గవర్నర్ దృష్టికి పోలీసుల దుశ్చర్యలు | Police abuse to the attention of the Governor | Sakshi
Sakshi News home page

గవర్నర్ దృష్టికి పోలీసుల దుశ్చర్యలు

Published Mon, Jan 5 2015 3:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

గవర్నర్ దృష్టికి పోలీసుల దుశ్చర్యలు - Sakshi

గవర్నర్ దృష్టికి పోలీసుల దుశ్చర్యలు

  • వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి హామీ
  • అమాయకుల నిర్బంధంపై నేడు హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు
  • వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌కు రైతుల కష్టాలపై వివరణ
  • సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంత రైతుల్లో ఆత్మ విశ్వాసం నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా.. అమాయక రైతులపై పోలీసుల దుశ్చర్యలను ఎండగడుతూ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆదివారం పెనుమాకలో రైతులు, పోలీసుల అదుపులో ఉన్న బాధితుల కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు. వారికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

    వైఎస్సార్‌సీపీ రాజధాని ప్రాంత రైతు, కౌలురైతు, రైతుకూలీ పరిరక్షణ కమిటీ నేతలు, పార్టీ ఎమ్మెల్యేలందరితో పాటు హైదరాబాద్‌లో గవర్నర్‌ను కలిసి ఇక్కడ జరిగిన సంఘటనలను వివరిస్తామని వారికి అభయమిచ్చారు. ఈ మేరకు ఒక వినతిపత్రం అందజేస్తామని కూడా తెలిపారు. సోమవారం ఉదయానికి బాధితుల కుటుంబసభ్యులను, రైతులను హైదరాబాద్‌కు తీసుకెళ్లి తమ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి వారి కష్టాలను స్వయంగా వివరిస్తామని ఎమ్మెల్యే చెప్పారు.

    అంతేగాకుండా పోలీసుల వేధింపులపై మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేయించాలని కూడా నిర్ణయించారు. రాజధాని ప్రాంత నిర్మాణానికి రైతులు భూములను స్వచ్ఛందంగా ఇస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఓ వైపు ప్రకటిస్తుంటే, మరోవైపు భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను భయ భ్రాంతులకు గురిచేసి తమ దారికి తెచ్చుకునే దిశగా ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గత నెల 29వ తేదీన రాజధాని ప్రాంతంలో జరిగిన దహన కాండను సాకుగా చూపి భూసమీకరణకు వ్యతిరేకంగా ఉన్న రైతులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంది.

    ఇందులో భాగంగా అమాయకులైన 25 మంది కార్యకర్తలను పోలీసులు ఆదుపులోకి తీసుకుని మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు పోలీస్‌స్టేషన్లలో మూడు రోజులుగా నిర్బంధించి నానా హింసలు పెడుతున్నట్లు సమాచారం. రాజధాని ప్రాంతంలోని ఆరు గ్రామాల్లో 13 చోట్ల దుండగులు దహనకాండ చేపట్టారు. అది తామే చేశామంటూ ఒప్పుకోవాల్సిందిగా నిర్బంధంలో ఉన్నవారిని పోలీసులు బలవంతపెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల చర్యలతో మంగళగిరి, తాడేపల్లికి చెందిన గ్రామాల రైతులు హడలి పోతున్నారు.

    ఈ నేపథ్యంలో తాము అండగా ఉన్నామని చెప్పేందుకు, రైతుల్లో మనోధైర్యం కలిగించేందుకు ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి వారితో సమావేశమయ్యారు. రాజధాని ప్రాంత గ్రామాల రైతులు ఎలాంటి అందోళన చెందవద్దని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. పోలీసుల దుర్మార్గపు చర్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement