అధికార పార్టీకి తొత్తులుగా పోలీసులు
అరెస్ట్ చేయాలంటే భయం
చార్జిషీట్లు వేయాలంటే వణుకు
సుప్రీంకోర్టుకు న్యాయమూర్తి లేఖ
ఏలూరు : అధికారంలో ఉంటే చట్టం చుట్టంగా మారుతుందా.. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలకు దాసోహమవుతారా.. పశ్చిమ జిల్లాలో రెండేళ్లుగా సాగుతున్న తతంగాలు ఇందుకు అవునని సమాధానమిస్తున్నాయి. పోలీసుల అలసత్వంపై స్వయంగా ఒక న్యాయమూర్తి సుప్రీం కోర్టుకు లేఖ రాసే పరిస్థితి వచ్చిందంటే జిల్లా పోలీస్ యంత్రాంగం తీరు ఏ విధంగా ఉందో అవగతమవుతోంది. ఏకంగా న్యాయమూర్తి, న్యాయవాదులపై అమానుషంగా దౌర్జన్యానికి పాల్పడిన కేసులో ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుకు పోలీసులు కొమ్ముకాస్తున్న వైనం సాధారణ ప్రజలను సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
చట్టాలు చేసేవారే..
గతంలో జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారిపై దాడి చేసినా.. మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్‌పై దౌర్జన్యానికి పాల్పడినా.. ఐసీడీఎస్ అధికారులను బెదిరించినా.. చివరకు టూటౌన్ పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగినంత పనిచేసి నిందితులను బయటకు తీసుకువెళ్లినా.. మొత్తం 34 కేసులు నమోదైనా సదరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునే ధైర్యం చేయలేదు జిల్లా పోలీ సులు. మండల మేజిస్ట్రేట్ అయిన మహిళా తహసీల్దార్ వనజాక్షిపై దాడికి తెగబడినా చేష్టలుడిగి చూస్తుండిపోయారు. దీంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులతోపాటు నాయకులు సైతం అధికారులపై దురుసుగా ప్రవర్తిం చడాన్ని ఆనవాయితీగా మార్చుకున్నారు.
కోర్టు ప్రాంగణంలో దాడి చేసినా..
కోర్టు ప్రాంగణంలోకి దూసుకెళ్లి దాడికి యత్నించిన నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుపై హత్యాయత్నం, ఇతర సెక్షన్ల కింద నమోదైన కేసులను ఎత్తివేయడమే కాకుండా.. 22 నెలలు గడిచినా చార్జిషీట్ వేయకపోవడాన్ని చూస్తే ప్రభుత్వం అండ ఉంటే ఎలా అయినా విధులు నిర్వహించవచ్చనే ధీమాకు తార్కాణంగా కనిపిస్తోంది. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన నరసాపురం డీఎస్పీ జి.పూర్ణచంద్రరావు, పట్టణ సీఐ రామచంద్రరావుపై చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టుకు, డీజీపీకి జిల్లా అదనపు న్యాయమూర్తి పి.కల్యాణరావు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వం తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తే న్యాయశాఖ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదని భారత ప్రధాన న్యాయమూర్తి తిరాత్‌సింగ్ ఠాకూర్ పేర్కొన్న విషయాన్ని కల్యాణరావు తన లేఖలో ఉటంకించారు. 2014లో నరసాపురంలోని కోర్టు వద్ద ఆక్రమణల తొల గింపు విషయంలో ఎమ్మెల్యే మాధవనాయుడు అనుచిత ప్రవర్తనపై కోర్టు ధిక్కార నేరం కింద కేసు నమోదైన విషయం విదితమే. ఎమ్మెల్యే తన తప్పును మన్నించాల్సిందిగా కోరారు.
దీనిపై న్యాయమూర్తి ఎమ్మెల్యేపై భవిష్యత్ చర్యలు ఉపసంహరించి నరసాపురం టౌన్ స్టేషన్‌లో నమోదైన కేసులో నిప్పక్షపాత విచారణ జరిపి తుది నివేదికను సమర్పించాలని ఆదేశించారు. అయితే పోలీసులు మాత్రం ఎమ్మెల్యే ఇచ్చిన లేఖ ఆధారంగా కేసును ‘మిస్టేక్ ఆఫ్ యాక్ట్’గా రిఫర్ చేయడాన్ని న్యాయమూర్తి తీవ్రంగా ఆక్షేపించారు. ఎమ్మెల్యే తన అనుచరులతో ఒక పథకం ప్రకారం తనపైన, న్యాయవాదులపైన దాడికి పాల్పడినట్టుగా స్పష్టమైన వీడియో చిత్రాలను అందజేసినా పోలీసులు హత్యాయత్నానికి సంబంధించిన సెక్షన్‌ను తొల గించడంపై న్యాయమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తనపైన, న్యాయవాదులపైన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా జాతీయ జెండాను కాలికింద వేసి తొక్కి అవమానించిన విషయాన్ని పోలీసులు తేలికగా తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయమూర్తి లేఖతో అయినా పోలీసు యంత్రాంగం స్పందిస్తుందా.. లేక పచ్చచొక్కాలతో అంటకాగే వైఖరిని కొనసాగిస్తుందా వేచి చూడాల్సిందే.