పోలీస్ బాస్‌ల బదిలీ | Police boss transfers senior officers | Sakshi
Sakshi News home page

పోలీస్ బాస్‌ల బదిలీ

Published Thu, Jul 17 2014 12:02 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

పోలీస్ బాస్‌ల బదిలీ - Sakshi

పోలీస్ బాస్‌ల బదిలీ

 కాకినాడ క్రైం/ ఆల్కాట్‌తోట (రాజమండ్రి) :జిల్లా నుంచి ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులు బదిలీ అయ్యారు. జిల్లా ఎస్పీ జి.విజయ్‌కుమార్ కృష్ణా జిల్లా ఎస్పీగా బదిలీ కాగా ఆయన స్థానంలో విజయవాడ డీసీపీ రవిప్రకాష్ రానున్నారు. రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీ టి.రవికుమార్‌మూర్తి హైదరాబాద్ సీఐడీ విభాగానికి వెళుతుండగా ఆయన స్థానంలో పశ్చిమగోదావరి ఎస్పీ ఎస్.హరికృష్ణ బదిలీ అయ్యారు. కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ రాజేష్‌కుమార్ గుంటూరు అ ర్బన్ ఎస్పీగా బదిలీ కాగా ఆయన స్థానంలో కృష్ణా జిల్లా ఎస్పీ జె.ప్రభాకరరావు రానున్నారు.
 
 ఎన్నికల్ని సమర్థంగా నిర్వహించిన విజయ్‌కుమార్
  విజయ్‌కుమార్ మెదక్ ఎస్పీగా పనిచేస్తూ గత ఫిబ్రవరి 17న బదిలీపై జిల్లాకు వచ్చారు. సార్వత్రిక, స్థానిక ఎన్నికలను సమర్థంగా నిర్వహించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేశారు. పోలీసు సిబ్బందితో పాటు రిటైర్డ్ పోలీసు అధికారులు, ఉద్యోగులకు గణనీయమైన సేవలందించారు. జిల్లాకు కొత్త ఎస్పీగా రవిప్రకాష్ రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. 1999 గ్రూపు-1 బ్యాచ్‌కు చెందిన రవిప్రకాష్ పదోన్నతిపై ఇంటెలిజెన్స్ ఎస్పీ అయ్యారు. అక్కడ నుంచి విజయవాడ సిటీ పోలీస్ కమిషనరేట్ డీసీపీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వస్తున్నారు.
 
 సాంకేతికతను జోడించిన రవికుమార్‌మూర్తి
 అర్బన్ జిల్లా ఎస్పీగా 2012 ఏప్రిల్ 16న బాధ్యతలు చేపట్టిన టి.రవికుమార్‌మూర్తి రాజమండ్రిలో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచారు. గత ఏడాది సంచలనం సృష్టించిన ఏటీఎం సొమ్ము చోరీ కేసును త్వరితగతిన ఛేదించి  మన్ననలు పొందారు. పోలీసుశాఖకు సాంకేతికతను జోడించి, మొబైల్ ట్రాకింగ్, బీట్ ట్రాకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఉద్యోగుల సంక్షేమానికి కూడా కృషి చేసి వారి ఆదరం పొందారు.
 
 సిబ్బందిలో పనిచేసే తత్వాన్ని పెంచిన హరికృష్ణ
 అర్బన్ ఎస్పీగా రానున్న హరికృష్ణ అనంతపురం జిల్లాకు చెందిన వారు. 1998లో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆ యన కాశీబుుగ్గ, జమ్మలమడుగు, కామారెడ్డి, నర్సారావుపేటల్లో పనిచేశారు. పదోన్నతిపై ఓఎస్‌డీగా గుంటూరు  జిల్లా లో,  ఏఎస్పీగా కరీంనగర్‌లో పనిచేశారు. తరువాత పోలీస్ అకాడమీలో పని చేస్తూ గవర్నర్ వద్ద ఏడీసీగా చేరారు. గత ఏడాది నవంబరు 13న పదోన్నతి పొంది పశ్చిమగోదావరి ఎస్పీ అయ్యారు. నేరాలను అరికట్టడంలో, పలు కేసులను ఛేదించే విషయంలో విశేష కృషి చేశారు. సిబ్బందిలో పనిచేసే తత్వాన్ని పెంపొందించారు.
 
 అల్ ఉమా ఉగ్రవాదుల్ని పట్టుకున్న ప్రభాకరరావు
 కాకినాడ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా బదిలీ అయిన ప్రభాకరరావు తెనాలికి చెందిన వారు. 1984 నుంచి 90 వరకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో అధికారిగా పనిచేసిన ఆయన 1991 గ్రూప్-1 ద్వారా డీఎస్పీగా ఎంపికయ్యారు. గుంటూరు డీఎస్పీగా పనిచేసినప్పుడు టీడీపికి చెందిన ఓ ప్రజాప్రతినిధి అనుచరుడైన డేగల శ్రీను ఆగడాలను అరికట్టి పేరు తెచ్చుకున్నారు. 1997 నుంచి 99 వరకు రాజమండ్రి డీఎస్పీగా పనిచేసిన సమయంలో అల్ ఉమా ఉగ్రవాదులను పట్టుకున్న ఘనత దక్కింది. అనంతరం పదోన్నతిపై కొత్తగూడెం ఓఎస్‌డీగా, కర్నూలు ఏఎస్పీగా పనిచేసి  పదోన్నతిపై హైదరాబాద్‌కు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్పీగా వెళ్లారు. అనంతరం గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండెంట్‌గా 2010 వరకు, తిరుపతి అర్బన్ ఎస్పీగా 2012 వరకు పని చేశారు. 2012 డిసెంబరులో కృష్ణాజిల్లా ఎస్పీగా నియమితులయ్యారు. 2012లో ఇండియన్ పోలీస్ మెడల్‌ను అందుకున్నారు. 2012 నవంబర్ 27న ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన రాజేష్‌కుమార్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిచ్చారు. ఇప్పుడు బదిలీపై గుంటూరు అర్బన్ ఎస్పీగా వెళుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement