పోలీస్ vs వ్యాపారులు
మామూళ్ల పంచాయితీ
నగరంలో 55 మద్యం షాపులు, 117 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిల్లో విక్రయాలు, పనివేళలు, పార్కింగ్ విషయాల్లో పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తారు. ఇందుకుగాను వ్యాపారులు వారికి నెలవారీ మామూళ్లు ముట్టజెబుతారన్నది బహిరంగ రహస్యమే. ఇప్పుడీ విషయంలో ఇరువర్గాల మధ్య పంచాయితీ నడుస్తోంది.
విజయవాడ సిటీ : పోలీసు అధికారులు, మద్యం వ్యాపారుల మధ్య మామూళ్ల పంచాయితీ నడుస్తోంది. ఇప్పటివరకు ఇస్తున్నట్లే షాపుల నుంచి నేరుగా నెలవారీ మామూళ్ల కోసం పోలీసు అధికారులు పట్టుబడుతుంటే.. సిండికేట్ ద్వారా ఇస్తామంటూ మద్యం వ్యాపారులు తెగేసి చెబుతున్నారు. దీనికి ససేమిరా అంటున్న పోలీసు అధికారులు పార్కింగ్, నిర్దేశిత వేళలు, బహిరంగ మద్య సేవనంపై హడావుడికి తెరతీశారు. ఈ పరిస్థితి కొనసాగితే ఇద్దరికీ నష్టమేనంటూ ఇరువర్గాల పెద్దల అభిప్రాయం. వివాదం ముదరకుండా చూసేందుకు చర్చలు సాగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కొద్ది రోజుల్లో వీరి మధ్య వివాదానికి తెరదించి సమస్యను కొలిక్కి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నగరంలో 55 మద్యం షాపులు, 117 రెస్టారెంట్ అండ్ బార్లు ఉన్నాయి. వీటిని చూసీ చూడనట్లుగా వ్యవహరించినందుకు పోలీసు అధికారులకు నెలవారీ మామూళ్లు ఇవ్వాలి. లేదంటే నిబంధనలను సాకుగా చూపించి పోలీసులు హడావుడి చేస్తారు. రానున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు కూడా పోలీసుల ఆదేశాలను పాటించి మామూళ్లు ముట్టచెబుతుంటారు. కొత్తగా లెసైన్స్‌లు మంజూరైన మద్యం వ్యాపారులతో కుదిరే అవగాహన కోసం బార్ల్ల నిర్వాహకులు కూడా ఎదురుచూస్తున్నారు.
ఇదీ జరిగింది.. నగరంలో 55 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందులో ఆరు షాపులు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి కాగా మిగిలిన 49 ప్రైవేటు వ్యక్తులవి. రాజకీయ నేతలు భాగస్వాములుగా ఉన్న సిండికేట్లకు ఎక్కువ ప్రైవేటు షాపులు దక్కాయి. ఇప్పటివరకు షాపు ఉన్న ప్రాంతాన్ని బట్టి రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు షాపు యజమానులు పోలీసు స్టేషన్‌కి ముట్టచెప్పారు. కొత్త షాపులు దక్కిన వారిలో ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్నందున అంతంత మొత్తాల్లో మామూళ్లు ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. పెరిగిన అద్దెలు, ఉద్యోగుల జీతాలు, నెలవారీ వడ్డీలను దృష్టిలో ఉంచుకుని గతం కంటే తగ్గించి ఇవ్వాలనేది వీరి నిర్ణయం. విడిగా ఇవ్వడం వలన సాధ్యపడదని భావించిన మద్యం వ్యాపారులు సిండికేట్ ద్వారా మంత్లీ మామూలు నిర్ణయించి శ్లాబు (అన్ని చోట్లా ఒకే రేటు) విధానం అమలులోకి తేవాలనేది నిర్ణయంగా ఉంది. దీనికి పోలీసు అధికారులు అంగీకరించడం లేదు.
గత అనుభవాల దృష్ట్యానే.. సిండికేట్ ద్వారా మామూళ్లు తీసుకునేందుకు పోలీసు అధికారులు నిరాకరించడానికి కారణం గత అనుభవాలేనని తెలిసింది. గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఆధిపత్యపోరులో మద్యం వ్యాపారంపై ఏసీబీ అధికారులు విచారణ జరిపారు. ఆ విచారణలో సిండికేట్ల ద్వారా మంత్లీ మామూళ్లు తీసుకునే పోలీసు అధికారుల పాత్ర వెలుగులోకి వచ్చింది. సిండికేట్ చిట్టాల్లో పలువురు అధికారుల పేర్లు ఉండటంలో కేసులు నమోదు చేశారు. ఇంకా కేసు విచారణ సాగుతోంది. సిండికేట్ల ద్వారా తీసుకోవడం వల్లే ఇది జరిగిందనేది ఇప్పుడు అధికారుల అభిప్రాయం. ఇదే నేరుగా తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఎదురైనా పేర్లు వెలుగులోకి రావనేది వారి భావన.