తెలుగుతమ్ముళ్లకు చెక్ | political leaders check | Sakshi
Sakshi News home page

తెలుగుతమ్ముళ్లకు చెక్

Published Thu, Feb 6 2014 2:14 AM | Last Updated on Fri, Aug 10 2018 5:38 PM

political leaders check

 సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయాల్లో  శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే నానుడిని జిల్లా నాయకులు రుజువు చేస్తున్నారు. మారుతున్న సమీకరణల నేపధ్యంలో పార్టీలు మారేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ అధినేత తీరు కన్పిస్తోంది. ఇంతకాలం పార్టీ కోసం విశేషంగా కృషి చేసిన కేడర్‌ను సైతం విస్మరించేందుకు సమాయత్తమవుతున్నారు.  బలవంతుడు అన్పిస్తే ఉన్న వాళ్లను పక్కకు తప్పించే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యేతోబాటు ఇతర నేతలను పార్టీలోకి తెచ్చుకునే క్రమంలో తెలుగు తమ్ముళ్ల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంలోకి నెట్టనున్నారు.
 
 రాబోవు ఎన్నికలను  చావో, రేవో అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా  తీసుకుంది. అందుకోసం  ఎలాంటి హామీలనైనా  గుప్పించేందుకు వెనుకాడటం లేదు.
 
 పెపైచ్చు బద్ధ విరోధులను కూడా పార్టీలోకి ఆహ్వానించేందుకు శ్రీకారం చుట్టారు.  రాష్ట్ర విభజన అంశం రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొస్తోంది. వైరి వర్గాలను ఏకం చేస్తోంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనే దిశగా టీడీపీ పావులు కదుపుతోంది. అందుకోసం అవసరమైతే కేడర్‌ను విస్మరించేందుకు వెనుకంజ వేయడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాలోని  మైదుకూరు, ప్రొద్దుటూరు, రాయచోటి, రాజంపేట, కడప నియోజకవర్గాలల్లో పెనుమార్పులు తలెత్తనున్నట్లు  పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
 
 ప్రశ్నార్థకంగా  ‘పుట్టా’ భవితవ్యం
 మారుతున్న సమీకరణల నేపధ్యంలో మైదుకూరు టీడీపీ ఇన్‌ఛార్జి పుట్టా సుధాకర్ యాదవ్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.  టీడీపీ టికెట్ కోసం సీనియర్ ఎమ్మెల్యే ఒకరు  దృష్టి సారించి, ఆమేరకు సఫలీకృతుడైనట్లు తెలుస్తోంది. ఈవిషయం హైదరాబాద్ నుంచి మైదుకూరు దాకా   పాకింది.  పార్టీ కోసం  డబ్బును మంచినీళ్లు లెక్కన ఖర్చు చేస్తున్న పుట్టాకు జరుగుతున్న పరిణామాలు మింగుడుపడటం లేదు.  అనూహ్యంగా తెరపైకి అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే పేరు వచ్చినట్లు టీడీపీ నేతలే పేర్కొంటున్నారు.
 
 ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం స్థాయిలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈమేరకు సుధాకర్‌యాదవ్ వియ్యంకుడు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుని సైతం ఒప్పించే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. అభ్యర్థికంటే గెలుపే ముఖ్యమన్న రీతిలో అధినేత వ్యవహరిస్తున్నారని, అందుకోసం ఎవరి పరిధిలో వారు ఎంతోకొంత త్యాగాలు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ కోసం కృషి చేస్తున్న  వారిని కాదని, మరెవరికో టికెట్ కేటాయిస్తామని  పేర్కోనడం సబబు కాదని తెలుగుతమ్ముళ్లు వాపోతున్నారు.
 
 ప్రొద్దుటూరు, రాయచోటిలపై ఓ ఎంపీ ప్రత్యేక దృష్టి...
 అధినేత మనసెరిగిన ఓనేత ప్రొద్దుటూరు, రాయచోటి నిమోజవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆమేరకు తనదైన శైలిలో పావులు కదుపుతూ సరికొత్త సమీకరణలకు సిద్ధమవుతున్నట్లు  సమాచారం. ప్రొద్దుటూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా లింగారెడ్డి ఉన్నప్పటికీ, అభ్యర్థి మార్పు లాభదాయకమని అధినేత చెవులు కొరుకుతున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం అటు జమ్మలమడుగు, ఇటు కమలాపురం నియోజకవర్గాలకు కూడా లాభిస్తుందని ఓ మాజీ ఎమ్మెల్యే బంధుత్వ వివరాలను విశదపర్చినట్లు సమాచారం. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా తమ సూచనను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది.
 
 అలాగే రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు ఎత్తుగడలకు చెక్ పెడుతూ మరో కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. జిల్లా యంత్రాంగం ఆనేతపై పీడీ యాక్టు పెట్టాలని భావిస్తే విశ్వప్రయత్నం చేసి అడ్డుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో తన పాత్ర నామమాత్రం కాకుండా ఉండేందుకు పలు ఎత్తుగడలు వేస్తున్నట్లు సమాచారం. అందుకోసం కేడర్‌ను బలి చేసేందుకు కూడా వెనుకంజ వేయడం లేదని తెలుగుతమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 కడప నేతల మధ్య కుదరని ఏకాభిప్రాయం
 జిల్లా కేంద్రమైన కడప నియోజకవర్గ నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో ఇప్పటికీ గందరగోళంగానే  ఉన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆపార్టీ పక్క నియోజకవర్గ నేతతోబాటు, ఇతర నేతలు కూడా కాచుకుని కూర్చున్నట్లు సమాచారం.
 
 జిల్లా కేంద్రంలో పార్టీ పరిస్థితి ఆశించిన మేరకు లేకపోవడం కూడా క డప నేతల నిరాసక్తతకు కారణంగా కనబడుతోంది.  ఇక్కడి వారంతా చేతగాని వారుగా చిత్రీక రించి ఆటికెట్‌ను ఎగరేసుకెళ్లాలనే  దిశగా ఆపార్టీ నేత చురుగ్గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అధినేత వైఖరి కారణంగా  తమ భవిష్యత్ ఎలా ఉంటుందోనని తెలుగుతమ్ముళ్లు  ఆందోళన చెందుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement