పోలీసుల దాడిలో గాయపడి సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు నాగరాజు
అనంతపురం సెంట్రల్/ యల్లనూరు: తాడిపత్రి డివిజన్ పోలీసుల వ్యవహార శైలి రోజురోజుకూ వివాదాస్పదమవుతూనే ఉంది. అధికార తెలుగుదేశం పార్టీ నేత మెప్పు కోసం న్యాయాన్యాయాలను పక్కనపెట్టి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు, సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతున్నారు. ఎవరేమి అనుకున్నా పర్వాలేదు.. మా నేత వద్ద మెప్పు పొందితే చాలు అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల యల్లనూరు మండలం తిమ్మంపల్లిలో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడు, టీడీపీ చోటా నాయకుడు అయిన మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న బెల్టుషాపు వ్యవహారం ‘బెల్టుమోహనరంగా’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనంతో బట్టబయలమైంది. పోలీస్ పికెట్ ఉన్న గ్రామంలోనే బెల్టుషాపులు నిర్వహిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తప్పనిసరి పరిస్థితుల్లో సోమవారం సదరు మోహన్‌రెడ్డి బెల్టుదుకాణంపై పోలీసులు దాడులు జరిపి 53 మద్యం బాటిళ్లు సీజ్ చేశారు. ఈ వ్యవహారంతో టీడీపీకి తీవ్ర మచ్చ ఏర్పడింది. దీంతో యల్లనూరు మండలంలో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు, సానుభూతిపరులను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నారు.
పోలీసుల ద్వంద్వ వైఖరి
బహిరంగంగా బెల్టుదుకాణం నిర్వహిస్తున్న మోహనరెడ్డి విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించిన పోలీసులు... ఓ సాధారణ వ్యక్తి విషయంలో కర్కశంగా వ్యవహరించారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. తిమ్మంపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడు నాగరాజు సోమవారం పెత్తర్ల అమావాస్య సందర్భంగా యల్లనూరుకు వచ్చి రెండు క్వార్టర్ల మద్యం తెచ్చుకున్నాడు. ఇంట్లో అర క్వార్టరు తాగి తన భార్యను తీసుకురావడానికి బస్టాండుకు వెళ్లాడు. అక్కడి నుంచి అతన్ని పోలీసులు వెంబడించారు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత పట్టుకొని సోదాలు చేశారు. ఒకటిన్నర క్వార్టరు మద్యం దొరికినట్లు సమాచారం. వాటిని స్వాధీనం చేసుకొని నాగరాజును యల్లనూరు పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. 12 క్వార్టర్లు లభ్యమైనట్లు ఒప్పుకోవాలని ఎస్‌ఐ గంగాధర్ ఒత్తిడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఒప్పుకోకపోవడంతో దుర్భాషలాడుతూ ఇష్టానుసారం చావబాదాడని, సిగరెట్లతో కాల్చాడని ఆరోపించాడు.
తీవ్రగాయాలతో బాధితుడు ఆస్పత్రిపాలు
తిమ్మంపల్లిలో ఇంటి వద్దే కాకుండా యల్లనూరు పోలీసుస్టేషన్‌లో కూడా చావబాదడంతో బాధితుడు నాగరాజు తీవ్రంగా గాయపడ్డారు. జామీను సంతకం తీసుకున్న తర్వాత వదిలేయడంతో బాధితున్ని కుటుంబసభ్యులు అనంతపురం సర్వజనాస్పత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆర్థో వార్డులో చికిత్స పొందుతున్నాడు. వైఎస్సార్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త పెద్దారెడ్డి ఇంటికి వద్దకు వెళ్లకూడదని ఎస్‌ఐ గంగాధర్ బెదిరించినట్లు బాధితుడు వాపోయాడు. పండుగ సందర్భంగా మద్యం తెచ్చుకుంటే.. తాను బెల్టుషాపు నిర్వహిస్తున్నట్లు ఒప్పుకోవాలంటూ ఎస్‌ఐ ఒత్తిడి తీసుకొచ్చారని కన్నీటి పర్యంతమయ్యాడు. ఉన్నతాధికారులు విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కోరాడు.
Comments
Please login to add a commentAdd a comment