- విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పీవీపీ
- అన్ని నియోజకవర్గాల్లోనూ నామినేషన్లకు ఏర్పాట్లు
- వెన్నుపోటు పొడిచారంటూ బాబుపై ఆగ్రహం
సాక్షి, విజయవాడ : వెన్నుపోట్లలో సిద్ధహ స్తుడైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీపై వెన్నుపోటు అస్త్రాన్ని ప్రయోగించారు. చివరి దశ వరకు పొత్తులు నడిపి నామినేషన్లు ముగియడానికి ఒక్కరోజు ముందు బీజేపీతో పొత్తులు లేవని ప్రకటించారు.
చంద్రబాబు వెన్నుపోటు ఆలోచనలకు బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు కూడా సహక రించడం వల్లే సీమాంధ్రలో పొత్తులు చెడిపోయాయనే అభిప్రాయం స్థానిక బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది. పొత్తులే చెడిపోతే రాబోయే ఎన్నికల్లో టీడీపీపై ఎదురుదాడికి దిగాలని జిల్లా బీజేపీ నేతలు నిర్ణయించుకున్నారు. బీజేపీ అభ్యర్థుల్ని ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని వారు భావిస్తున్నారు. చంద్రబాబు వెన్నుపోటును ప్రజల్లోకి తీసుకువె ళ్లి ఆయనకు తగిన బుద్ధిచెప్పాలని యోచిస్తున్నారు.
ముస్లిం ఓట్లు పోతాయని భయం...
రాష్ట్ర విభజనలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీకి పాపం ఉంది. దీంతో సీమాంధ్ర ఓటర్లు బీజేపీపైనా ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు టీడీపీ, బీజేపీ పొత్తులను ముస్లింలు ఏమాత్రం అంగీకరించడం లేదు. ఇటీవల సీమాంధ్రలో చంద్రబాబు సర్వే చేయించుకోగా ముస్లిం ఓట్లు టీడీపీకి దూరమయ్యాయని తెలియడంతో సీమాంధ్రలో పొత్తులకు స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారని, అవకాశం చూసి బీజేపీకి దెబ్బకొట్టారని సమాచారం.
అన్ని సీట్లలోనూ బీజేపీ అభ్యర్థులు
బీజేపీ-టీడీపీ మధ్య పొత్తులు ఉండకపోవచ్చని తేలడంతో సీమాంధ్ర బీజేపీ నేతలు హడావుడిగా అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశాల్లో 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లు పరిశీలించారు. పొత్తులు కుదరడంతో ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లే జాతీయ పార్టీకి పంపారు. అవసరమైతే శుక్రవారం అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసి పోటీకి దింపాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ఎంపీ అభ్యర్థిగా పీవీపీ?...
టీడీపీ టిక్కెట్ కోసం చివర వరకు పోటీపడ్డ పారిశ్రామిక వేత్త పొట్లూరి వరప్రసాద్ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే బీజేపీ నేతలతో మంతనాలు జరుపుతున్నారని, 19న ఆయన నామినేషన్ వేసే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని)ని ఓడించడమే లక్ష్యంగా ఆయన ఎన్నికల బరిలోకి దిగుతారని, ఆయన కుటుంబసభ్యుడు పొట్లూరి రవి ప్రకటించారు.
బీజేపీకే పవన్ కల్యాణ్ ప్రచారం...
టీడీపీ-బీజేపీ పొత్తులు చెడిపోతే సినీనటుడు పవన్‌కల్యాణ్ టీడీపీకి ప్రచారం చేసే అవకాశం లేదు. పవన్‌కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడు, పారిశ్రామికవేత్త పీవీపీపై విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్ (నాని) చేసిన వ్యాఖ్యాలపై ఆయన ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. దీంతో సీమాంధ్రలో పవన్‌కల్యాణ్ టీడీపీకి మద్దతు ప్రకటించ రని, బీజేపీకి మాత్రమే ప్రచారం చేస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. సీమాంధ్రలో ఎక్కువ రోజులు ప్రచారం చేసి టీడీపీని చావుదెబ్బ కొట్టాలనే వ్యూహాన్ని బీజేపీ నేతలు తయారు చేస్తున్నారు.