త్యాగానికి ప్రతిరూపం పోలీస్ శాఖ
విజయనగరంటౌన్: పోలీస్ శాఖ త్యాగానికి ప్రతిరూపమని, వ్యవస్థలో మార్పు పోలీస్ శాఖతోనే ప్రారంభం కావాలనుకున్నానని ఎస్పీ ఎల్‌కెవి.రంగారావు పేర్కొన్నారు. ఎస్పీగా పని చేసి బదిలీపై వెళ్తున్న ఎస్పీ ఎల్‌కెవి.రంగారావును ఎస్‌వీఎన్ లేక్ ప్యాలెస్‌లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం బుధవారం ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థను అవినీతి రహితంగా మార్చేందుకు తాను పని చేసిన 14నెలలు నిరంతరం శ్రమించానన్నారు. పోలీసులు ధరించే ఖాకీ యూనిఫారం ప్రజలు ఇచ్చిందని, అటువంటి ప్రజలకు ఎంతో కొంత సేవలందించాలనే సంకల్పంతో పని చేశామన్నారు.
తాను ప్రతిదినం ప్రబోధం, ఆత్మీయ నేస్తం, ఆత్మీయ వీడ్కోలు, తస్మాత్ జాగ్రత్త, డైల్ విత్ యువర్ ఎస్పీ వంటి కార్యక్రమాలును నిర్వహించి పోలీస్ వ్యవస్థను ప్రజలకు దగ్గర చేశానని తెలిపారు. విధి నిర్వహణలో తాను కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని తెలిపారు. అదనపు ఎస్పీ అట్టాడ వెంకటరమణ మాట్లాడుతూ పోలీస్ శాఖ పనితీరు ఎస్పీ మార్గనిర్దేశంతో మెరుగుపడిందన్నారు. నర్సీపట్నం ఓఎస్‌డీ సిద్దార్ధ్ కౌశల్ మాట్లాడుతూ చట్టాన్ని అమలు చేయడంతో పాటు ప్రజలకు న్యాయం చేసేందుకు ఎస్పీ అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఆనందాన్నిచ్చిందన్నారు.
పీటీసీ ప్రిన్సిపల్ రాజశిఖామణి మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రారంభం నుంచి చివరి వరకూ ఒకే విధంగా ఉన్న ఏకైక వ్యక్తి ఎస్పీ అని కొనియాడారు. అనంతరం సేవాసంస్థల ప్రతినిధులు కాపుగంటి ప్రకాష్, మయూరా బాబూరావు, మేకా కాశీవిశ్వేశ్వరరావు, సురేష్‌తో పాటూ పలువురు ఎస్‌ఐలు, సీఐలు ప్రసంగించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ ఎల్‌కెవి.రంగారావు, ఆయన సతీమణి కృష్ణవేణిలను దుశ్శాలువలతో, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.