కర్నూలు, న్యూస్‌లైన్: ప్రజలు తమ కష్టాలను నేరుగా, నిర్భయంగా పోలీసుస్టేషన్‌కు వచ్చి చెప్పుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగం అర్థమే మారిపోతోంది. పరిష్కారం లభిస్తుందని ఎంతో ఆశతో వచ్చే ప్రజలకు చీవాట్లు తప్పడం లేదు. ‘ఎవరు నువ్వు. ఎందుకొచ్చావు.. పనీపాటా లేదా’ అనే సూటిపోటి మాటలతో తిప్పి పంపుతున్నారు. ఫిర్యాదుదారులను కూర్చోబెట్టి మాట్లాడాలనే ఉన్నతాధికారుల ఆదేశాలు ఒకటి రెండు చోట్ల తప్ప అమలుకు నోచుకోవడం లేదు. పోలీసులంటే ప్రజల్లో
నెలకొన్న భయాన్ని పోగొట్టేందుకు ఈ కార్యక్రమం దోహదపడే అవకాశం ఉన్నా.. ఆ ‘మార్కు’ను చెరిపేసుకునే ప్రయత్నం అధిక శాతం సిబ్బంది చేయలేకపోతున్నారు. మేమింతే.. అన్నట్లుగా వ్యవహరిస్తూ కరకు మాటలతో ప్రజలు పోలీసుస్టేషన్ మెట్లెక్కకుండా చేస్తున్నారు.
జిల్లాలోని 97 పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుల విభాగం నిర్వహిస్తున్నా.. గదులు, సిబ్బంది కొరత కారణంగా సగం పోలీసుస్టేషన్‌లలో నామమాత్రమయ్యాయి. నిరక్షరాస్యులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఈ విభాగాన్ని చాలా చోట్ల హోంగార్డులకు అప్పజెప్పడం గమనార్హం. జిల్లా కేంద్రం మినహా చాలా చోట్ల రిసెప్షన్ కౌంటర్‌లో కంప్లయింట్ సెల్ రిజిష్టర్లను నిర్వహించకపోవడం ఈ విభాగం పనితీరుకు నిదర్శనం. ఫిర్యాదుదారులను కూర్చోబెట్టి.. విషయాన్ని అవగాహన చేసుకొని.. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదిరితే రాజీ అయినట్లుగా ఫిర్యాదు బుక్కులో పొందు పర్చాల్సి ఉంది. ఐపీసీ కేసులైతే రిజిష్టర్ చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు సిబ్బందికి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. బలవంతపు రాజీలు చేసి మామూళ్లు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నూలు నగరంలో శాంతి భద్రతలకు సంబంధించి ఐదు పోలీస్ స్టేషన్లు ఉండగా ఓ ప్రజా ప్రతినిధి కనుసన్నల్లో కొనసాగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి.
నంద్యాలలోని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో దాదాపు ఆరేళ్ల క్రితం ఏర్పాటు చేసిన రిసెప్షన్ కౌంటర్ మూన్నాళ్ల ముచ్చటగా మారింది. టూటౌన్, త్రీటౌన్‌లలోనూ ఇదే పరిస్థితి. ఆదోనిలోని మూడు పోలీసుస్టేషన్లు ఉన్నా రిసెప్షన్ కౌంటర్ల నిర్వహణ తూతూ మంత్రంగా మారింది. ఆళ్లగడ్డ సర్కిల్ పరిధిలోని ఆళ్లగడ్డ, చాగలమర్రి, శిరివెల్ల, రుద్రవరం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసినా రశీదు ఇవ్వడం లేదు. శిరివెల్ల, చాగలమర్రి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయకుండా పంచాయతీలపైనే దృష్టి సారిస్తున్నారనే చర్చ జరుగుతోంది. దేవనకొండ పోలీస్ స్టేషన్‌లో గదుల కొరత కారణంగా రైటర్ గదిలోనే ఫిర్యాదుల విభాగం నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా వివిధ కేసుల నిమిత్తం ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారు తమ బాధలను ప్రత్యేకంగా చెప్పుకునే అవకాశం లేకపోతోంది. హొళగుంద పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఫిర్యాదుల విభాగానికి ప్రత్యేక సిబ్బందిని నియమించలేదు.
ఆత్మకూరు డివిజన్ పరిధిలోని పలు పోలీస్‌స్టేషన్లలో బాధితులకు సత్వర న్యాయం అందడం లేదు. కుటుంబ కలహాలు మొదలుకొని గ్రామాల్లో పెద్ద ఘర్షణల వరకూ కేసుల నమోదు విషయంపై అలసత్వం వహిస్తున్నారు. డోన్ సబ్ డివిజన్, కోడుమూరు పోలీస్ సర్కిల్ పరిధిలో రిసెప్షన్ సెంటర్లు నామమాత్రమయ్యాయి. పత్తికొండ సర్కిల్‌లోని పోలీస్ స్టేషన్లలో జిల్లా కేంద్రం నుంచి ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రమే విచారణ కేంద్రాలు తెరుచుకుంటున్నాయి. వెల్దుర్తి, క్రిష్ణగిరి పోలీస్ స్టేషన్‌లో విచారణ కేంద్రాలు గాడి తప్పాయి. విచారణ కేంద్రాలు తెరుచుకున్న సందర్భాలు కంటే మూతపడిన రోజులే అధికం.
కేసులు.. కాసులు!
Published Sun, Jan 5 2014 3:23 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement