
దివ్యాంగుడిగా జన్మించడమే తప్పా..?
జి.సిగడాం: రాజకీయ వివక్ష.. జన్మభూమి కమిటీల పెత్తనం పుణ్యమాని అర్హులైన లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. ముఖ్యంగా పింఛన్ల పంపిణీలో అడుగడుగునా వివక్ష కనిపిస్తోంది. జన్మభూమి కమిటీల ప్రమేయంతో ఎంతోమంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు పింఛన్లకు దూరమవుతున్నారు. అటువంటి కోవకే చెందుతాడు ఈ దివ్యాంగుడు. దివంగత వైఎస్ హయాంలో ఇతనికి ప్రతినెలా కచ్చితంగా పింఛన్ అందేది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ నిలిచిపోయింది. నాటి నుంచి నేటి వరకూ అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోతోంది.
మండలంలోని దేవరవలస గ్రామానికి చెందిన బత్తుల అప్పారావుకు పుట్టుక నుంచే రెండు కాళ్లూ రావు. అయినప్పటికీ చదువుపై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రస్తుతం పొందూరు డిగ్రీ కళాశాలో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి జిల్లా వైద్యాధికారులు 45 శాతం వికలాంగత్వం ఉందంటూ ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. ఈ పత్రం ఆధారంగా వైఎస్ హయాంలో పింఛన్ అందేది. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక పింఛన్ నిలుపుదల చేశారు. తన పింఛన్ పునరుద్ధరించాలని ఎన్నోసార్లు వినతులిచ్చినా ఫలితం ఉండటంలేదు.
అవన్నీ చెత్తబుట్టలోనే వేస్తున్నారని అప్పారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గత ఏడాది, ఈ ఏడాది జరిగిన జన్మభూమి గ్రామసభల్లో సైతం వినతులు అందించాడు. ఇతని మొరను ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. మండల పరిషత్ అధికారులను ఎప్పుడు అడిగినా ఇదిగో, అదిగో అంటున్నారని.. తనకు న్యాయం మాత్రం జరగడం లేదని అప్పారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను దివ్యాంగుడిలా జన్మించడమే తప్పులా ఉందని వాపోతున్నాడు.