నెలనెలా కొంతమొత్తంతో కొనుగోలు చేసుకుని ఏదో చిన్నపాటి ఇల్లు కట్టుకుందామని ఆశించిన సగటు జీవికి అన్యాయం జరుగుతోంది.
మంగళగిరి : నెలనెలా కొంతమొత్తంతో కొనుగోలు చేసుకుని ఏదో చిన్నపాటి ఇల్లు కట్టుకుందామని ఆశించిన సగటు జీవికి అన్యాయం జరుగుతోంది. ఆకర్షణీయమైన బ్రోచర్లతో తమను నమ్మించి.. తమతో ప్లాట్లు బుక్ చేరుుంచుకుని నెలనెలా వారుుదాలు వసూలు చేసుకున్నాక... ఆ భూమి కాస్తా ల్యాండ్‌పూలింగ్‌లో పోతే తమకు ఇక బూడిదే మిగిలిందని వినియోగదారులు వాపోతున్నారు. మండలంలోని యర్రబాలెం గ్రామంలో జిల్లాలోని అధికారపార్టీ శాసనసభ్యునికి చెందిన అభినందన హౌసింగ్
సంస్థ 33 ఎకరాలను కొనుగోలు చేసి ప్లాట్లుగా వేయకుండానే డమ్మీ ప్లాన్‌తో 2009-10 సంవత్సరంలో వాయిదాల పద్ధతిలో సుమారు రెండువేల మందికి విక్రయించారు. మూడు సంవత్సరాల కాలవ్యవధిలో పూర్తిగా నగదు చెల్లించే నిబంధనతో గజం రూ. రెండువేల చొప్పున 120, 160, 200, 240 చదరపు గజాలుగా విభజించి రెండు వేలకుపైగా ప్లాట్లను విక్రరుుంచారు. అధికారంలో ఉన్నాం గాబట్టి అనుమతులు వస్తాయని నమ్మించి ఆరేళ్లరుునా పొలాన్ని ప్లాట్లుగా విభజించకపోగా ఎలాంటి అభివృద్ధి చేయలేదు. జిల్లాలో ఏర్పాటు చేయనున్న రాజధానికోసం ఆ 33 ఎకరాలూ వెళ్లడంతో ప్లాట్లు కొనుగోలు చేసినవారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
కంపెనీలో సిబ్బందిని వారు ప్రశ్నిస్తే రెండు వందల గజాలకు నాలుగు లక్షలు మూడు సంవత్సరాల క్రితం చెల్లిస్తే ఇప్పుడు కంపెనీ ఖర్చులంటూ కత్తిరించి రెండు లక్షలు ఇస్తామంటూ తప్పుకుంటున్నారు. చేసేది లేక కొందరు తిరిగి తీసుకుంటున్నారు. గట్టిగా నిలదీస్తే వడ్డీలు వేసి చెల్లిస్తుండగా అమాయకులను మాత్రం బెదిరించి సగానికి సగం తగ్గించేస్తున్నారని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో కంపెనీ తమను మోసం చేసిందని మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో కొందరు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసునమోదు చేయకుండా కంపెనీ ప్రతినిధులను పిలిచి రాజీ కుదర్చి పంపించారని తెలిసింది. మిగిలినవారి పరిస్థితి ఏమిటన్నది ఇంకా సందేహంగానే మిగిలింది.
వారంతా రోడ్డున పడాల్సిందేనా..?
నెల రోజుల క్రితం వరకు మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ఒక్క సెంటు స్థలం వుంటే తాము మహారాజులమని భావించిన సామాన్యులు ఇప్పుడు ఈ ప్రాంతంలో స్థలం ఎందుకు కొన్నామా.. అని మదనపడుతున్నారు. రాష్ట్రం విభజన సమయం నుంచే కొత్త రాష్ర్ట రాజధానిగా మంగళరిగి ప్రాంతం ప్రచారం కావడంతో అన్ని జిల్లాల వారు ఇక్కడ స్థలాలు కొనుగోలు చేసేందుకు పోటీపడ్డారు.
లేఅవుట్‌లకు అనుమతులున్నాయా..లేవా అనేది చూడకుండా కష్టపడి కూడబె ట్టిన సొమ్ముతో ప్లాట్లు కొనుగోలు చేశారు. వారంతా ప్రభుత్వ చర్యలతో నేడు వీధినపడబోతున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో గ్రామకంఠాలు, అధికార లేఅవుట్‌లు మినహా మిగిలిన అన్ని భూములు, ప్లాట్లును ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈమేరకు సీఆర్‌డీఏ అధికారుల ఆదేశాలతో రెండు రోజులుగా కృష్ణాయపాలెం, కాజ, చినకాకాని గ్రామాల్లో అనధికార లేఅవుట్‌లను తొలగిస్తున్నారు. దీనిపై సీఆర్‌డీఏ అధికారుల వివరణ కోరగా అనధికార లేఅవుట్‌లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారితో తమకు సంబంధం లేదని అనధికార నిర్మాణాలను తొలగించి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.