ పాటించడం లేదు. మార్కెట్‌లో డజను అరటి పండ్లు కొనుగోలు చేస్తే కవర్ ఇవ్వకపోతే కస్సుబస్సుమంటారు. షాపింగ్‌కు వెళ్లినప్పుడల్లా ఐదు రూపాయలు పెట్టి ప్లాస్టిక్ కవర్లను కొంటారు. ఇక ప్రయాణాలు, రెస్టారెంట్లలో కొనే డిస్పోజల్ వాటర్ బాటిళ్లకు లెక్కనేలేదు. పాలు, పండ్లు, కిరాణ, ఆహార పొట్లాలు, మందులు, చివరకు ఆలయాల్లో ప్రసాదాలకు కూడా పాలిథిన్ క్యారీ బ్యాగులను ఉపయోగిస్తున్నారు. బయటకు వెళ్లి ఇంటికొచ్చేటప్పుడు ప్రమాదాన్ని చేతిలో పట్టుకొస్తున్నారు. యథేచ్ఛగా ప్లాస్టిక్‌ను వినియోగిస్తుండడంతో అదే స్థాయిలో పర్యావరణం కలుషితమవుతోంది. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల బదులు జనపనార, గుడ్డ సంచులను వాడితే ప్రస్తు తం వినియోగిస్తున్న ప్లాస్టిక్‌ను 50 శాతం వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నా ఎవరికీ పట్టడం లేదు. చెత్త కుప్ప.. మురికి కాల్వ.. ఖాళీ ప్రదేశం ఎక్కడైనా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి.
50 మైక్రాన్ల కన్నా మందం తగ్గితే ప్రమాదం
జిల్లాలో అన్ని మునిసిపల్, నగర పంచాయతీలు, పంచాయతీల్లో 50 మైక్రాన్ల కంటే మందం తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై నిషేధం ఉంది. అయినా యథేచ్ఛగా ఎలాంటి ప్రమాణాలు పాటించని ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. చాలా వరకు 20–30 మైక్రాన్ల మందం ఉన్న కవర్లు వినియోగంలో ఉన్నాయి. విందులు, వినోదాల్లో వినియోగించే వాటర్ గ్లాసులు, ప్లేట్లు, ఇతర డిస్పోజల్ వస్తువుల్లో అధిక శాతం 30 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని మునిసిపాలిటీల పరిధిలో ప్లాస్టిక్‌పై నిషేధం ఉన్నా యథేచ్ఛగా వినియోగిస్తున్నారు. అయినా స్థానిక సంస్థలు వాటిపై నిఘా వేయడంలో విఫలమాయ్యయి. ఎక్కడా దాడులు చేయడం లేదు. కొందరు అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేయడం, మరి కొందరు లంచాలు తీసుకుంటూ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
నేడు అవగాహన ర్యాలీ
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం 8 గంటలకు కలెక్టరేట్ గాంధీ విగ్రహం నుంచి రాజ్‌విహార్ వరకు పర్యావరణంపై అవగాహన ర్యాలీ నిర్వహించనున్నట్లు ఏపీ కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ అధికారి ప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ర్యాలీని జెండా ఊపి ప్రారంభిస్తారని చెప్పారు. ర్యాలీ అనంతరం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సభను నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభలోనే పర్యావరణంపై నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేయనున్నట్లు ఆయన వివరించారు.
ప్లాస్టిక్ వ్యర్థాలు తగ్గించండి ఇలా..
డంపింగ్ యార్డుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఎవరికి వారు నిత్య జీవితంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని దూరం పెట్టాలి. ∙సరుకుల కోసం మార్కెట్‌కు కాటన్ సంచులను తీసుకెళ్లాలి. ∙బిర్యానీ పార్సిల్ అడిగితే కనీసం ఐదు ప్లాస్టిక్ డబ్బాలు ఇస్తారు. వీటి బదులు ఇంటి నుంచే స్టీలు క్యారియర్స్ తీసుకెళ్లాలి. ∙పిల్లలకు క్లాత్ డైపర్స్‌ను ఉపయోగించడం మేలు. ∙డిస్పోజబుల్ చాప్ స్టిక్స్, నైఫ్, స్పూన్లు, ఫోర్క్‌లు ఉపయోగించకూడదు.
రీసైక్లింగ్ యూనిట్లు ఏవీ?
ఒక చిన్న ప్లాస్టిక్ బాటిల్ భూమిలో కలసి పోవాలంటే సగటున 450 ఏళ్లు పడుతుందని, కొన్ని బాటిళ్లకు వెయ్యి ఏళ్లు కూడా పట్టవచ్చు. పోలి ఎథిలిన్‌తో తయారైన బాటిళ్లు ఎప్పటికీ భూమిలో శిథిలం కావు. ప్లాస్టిక్ బాటిళ్ల తయారీకి ఏటా 1.5 మిలియన్ బ్యారెళ్ల చమురు ఖర్చువుతోంది. ఇలా ప్లాస్టిక్ శిథిలం కావడానికి వందల ఏళ్లు పడుతున్న నేపథ్యంలో వానలు, గాలికి అవి వాగులు, వంకల నుంచి నదులు, నదుల నుంచి సముద్రాల్లోకి చేరడంతో అక్కడ లక్షల టన్నుల వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్పిత్తి అయినా ప్లాస్టిక్‌ను ఎక్కడిక్కడే రీసైక్లింగ్ యూనిట్ల ద్వారా పునరుత్పత్తి చేసుకోవాలి. జిల్లాకు సంబంధించి ఏడాదికి లక్ష టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు సమాచారం. వీటిని రీసైక్లింగ్ చేసే యూనిట్లు మాత్రం ఒక్కటి లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment