పోలీస్ మాయ !
సాక్షి, గుంటూరు
దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న రోజులు పోయి... పోలీసులు పోలీసులు రికవరీ సొమ్ములో వాటాలు వేసుకుంటున్న రోజులు ఇవి. దొంగతనం జరిగి సొమ్ము పోయిందని ఫిర్యాదు అందిన మరుక్షణం పారంభమయ్యే పోలీస్ ‘నొక్కుడు' దొంగల నుంచి రికవరీ చేసిన మొత్తంలో సగానికి పైగా జేబులో వేసుకోవడంతో ఆగిపోతోంది.
రూరల్ జిల్లాతోపాటు, గుంటూరు నగరంలో నాలుగు నెలలుగా దొంగతనాలు, దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్‌లు విపరీతంగా పెరిగాయి. సొమ్ము పోగొట్టుకుని బాధితులు గగ్గోలు పెడుతుంటే, రికవరీ చేస్తున్న పోలీసులు వాటాలు వేసుకుని ఖుషీ చేస్తున్నారు దీంతో దొంగతనం లేదా దోపిడీ జరిగిందని ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెనకడుగు వేస్తున్నారు.
బాధితులనే వేధిస్తున్నారు..
ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వెళుతున్న బాధితులను పోలీసులు వేధిస్తున్నారనే ఆరోపణలు కొల్లలుగా ఉన్నాయి.
అంత బంగారం ఇంట్లో ఎందుకు ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ తక్కువ మొత్తం పోయినట్లుగా కేసు నమోదు చేస్తున్నారు. పోయిన సొమ్ము వెతికి ఇవ్వాల్సింది పోలీసులే కావడంతో వారితో వాదనకు దిగలేక వారు ఎంత రాస్తే ఆ మేరకే అంగీకరిస్తూ బాధితులు సంతకం చేస్తున్నారు.
మీ కుటుంబ సభ్యులే తీసివుంటారని అనుమానిస్తూ వారినీ స్టేషన్‌కు పిలిపించి ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు చెబుతున్నారు.
సొమ్ము పోయిందని వస్తే సొంతోళ్లనే కేసులో ఇరికించాలని చూస్తుండటంతో సొమ్ము పోతే పోయిందిలే అంటూ ఫిర్యాదు సైతం ఇవ్వకుండా వదలివేస్తున్నారు.
మేం పిలిచినప్పుడల్లా స్టేషన్‌కు రావాలంటూ హుకుం జారీ చేస్తూ, దొంగలను వెతకడానికి వెళ్తున్నాం దారి ఖర్చులకు ఇవ్వమంటూ కింది స్థాయి సిబ్బంది బాధితుల వద్ద డబ్బు గుంజుతున్నారు.
డబ్బు, బంగారం పోగొట్టుకుని తీవ్ర మనోవేదనలో ఉన్న తమకు పోలీసుల వేధింపులు మరింత బాధ కలిగిస్తున్నాయని వాపోతున్నారు.
ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు దృష్టిసారించి దొంగతానాలు, దోపిడీ కేసుల్లో తమకు న్యాయం చే యాలని బాధితులు కోరుతున్నారు.