ప్రత్తిపాడు : ‘గ్రామ పోలీసు వ్యవస్థ’ను పటిష్టం చేసేందుకు అర్బన్ జిల్లా ఎస్పీ రాజేష్‌కుమార్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. దీని కోసం వినూత్నంగా, వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు అంతంత మాత్రంగా అమలులో ఉన్న విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థను పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు నడుం బిగించారు. రాష్ట్రంలోనే ఏ జిల్లాలోనూ లేని విధంగా అర్బన్ జిల్లా విలేజ్ ఇన్ఫర్మేషన్ పేరుతో ప్రత్యేక పుస్తకాలను ముద్రించి అర్బన్ జిల్లా పరిధిలోని పోలీస్‌స్టేషన్లకు అందజేశారు.
గ్రామ పోలీసు వ్యవస్థ అంటే..
నేరాలను నియంత్రించాలన్నా, నేరస్తులను పట్టుకోవాలన్నా ప్రజల భాగస్వామ్యం ఆశించిన స్థాయిలో లేకుంటే సత్ఫలితాలు తక్కువగా ఉంటాయి. అందుచేత పోలీసు వ్యవస్థను ప్రజలకు చేరువ చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే గ్రామ పోలీసు వ్యవస్థ. ప్రతి స్టేషన్ హౌసింగ్ అధికారి తన పరిధిలో ఉన్న ప్రతి గ్రామానికి ఒక పీసీ, హెచ్‌సీని గ్రామ పోలీసు అధికారిగా నియమించి వారి ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని వినియోగించుకోవడం ఈ గ్రామ పోలీసు వ్యవస్థ ఉద్దేశం.
వ్యవస్థ ముఖ్య ఉద్దేశాలు..
పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేయడం. చట్టాలపై అవగాహన కల్పించడం. స్వచ్ఛందంగా ప్రజలు పోలీసు విధులకు సహకరించేలా తయారుచేయడం. ప్రజలను నేరాల బారిన పడకుండా కాపాడటం. నేర నియంత్రణకు, నేరస్తులను గుర్తించుటకు ప్రజలను సంసిద్ధం చేయటం. గ్రామాల్లోని సంఘ వ్యతిరేక శక్తులపైనా, చెడు నడత కలిగిన వారిపైనా క్షేత్ర స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడం.
కులాలు, మతాలు, వర్గాల వారీగా విభేదాలు, గొడవలు రాకుండా ఐకమత్యంగా ఉండేలా చేయడం. గ్రామంలోకి వచ్చే కొత్త వారిపై, అనుమానితులపై, వారికి సహకరించే వారిపై నిఘా పెట్టడం. గతంలో శిక్ష పడిన వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టడం. నేరస్తులను త్వరితగతిన అరెస్టు చేసేలా సహకరించడం. గ్రామంలో జరిగే అన్ని విషయాల పట్ల సమాచారాన్ని సేకరించి దానిపై విశ్లేషణ చేసి, తదనంతరం ఎస్‌హెచ్‌వోతో చర్చించి తగు చర్యలు తీసుకోవడం. గ్రామ స్థాయిలో ఉన్న వివిధ శాఖల అధికారుల నుంచి పోలీసు విధులకు సహకారాన్ని తీసుకోవడం.
వ్యవస్థ వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలు..
పోలీసు సేవలను గ్రామస్థాయిలో ప్రజలు పొందడం. గ్రామస్థాయిలోనే ఫిర్యాదులను అందించడం. మధ్యవర్తి వ్యవస్థను నియంత్రించి నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లేందుకు, నేర సమాచారాన్ని, నేరస్తుల వివరాలను తేలికగా ప్రజలు పోలీసులకు అందించేందుకు వీలుగా ఉంటుంది.
మంచి ఫలితాలుంటాయి:
గ్రామ పోలీసు వ్యవస్థ వల్ల మంచి ఫలితాలు ఉంటాయి, అటు ప్రజలకు, ఇటు ఎస్‌హెచ్‌వోలకు ఎంతగానో ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. ప్రజలకు, పోలీసులకు మధ్య సన్నిహిత సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు, నేరాల నియంత్రణకు, నేర పరిశోధనకు, నేరగాళ్లను అరెస్టు చేసేందుకు దోహదపడుతుంది.
- సీహెచ్ ప్రతాప్‌కుమార్,ప్రత్తిపాడు,ఎస్‌ఐ
పోలీస్ బ్రదర్స్
Published Sat, Feb 28 2015 2:40 AM | Last Updated on Tue, Aug 21 2018 8:52 PM
Advertisement
Advertisement