కలవని మనసులు
- వెంకయ్య రోడ్‌షోకు టీడీపీ నేతల బ్రేకులు
- కనిపించని తెలుగు తమ్ముళ్లు
- టీడీపీ జెండాలను భుజానకెత్తుకున్న బీజేపీ కార్యకర్తలు
సాక్షి, విజయవాడ : బీజేపీ, టీడీపీ మధ్య పొత్తులైతే కుదిరాయి కానీ.. నేతల మనసులు మాత్రం కలవలేదు. ఈ సంగతి సోమవారం పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు నిర్వహించిన రోడ్‌షోలో బట్టబయలైంది. పశ్చిమ సీటుపై చివరి నిమిషం వరకు టీడీపీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు అనూహ్యంగా ఈ సీటును బీజేపీకి కేటాయించడంతో తెలుగు తమ్ముళ్లు కంగుతిన్నారు. వారు ఇప్పటికీ తేరుకోలేదు. ఆ ప్రభావం వెంకయ్య రోడ్‌షోపై స్పష్టంగా కనిపించింది. రోడ్‌షోలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నేతలు, కార్యకర్తలే తప్ప టీడీపీ శ్రేణులు పెద్దగా రాలేదు.
డివిజన్ అధ్యక్షులు దూరం..
ర్యాలీకి టీడీపీ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు, అనుబంధ సంఘాల నేతలు, ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ర్యాలీలో అసలు కనపడలేదు. పశ్చిమ టీడీపీలో కీలక పాత్ర పోషించే ద్వితీయ శ్రేణి నాయకులు డుమ్మా కొట్టారు. ఇదే నియోజకవర్గం నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగిన ఓ నేత రోడ్‌షో జరుగుతున్న సమయంలోనే తన అనుచరగణంతో రహస్య సమావేశం ఏర్పాటుచేసుకుని పోటీలో ఉంటే తనకుగల విజయావకాశాలపై చర్చించడం విశేషం.
టీడీపీ జెండాలు మోసిన బీజేపీ కార్యకర్తలు..
టీడీపీ కార్యకర్తల సంఖ్య తక్కువగా ఉండడంతో ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ వెంటనే టీడీపీ జెండాలు తెప్పించి బీజేపీ కార్యకర్తల చేతికిచ్చారు. వెంకయ్య ముందు పరువు పోతుందని భావించిన బీజేపీ కార్యకర్తలు అయిష్టంగానే ఆ జెండాలను భుజాన వేసుకుని ముందుకు సాగారు. పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ కంటే టీడీపీకే ఎక్కువ కేడర్ ఉంది. రోడ్‌షోలో మాత్రం పచ్చజెండాల కంటే కాషాయం జెండాలే ఎక్కువ కనిపించడం గమనార్హం.
మొక్కుబడిగా వెంకన్న, నాగుల్‌మీరా భాగస్వామ్యం..
రోడ్‌షోలో టీడీపీ అర్బన్ అధ్యక్షుడు బుద్దా వెంకన్న, నియోజకవర్గ ఇన్‌చార్జి నాగుల్‌మీరా ఎడమోహం, పెడమోహంగా కనపడ్డారు. వీరు ఇటీవలి కాలంలో కత్తులు దూసుకుంటున్నారు. ఎవరికి వారు వర్గ సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఎదుటివారిని విమర్శించడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. టీడీపీలో ఉండే సీనియర్ ముస్లిం నేతలు కూడా రోడ్‌షోకు దూరంగా ఉన్నారు.
బీజేపీ కార్యాలయంలో టీడీపీ నేతలు..
బీజేపీకి టీడీపీ ఓట్లు బదిలీ కాకపోయినప్పటికీ, టీడీ పీకి మాత్రం బీజేపీ ఓట్లు బదిలీఅయ్యేలా టీడీపీ నేతలు కష్టపడుతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెంకయ్యనాయుడు వచ్చారని తెలియగానే టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్, సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావు అక్కడికి వచ్చారు. బీజేపీ నేతలను ఆప్యాయంగా పలకరించి తమకు సహకరించాలంటూ కోరడం చర్చనీయాంశంగా మారింది.