=ఓ పార్టీ నేత చేతుల్లోనే ట్రావెల్స్
=సమాంతర రవాణాతో ఆర్టీసీకి తూట్లు
=నంబర్ ఒకటి... బస్సులు రెండు!
సాక్షి, విజయవాడ : విజయవాడంటే రవాణారంగ కేంద్రమే కాదు, ప్రైవేటు బస్సుల హబ్‌గానూ పేరొందింది. రాష్ట్ర, అంతర్రాష్ట్ర సర్వీసులు నడుపుతూ ఆర్టీసీని హైజాక్ చేసి కోట్లకు పడగలెత్తేశారు. ఇక్కడ ట్రావెల్స్ మాఫియా రాజ్యమేలుతోంది. తమకు అడ్డుపడిన రవాణా అధికారులను బదిలీ చేయించడానికి యథేచ్ఛగా తమ రాజకీయ పలుకుబడి ఉపయోగిస్తారు.
ఈ ప్రైవేటు బస్సుల్లో అధికభాగం ఓ రాజకీయ పార్టీ నేత చేతుల్లోనే ఉన్నాయి. ఫలితంగా ఆయన చక్రబంధంలో ఆర్టీసీ కుదేలైంది. నిబంధనలను తోసిరాజని బస్సులను తమ ఇష్టానుసారంగా నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఘటనలు అనేకం జరిగాయి. జిల్లాలో 498 ప్రైవేటు బస్సులు రిజిస్ట్రేషన్‌కాగా, ఇతర జిల్లాలో ఇక్కడి బస్సులు మరో 200కు పైగా ఉంటాయని అంచనా. వీటిలో వంద వోల్వా సర్వీసులున్నాయి.
ఆర్టీసీని శాసించే విధంగా ఒక్క విజయవాడలోనే దాదాపు 30 ట్రావెల్స్‌కు చెందిన 200కు పైగా ప్రైవేటు బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఇక్కడ నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు. వైజాగ్ తదితర పట్టణాలకు వోల్వా సర్వీసులను నడుపుతున్నారు. నిత్యం వివిధ పట్టణాలకు విజయవాడ నుంచి వేలాదిమంది వెళుతుంటారు. పండగల సీజన్‌లో అయితే ఈ సంఖ్య రెట్టింపు ఉంటుంది. ఆదాయమే పరమావధిగా అధిక ట్రిప్పులు నడపాలని డ్రైవర్లపై ఒత్తిడి చేస్తుంటారు. పండగల సీజన్‌లోనైతే ఆదనపు ట్రిప్పులు నడుపుతుంటారు.ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు.
నంబర్ ఒకటి... బస్సులు రెండు...
ప్రైవేటు ట్రావెల్స్‌లో ఎక్కువ మంది నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను పట్టించుకోరు. బస్సుల నంబరు ప్లేట్లను మార్చేయడం, ఒకే నంబరు ప్లేటును రెండు బస్సులకు ఉపయోగించడం వంటి అడ్డదారులు తొక్కుతున్నారు. ఇలా దొంగ బస్సులను రోడ్డుపై తిప్పుతూ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. ఒక బస్సుకు ఏడాదికి రూ. లక్షన్నర వరకు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. నంబరు ప్లేట్లను మార్చడం ద్వారా ఆ మొత్తాన్ని మినహాయించుకుంటున్నారు. అలాగే కొన్ని బస్సులను మరమ్మతుల్లో ఉన్నాయని రవాణాశాఖ అధికారులకు చూపించి... ఆచరణలో మాత్రం వాటిని రోడ్లపై తిప్పుతుంటారు.
వోల్వో టెక్నాలజీ తెలియని డ్రైవర్లు...
ప్రైవేటు వోల్వో బస్సులను పూర్తిస్థాయి శిక్షణ లేని డ్రైవర్లే ఎక్కువగా నడుపుతున్నారు. దీని కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. పైగా డ్రైవర్లకు విశ్రాంతి ఇవ్వడంలేదు. అంతే కాకుండా వేగ నియంత్రణ (స్పీడ్ గవర్నెన్స్) పరికరాలు పెట్టకపోవడంతో అతివేగంగా డ్రైవింగ్ చేస్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు మూడుగంటల్లో తీసుకెళ్తున్నారంటే ఏస్థాయి వేగంతో వోల్వోలు వెళ్తున్నాయో అర్థమవుతోంది.
సౌకర్యాల మాటున ప్రమాదాలు...
ఆర్టీసీ తమ నిబంధనలను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడంలేదు. ఈ బలహీనతను ప్రైవేటు ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రైవేటు బస్సులు గమ్యస్థానాలకు త్వరగా తీసుకెళ్తాయి. ఎక్కడంటే అక్కడ ఆపుతారు. నగరాల్లోని ముఖ్యమైన మారుమూల కేంద్రాలకు తీసుకువెళ్తాయి. ఇది ప్రయాణికులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలను ఎదిరించే ధైర్యం అధికారులకు లేకుండా పోయింది. అందుకు కారణం వారంతా అధికార, ప్రతిపక్ష పార్టీల సరసన ఉండటమేనని తెలుస్తుంది.