వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు | Police have registered a large number of illegal cases against YSRCP leaders across the state | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు

Published Thu, Mar 7 2019 4:43 AM | Last Updated on Thu, Mar 7 2019 8:45 AM

Police have registered a large number of illegal cases against YSRCP leaders across the state - Sakshi

సాక్షి నెట్‌వర్క్‌: తెలుగుదేశం ప్రభుత్వం https://www.sakshi.com/tags/data-breachడేటా చౌర్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అధికారపార్టీ నేతలు దాన్నుంచి బయటపడేందుకు ఫారం–7 దరఖాస్తుల వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలపై అక్రమ కేసుల నమోదుకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్ల నేపథ్యంలో పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలపై భారీ ఎత్తున అక్రమ కేసుల నమోదు చేపట్టారు. ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు చేశారంటూ నోటీసులు జారీ చేయడమేగాక ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేశారు. అంతేగాక వారిని పోలీస్‌స్టేషన్‌లకు పిలిపించి భయభ్రాంతులకు గురిచేసేలా వ్యవహరించారు. విచారణ పేరుతో వేధింపులకు పాల్పడ్డారు. (ఇదీ జరుగుతోంది!)

అక్రమ కేసుల బనాయింపు తీరిదీ..
- అక్రమ ఓట్ల తొలగింపు కోరుతూ ఫారం–7 కింద దరఖాస్తులు చేశారనే పేరిట కృష్ణా జిల్లాలో బుధవారానికి 22 కేసులు నమోదు చేశారు. మైలవరంలో 15 మంది వైఎస్సార్‌సీపీకి చెందిన బూత్‌ లెవల్‌ కన్వీనర్లను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు సంబంధించి ఆన్‌లైన్‌లో అర్జీలను తాము దరఖాస్తు చేయలేదని వారు రాతపూర్వకంగా తెలిపారు. జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేటకు చెందిన వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్‌ డి.కమలేష్‌రాజును బుధవారం అర్ధరాత్రి చిల్లకల్లు పోలీసుస్టేషన్‌కు చెందిన ఏఎస్‌ఐ, హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ వచ్చి ఫారం–7 అర్జీపై విచారించారు. కమలేష్‌రాజు పేరిట అతని ఓటును అతనే తొలగించాలని కోరుతూ గుర్తు తెలియన వ్యక్తి ఆన్‌లైన్‌లో ఫారం–7 దరఖాస్తు చేయడం గమనార్హం. ఈ విషయమై విచారించేందుకు పోలీసులు అర్ధరాత్రిపూట ఇంటికి రావడమేమిటని కమలేష్‌రాజు వాపోయారు. (మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!)

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు ఫారం–7 పేరిట 20 కేసులు నమోదయ్యాయి. కావలి సబ్‌ డివిజన్లో 6, నెల్లూరు రూరల్‌ సబ్‌ డివిజన్లో 3, గూడూరు సబ్‌ డివిజన్లో 3, ఆత్మకూరు సబ్‌ డివిజన్లో 8 కేసులు చొప్పున నమోదు చేశారు. మంగళవారం గూడూరులో ఆరుగురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని విచారణకోసం స్టేషన్‌కు పిలిపించారు.
వైఎస్సార్‌ జిల్లా కేంద్రం కడపలో ఫారం–7 కింద ఓట్ల తొలగింపునకు దరఖాస్తు చేశారనే ఆరోపణతో వైఎస్సార్‌సీపీకి చెందిన 90 మందిపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు. బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండలంలో 1,712 ఓట్లకు తొలగింపునకు వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్ల పేరిట అగంతకులు ఫారం–7 దరఖాస్తు చేశారు. దీనిపై ఒకవైపు విచారణ జరుగుతుండగానే కలసపాడు పోలీసుస్టేషన్‌ పరిధిలో 12 మందిపై, బి.కోడూరు పోలీసుస్టేషన్‌ పరి«ధిలో 15 మంది వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్లపై కేసుల నమోదుకు తహసీల్దారు ఆదేశించారు. తమకు తెలియకుండానే ఫారం–7 దరఖాస్తులిస్తే ఎలా కేసులు నమోదు చేస్తారని వీరు విస్తుపోతున్నారు.

పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌సీపీకి చెందిన బూత్‌ కన్వీనర్లను, ముఖ్య కార్యకర్తల్ని బుధవారం పోలీస్‌స్టేషన్లకు పిలిపించారు. ఏలూరు మండలం నుంచి 205 మందిని ఏలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి వివరాలు సేకరించారు. దరఖాస్తులు మీరే చేశారా లేదా? అని ప్రశ్నించారు. మా పేరుతో ఫొటోతో ఎవరో దరఖాస్తు చేశారు.. మాకు సంబంధం లేదని వారు చెప్పారు. పెదవేగి నుంచి 185 మందిని పిలిపించి విచారించారు. ఆచంటలో బూత్‌ కన్వీనర్లను ఏలూరు ఎస్పీ కార్యాలయానికి పిలిపించారు. చింతలపూడిలో పలువురిని చింతలపూడి పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఇదే రీతిలో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోనూ బూత్‌ కన్వీనర్లు, ఇతర కార్యకర్తలను పోలీస్‌ స్టేషన్లకు పిలిపించి విచారణ పేరుతో భయభ్రాంతులకు గురిచేశారు.

కర్నూలు జిల్లాలో ఇప్పటివరకు 24 సైబర్‌ క్రైం కేసులు నమోదయ్యాయి. డోన్‌ నియోజకవర్గానికి సంబంధించి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో పది మంది వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. ఇదే నియోజకవర్గంలోని బేతంచర్ల మండలంలో 129 మందికి నోటీసులు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఆలూరులో 32 మంది వైఎస్సార్‌సీపీ బూత్‌ కన్వీనర్లు, పార్టీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 50 మంది బూత్‌ కన్వీనర్లపై కేసులు నమోదు చేసి.. విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.

తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 3వేల మందికి నోటీసులు జారీ చేయడంతోపాటు సుమారు 1,500 మందిపై కేసులు నమోదు చేశారు. వీరందరిని పోలీసు స్టేషన్లకు పిలిపించి విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేశారు. తుని నియోజకవర్గంలో 13 మంది బూత్‌కమిటీ కన్వీనర్లపై కేసు నమోదు చేశారు. ప్రత్తిపాడులో ముగ్గురు బూత్‌ కమిటీ కన్వీనర్లను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. గొల్లప్రోలు మండలంలో ఓటర్ల తొలగింపునకు దరఖాస్తు చేశారంటూ 43 మంది వైఎస్సార్‌ సీపీ బూత్‌ కమిటీ కన్వీనర్లపై, వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన బూత్‌ కమిటీ కన్వీనర్ల ఇళ్లకు పోలీసులు మంగళవారం అర్ధరాత్రి వెళ్లి భయాందోళనలు సృష్టించారు. పోలీస్‌స్టేషన్‌కు రాకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. బుధవారం ఉదయం వారిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీనిపై పిఠాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్‌ దొరబాబు ఆధ్వర్యంలో తహసీల్దారు కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. కాకినాడ సిటీలో 20 మంది బూత్‌కమిటీ కన్వీనర్లను పోలీసులు విచారించారు. వారికి నోటీసులిచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలో ఫారం–7 దరఖాస్తులు దాఖలు చేసిన వ్యవహారంలో దర్యాప్తు పేరుతో 197 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. రాజాం నియోజకవర్గంలోని రేగిడి ఆమదాలవలస మండలంలో 59 మంది, వంగరలో 18 మంది, పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేటలో 52 మంది, భామినిలో 23 మంది, పలాస మండలం మందసలో 26 మంది, పరాసలో 12 మంది, వజ్రపుకొత్తూరులో ఆరుగురు, నరసన్నపేట నియోజకవర్గంలోని సారవకోటలో ఒకరిపై అక్రమ కేసులు నమోదయ్యాయి. 

విశాఖపట్నంలో..
విశాఖపట్నం జిల్లావ్యాప్తంగా 22 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో బుధవారం నాటికి 41 కేసులు నమోదు చేశారు. ఒక్క సబ్బవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే ఏకంగా 15 కేసులు నమోదయ్యాయి. ఏ.కోడూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నాలుగు, అనకాపల్లి టౌన్, మునగపాక పోలీస్‌స్టేషన్లలో రెండేసి చొప్పున కేసులు నమోదు కాగా, మిగిలిన 20 పోలీస్‌ స్టేషన్లలో ఒక్కొక్క చొప్పున కేసులు నమోదయ్యాయి. మెజార్టీ కేసులు వైఎస్సార్‌సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని పెట్టినట్టుగానే తెలుస్తోంది. ఈ కేసులన్నింటిని ఆయా పోలీస్‌స్టేషన్లు జిల్లా సైబర్‌ క్రైం విభాగానికి బదలాయించారు. వైఎస్సార్‌సీపీకి చెందిన మండల, గ్రామ, బూత్‌ కమిటీ నేతలను స్టేషన్లకు పిలిపించుకుని విచారించిన పోలీసులు వైఎస్సార్‌సీపీ నేతలిచ్చిన ఫిర్యాదుల మేరకు పెట్టిన కేసుల్లో మాత్రం టీడీపీ శ్రేణులను విచారణకు పిలిచే సాహసం చేయలేకపోతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement