
సీఎం పర్యటనపై కలెక్టర్ కసరత్తు
విజయవాడ : జిల్లాలోని పలు కార్యక్రమాలకు 21న హాజరుకానున్న సీఎం చంద్రబాబు పర్యటనపై కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు కసరత్తు చేశారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పాల్గొనే పలు కార్యక్రమాలను పగడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
సీఎం పర్యటనలో భాగంగా విజయవాడలో పోలీసు సంస్మరణ దినోత్సవం, ఇతర కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో, పోలీసు పేరెడ్ గ్రౌండ్‌లో పాల్గొని, అనంతరం పోలీసు కంట్రోల్ రూంను ప్రారంభిస్తారని చెప్పారు. రైతు సాధికారిత సంస్థను గన్నవరంలోని ఎన్టీఆర్ పశువుల కళాశాల ఆవరణలో ప్రారంభిస్తారు. ఈ పర్యటన సందర్భంగా గన్నవరంలో నిర్వహించే కార్యక్రమాలకు చెందిన రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సదస్సుకు హాజరయ్యే రైతులు వచ్చే వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.
సభా ప్రాంగణంలో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. సదస్సుకు హాజరయ్యే రైతులకు తాగునీటి వసతి కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ జెడీ దామోదర నాయుడు, అడిషనల్ జాయింట్ కలెక్టర్ బి.ఎల్. చెన్నకేశవరావు, వ్యవసాయశాఖ జేడీ వి.నరసింహులు, మార్కెటింగ్ జేడీ కె. శ్రీనివాసరావు, సమాచారశాఖ డీపీఆర్‌వో కె.సదారావు, విజయవాడ, గన్నవరం తహశీల్దార్లు శివరావు, మాధురి, మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.