భద్రాద్రిలో ‘మద్యం’ రగడ
భద్రాచలం: భద్రాచలం పట్టణంలో మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కోసం శనివారం ఏర్పాటు చేసిన గ్రామ సభ రసాభాసగా మారింది. పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో మద్యం దుకాణాలు వద్దని కొంతమది డిమాండ్ చేయగా, ఏర్పాటు చేయాల్సిందేనని మరి కొందరు పట్టుబట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు పోలీసు పహారా నడుమ గ్రామసభ నిర్వహించారు. భద్రాచలం పట్టణంలో తొమ్మిది మద్యం దుకాణాల ఏర్పాటుకు సం బంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి లాటరీ పద్ధతి లో గిరిజనులకు కేటాయించారు. కానీ ఈ నెల 21వ తేదీన నిర్వహించిన గ్రామసభలో మద్యం దుకాణాలు వద్దంటూ తీర్మానించారు. ఈ క్రమంలో పీఓ ఆదేశాల మేరకు మరోసారి గ్రామసభ నిర్వహిం చారు. మొదటిసారి నిర్వహించిన గ్రామసభకు కేవ లం 75 మంది హాజరుకాగా, శనివారం నిర్వహిం చిన గ్రామసభకు ఐదువందల మందికిపైగానే హాజరయ్యారు.
వ్యతిరేకించిన పలు రాజకీయ పార్టీలు..
పట్టణంలో మద్యం దుకాణాల ఏర్పాటును సీపీఎంతో పాటు, వైఎస్సార్‌సీపీ, టీడీపీలోని ఓ వర్గం నాయకులు, వివిధ గిరిజన సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మద్యం దుకాణాలు వద్దంటూ సభావేదిక ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సభ వెనుక కూర్చున్న వారంతా దుకాణాలు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టడంతో గ్రామ సభ రసాభాసగా మారింది.
చివరకు ఎంపీడీఓ రమాదేవి కల్పించుకుని సభకు వచ్చిన వారంతా ఒక్కొక్కరుగా వచ్చి తమ పేరు, చిరునామాతో పాటు అభిప్రాయాన్ని చెప్పాలని సూచించారు. దీంతో గ్రామసభకు వచ్చిన వారంతా లైన్‌లో నిలబడి తమ అభిప్రాయాలను వెల్లడించారు. మొత్తం 325 మంది గ్రామసభలో అభిప్రాయాలను వెల్లడించగా, ఇందులో 231 మంది మద్యం దుకాణాల ఏర్పాటుకు అనుకూలంగా, 94 మంది వ్యతిరేకంగా చెప్పారు. ఈ నివేదికను ఐటీడీఏ పీఓకు అందజేస్తామని ఎంపీడీఓ రమాదేవి ప్రకటించారు.
హైకోర్టు తీర్పును ధిక్కరిస్తే ఎలా..?
భద్రాచలంలో మద్యం దుకాణాల ఏర్పాటుపై హైకోర్టు స్టే విధించినా, అధికారులు అత్యుత్సాహం చూపుతూ గ్రామసభ ఏర్పాటు చేయడంపై సీపీఎం పట్టణ కార్యదర్శి ఎంబీ నర్సారెడ్డి, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ కమిటీ సభ్యులు కడియం రామాచారి, పంచాయతీ వార్డు సభ్యులు బండారు శరత్, కొండరెడ్ల సంఘం నాయకులు ముర్ల రమేష్, ఆదివాసీ నాయకులు మడవి నెహ్రూ, కొర్సా చినబాబు దొర, కుంజా రమాదేవి, టీడీపీ పట్టణ అధ్యక్షులు కుంచాల రాజారామ్‌తో పాటు పలువురు తీవ్రంగా వ్యతిరేకించారు.
దీనిపై సర్పంచ్ శ్వేత కల్పించుకొని తప్పు మాది కాదని, ఐటీడీఏ పీఓ, కలెక్టర్‌దేనన్నారు. గ్రామసభను మళ్లీ నిర్వహించమని వారు ఆదేశించటంతోనే ఇలా చేస్తున్నామని, ఏదైనా ఉంటే వారి తోనే చెప్పుకోవాలని సమాధానం ఇచ్చారు. హైకోర్టు స్టే విధించినట్లు తమకు సమాచారం లేదని ఎంపీడీఓ రమాదేవి, ఎక్సైజ్ సీఐ రాంకిషన్ వెల్లడించారు. దీనిపై ఆయా పార్టీల నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో గ్రామసభలో కోరం సరిపోలేదని, సభను రద్దు చేసినట్లు ఎంపీడీఓ రమాదేవి ప్రకటించారు. కాగా సిండికేట్ వ్యాపారులు తమ దుకాణాలు బంద్ చేసుకుని గ్రామ సభకు ప్రజలను తరలించడం గమనార్హం.