
కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
తమిళనాడులో శిశువు లభ్యం
24 గంటల్లోగానిందితురాలు పట్టివేత
తిరుపతి క్రైం : పుట్టి నెలరోజులు కూడా గడవని శిశువును కిడ్నాప్ చేసిన కేసును 24 గంటల్లోగా అర్బన్ జిల్లా పోలీసులు చేధించారు. శనివారం తిరుపతి రూరల్ విద్యానగర్ కాలనీలోని నలందానగర్‌లో సంతోష్, బాటు దంపతుల బిడ్డ(27 రోజుల పురుటిబిడ్డ) మాయమైన విషయం తెల్సిందే. వెస్ట్ డివిజన్ డీఎస్పీ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. సంతోష్ భార్య బాటుకు వరుసకు చిన్నాన్న అయిన బలరాం రెండో భార్య పూజాకు పిల్లలు లేరు. అయితే తాను గర్భిణి అంటూ పుట్టింటి వారిని నమ్మించే ప్రయత్నం చేస్తుండేది. తనకు కుమారుడు పుట్టాడని చూపించేందుకు ఆమె బంధువైన బాటు కుమారుడు ఉత్తమ్‌కుమార్‌ను తీసుకెళ్లింది. అయితే శిశువును తీసుకెళ్లే విషయం బలరాంకు కూడా తెలీయదని పోలీసులు చెబుతున్నారు.
బాటు ఫిర్యాదు మేరకు 8 టీమ్‌లుగా ఏర్పాటు చేసి 2 టీమ్‌లు చెన్నైకి వెళ్లగా మరో ఆరు టీమ్‌లు స్థానికంగా ముమ్మర తనిఖీలు చేపట్టాయి. అయితే తమిళనాడులోని చిదంబరం పరిసర ప్రాంతంలోని మేళగిరిలో పూజాకు ఓ తమ్ముడున్నాడు. ఈమె కచ్చితంగా శిశువును తీసుకుని అక్కడికే వెళ్లి ఉంటుందని తెలుసుకున్న పోలీసులు ఈమెకన్నా ముందుగా ఆదివారమే ఉదయం అక్కడికి చేరుకున్నారు. ఆమె తన తమ్ముడు రాజేంద్ర ఇంటికి రాగానే శిశువును పోలీసుల చేతికి తీసుకున్నారు. ఆమెను ఆర్డీవో సమక్షంలో దగ్గరలోని పీలంబహూర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అరెస్ట్ చూపించారు. శిశువును ఆదివారం రాత్రి తిరుపతి నగరానికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.