ధారూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలీసు ఫైరింగ్‌రేంజ్‌లు ఉన్నాయని, ఒక్క రంగారెడ్డిలోనే లేదని జిల్లా ఎస్పీ రాజకుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె అదనపు ఎస్పీ వెంకటస్వామి, ఏఆర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ తదితరులతో కలిసి మండలంలోని జైదుపల్లి సమీపంలో ఉన్న 116, 122 సర్వేనంబర్లలోని గుట్టల ప్రాంత భూములను పరిశీలించారు. రెండు సర్వేనంబర్లలో రోడ్డు ముఖంగా 75 ఎకరాల భూమి కోసం గతంలోనే తహసీల్దార్‌కు దరఖాస్తు చేశామని, ఇందులో భాగంగానే భూములను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ఫైరింగ్‌రేంజ్‌తో పాటు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వికారాబాద్‌లో డీటీసీ కేంద్రం ఉన్నా పోలీసు ఫైరింగ్‌రేంజ్ లేక శిక్షణలో ఉన్న వారిని 100 కిలోమీటర్ల దూరంలోని అప్పాకు (పోలీసు అకాడమీ), లేదంటే మహబూబ్‌నగర్ జిల్లాకు పంపాల్సి వస్తోందన్నారు. 100 కిలోమీటర్లు వెళ్లి రావాలంటే వ్యయ ప్రయాసలకు గురవుతున్నారని పేర్కొన్నారు. స్థానికంగా స్థలం కోసం ప్రయత్నాలు చేశామని, జైదుపల్లి గ్రామ సమీపంలోని గుట్టప్రాంతం అనువుగా ఉందన్నారు. దీనికి సంబంధించిన భూముల మ్యాప్‌ను ఎస్పీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు సర్వేనంబర్లలో ఎక్కడెక్కడ భూములున్నాయో సర్వేయర్ ఎస్పీకి చూపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే జిల్లా ఎస్సీ పరిధి కూడా పెరిగే అవకాశం ఉందని, వికారాబాద్ జిల్లా కేంద్రం అయ్యే అవకాశం ఉందని ఏఆర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ అన్నారు. పోలీసుల అవసరాల కోసం ముందుగానే స్థలాల అన్వేషణ చేస్తున్నట్లు చెప్పారు. ఎస్పీ వెంట సర్వేయర్ రూప, ధారూరు ఎస్‌ఐ మొయినొద్దీన్ తదితరులు ఉన్నారు.
జైదుపల్లిగుట్టల్లో ఫైరింగ్ రేంజ్
Published Sat, Dec 14 2013 1:00 AM | Last Updated on Tue, Aug 21 2018 7:18 PM
Advertisement