మస్తుగా బందోబస్తు
* పుష్కరాలకు 20 వేల మందితో పోలీసు భద్రత
* ప్రభుత్వానికి అధికారుల నివేదిక!
* ఎ, బి, సి కేటగిరీలుగా స్నానఘట్టాల విభజన
రాజమండ్రి క్రైం : వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సందర్భంగా గట్టి బందోబస్తు నిర్వహించేందుకు వివిధ కేడర్లలో సుమారు 20 వేల మంది పోలీసులు అవసరమవుతారని ఆ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేశారు. ఈ మేరకు వారు ప్రభుత్వానికి ఒక నివేదిక పంపినట్టు తెలుస్తోంది. గోదావరి తీరం వెంబడి ధవళేశ్వరం నుంచి సీతానగరం వరకూ ఉన్న 74 స్నానఘట్టాలను ఇటీవల పోలీసు ఉన్నతాధికారులు సర్వే చేశారు. ఆయా ఘాట్లను ఎ, బి, సి విభాగాలుగా విభజించారు.
పుష్కరాలకు ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ర్ట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వీవీఐపీలు, వీఐపీలు హాజరయ్యే గౌతమ ఘాట్, పుష్కరాల రేవు, కోటిలింగాల రేవులను ఎ కేటగిరీలో ఉంచారు. సాధారణ భక్తులు స్నానాలు ఆచరించేందుకు మెట్లతో కూడిన ఘాట్లు ఉన్న వాటిని బి కేటగిరీలోకి, కేవలం కాలిబాట ఉండి స్నానం ఆచరించేలా ఉన్న ఘాట్లను సి కేటగిరీలోకి చేర్చారు.
షిఫ్ట్‌కు 300 మంది
ఎ కేటగిరీ స్నానఘట్టాలకు భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రతి షిఫ్ట్‌కు ప్రతి ఘాట్‌లో 300 మంది పోలీసులు విధులు నిర్వర్తించేలా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. బి కేటగిరీ ఘాట్లలో ప్రతి ఘాట్‌కు షిఫ్ట్‌కు 50 మంది, సి కేటగిరీలో 10 మందిని నియమించాలని యోచిస్తున్నారు. గత పుష్కరాలకు ఎనిమిది వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు.
సీసీ కెమేరాలతో నిఘా
మరోపక్క పుష్కరాల సందర్భంగా రాజమండ్రి నగరమంతటా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, భద్రతను పర్యవేక్షించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేకంగా సెక్యూరిటీ సెల్ కూడా ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. 2003 పుష్కరాల సందర్భంగా పుష్కరాల రేవు ఎదురుగా ఉన్న బహుళ అంతస్తుల భవనంలో ఇటువంటి సెంటర్ ఏర్పాటు చేశారు. వచ్చే పుష్కరాల సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాలతో పాటు.. ఆయా కూడళ్లలో ఇప్పటికే ఉన్న సీసీ కెమేరాలను కూడా వినియోగించుకోనున్నారు.