ఘనంగా సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు | PM Modi Wishes CM Jagan Mohan Reddy On His Birthday | Sakshi
Sakshi News home page

ఘనంగా సీఎం జగన్‌ జన్మదిన వేడుకలు

Published Sun, Dec 22 2019 3:21 AM | Last Updated on Sun, Dec 22 2019 3:21 AM

PM Modi Wishes CM Jagan Mohan Reddy On His Birthday - Sakshi

సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ/నెట్‌వర్క్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకల్ని శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి.. పలు చోట్ల రక్తదాన శిబిరాలు, సేవాకార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, రాష్ట్ర మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు సీఎంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రులు, అధికారుల శుభాకాంక్షలు
ఉదయం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్‌ను అధికారుల సమక్షంలో సీఎం జగన్‌ కట్‌ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లంతో పాటు అధికారులు శామ్యూల్, ధనుంజయరెడ్డి, విజయకుమార్‌రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్, ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్‌ తదితరులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పర్యటనకు వెళ్లే ముందు ముఖ్యమంత్రికి మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, కొడాలి నాని, పేర్ని నాని, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. ధర్మవరం పర్యటన ముగించుకుని వచ్చాక మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, పి.అనిల్‌కుమార్‌ యాదవ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, లోక్‌సభ సభ్యులు వి.బాలశౌరి,  నందిగం సురేష్‌ ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు.

వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో...

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకల్లో శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొని కేక్‌ కట్‌ చేసి, దుప్పట్లు పంపిణీ చేశారు. తొలుత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో గత ఆరు నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన చట్టాలు, తీసుకున్న నిర్ణయాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మరో 30 ఏళ్లు వైఎస్‌ జగన్‌ రాష్ట్రానికి సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్‌ కొండమడుగుల సుధాకర్‌రెడ్డి, నాయకులు నాగదేశి రవికుమార్, నడికూడి సూరీరెడ్డి, నాగార్జున యాదవ్, జె శ్రీనివాసులరెడ్డి, షేక్‌ గౌస్‌ మొహిద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

డెహ్రాడూన్‌లో కేక్‌ కట్‌చేసిన స్పీకర్‌ తమ్మినేని

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం డెహ్రాడూన్‌లో శనివారం జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. స్పీకర్ల సదస్సులో పాల్గొనేందుకు డెహ్రాడూన్‌ వెళ్లిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి అక్కడ ఓ హోటల్‌లో కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో గుజరాత్‌ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది, గోవా స్పీకర్‌ రాజేష్‌ పట్నేకర్, ఢిల్లీ స్పీకర్‌ రామ్‌నివాస్‌ గోయెల్, హిమాచల్‌ప్రదేశ్‌ స్పీకర్‌ రాజీవ్‌ బిందాల్, ఉత్తరాఖండ్‌ లైజన్‌ ఆఫీసర్‌ కులదీప్‌ రాణా, కర్ణాటక, అసోం, గుజరాత్, గోవా అసెంబ్లీల కార్యదర్శులు పాల్గొన్నారు.

ప్రధాని మోదీ, గవర్నర్, కేంద్ర మంత్రుల శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘాయుష్షు, ఆరోగ్యవంతమైన జీవితం కలిగి ఉండాలని ఆశిస్తున్నాను’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ రీట్వీట్‌ చేస్తూ... ‘నరేంద్రమోదీ గారూ! హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినందుకు నా కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ట్విటర్‌లో శుభాకాంక్షలు అందచేశారు.గవర్నర్‌కు కూడా జగన్‌ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు.

కేంద్ర గణాంక, ప్లానింగ్‌ శాఖ మంత్రి రావ్‌ ఇందర్‌జిత్‌సింగ్, పశు సంవర్ధక శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌సారంగి, రాజస్థాన్‌ గవర్నర్‌ కల్రాజ్‌ మిశ్రా, మేఘాలయ ముఖ్యమంత్రి సి.సంగ్మా , నాగాలాండ్‌ ఉప ముఖ్యమంత్రి యాంతుంగో పాఠన్, జార్ఖండ్‌ ఎంపీ అన్నపూర్ణ దేవి, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ శుక్లా, రాష్ట్రీయ కామధేను ఆయోగ్‌ చైర్మన్‌ డాక్టర్‌ వల్లభ్‌ కథిరియా, ఇండియా టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ రజత్‌ శర్మ, తదితరులు ట్విటర్‌లో ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ జగన్‌ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

తమిళనాడు సీఎం, ప్రతిపక్ష నేత స్టాలిన్‌ శుభాకాంక్షలు
వైఎస్‌ జగన్‌కు తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి, ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తూ సీఎం పళనిస్వామి లేఖ పంపగా.. ప్రతిపక్ష నేత స్టాలిన్‌ ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

జగన్‌కు కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ కార్య నిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు శుభాకాంక్షలు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement