
పోలీసుల ఓవర్ యాక్షన్
నెల్లూరు(క్రైమ్): జెడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసుల వ్యవహారశైలిపై విమర్శలు గుప్పుమన్నాయి. అధికారపార్టీ నేతల సంకేతాల మేరకు విధులు నిర్వర్తించారన్న ఆరోపణలు వినిపించాయి. జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఆదివారం పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. జిల్లాతో పాటు గుంటూరు జిల్లా పోలీసులను బందోబస్తుకు రప్పించారు. ఈనెల 5న చోటుచేసుకున్న సంఘటనలు పునరావృతం కాకుండా సుమారు 1000 మంది బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. సాయుధ బలగాలను భారీగా మోహరించారు. జెడ్పీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నగరంలోకి ఇతర ప్రాంతాలకు చెందిన రాజకీయనాయకులు, కార్యకర్తలు రాకుండా బుజబుజనెల్లూరు, కనుపర్తిపాడు, చింతారెడ్డిపాళెం, పాతచెక్‌పోస్టు, పొదలకూరరోడ్డులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జెడ్పీ కార్యాలయానికి వెళ్లే అన్ని మార్గాల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. జెడ్పీ సమావేశ మందిరంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. చుట్టూ మఫ్టీలో పోలీసులను ఉంచారు.
ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్ ఉదయం నుంచి జెడ్పీ కార్యాలయంలోనే ఉండి బందోబస్తును పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మీడియా, ఎన్నికల విధులు నిర్వర్తించే వ్యక్తులు మినహా ఇతరులెవ్వరికీ లోనికి అనుమతి లేదని, సెల్‌ఫోన్లు నిషేధమని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలను సెల్‌ఫోన్లు లోనికి తీసుకెళ్లనివ్వలేదు. అధికారపార్టీ నేతలు సమావేశ మందిరంలో యథేచ్ఛగా పోన్లల్లో మాట్లాడుకున్నారు.
టీడీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి వేనాటి రామచంద్రారెడ్డి ఏకంగా మఫ్టీలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా కానిస్టేబుళ్లపై నోరుపారేసుకున్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన వ్యక్తులను జెడ్పీ కార్యాలయం బయట కూడా ఉండనివ్వలేదు. అధికారపార్టీకి చెందిన నేతలు బీద రవిచంద్ర, కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, తాళ్లపాక రమేష్‌రెడ్డి జెడ్పీ కార్యాలయం బయట సమాలోచనలు జరుపుతున్నా పట్టించుకోలేదు. వేమిరెడ్డి పట్టాభిరెడ్డి జెడ్పీ కార్యాలయం లోపల, బయట హల్‌చల్ చేస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. పోలీసు అధికారుల ఏకపక్ష విధానాలపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియాపై ఆగ్రహం....
మీడియా ప్రతినిధులకు పాస్‌లు, అక్రిడిటేషన్ ఉంటేనే లోనికి అనుమతిస్తామని ఓఎస్‌డీ శిల్పవల్లి చెప్పడంతో పాస్‌లు ఎందుకిచ్చారంటూ ఆమెను నిలదీశారు. కొందరు మీడియా సిబ్బందికి పాస్‌లు లేకపోవడంతో వారిని లోనికి అనుమతించలేదు. దీంతో కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ఈ విషయంలో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ జి. శ్రీనివాసరావు జోక్యం చేసుకుని మీడియా ప్రతినిధులను లోనికి పంపడంతో వివాదం సద్దుమణిగింది.
ఐజీ పర్యవేక్షణ..
గుంటూర్ రేంజ్ ఐజీ పీవీ సునీల్‌కుమార్ ఆదివారం నెల్లూరుకు చేరుకున్నారు. జెడ్పీ చైర్మన్ ఎన్నిక సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఎన్నిక వాయిదా అనంతరం జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కల్గకుండా చూడాలని ఎస్పీ, ఏఎస్పీ, డీఎస్పీలకు సూచించారు.