రైతుల ప్రయోజనాలపై ‘పోలవరం మట్టి’ | political leaders no working for formers | Sakshi
Sakshi News home page

రైతుల ప్రయోజనాలపై ‘పోలవరం మట్టి’

Published Sat, Nov 7 2015 2:56 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

political leaders no working for formers

తెలుగు తమ్ముళ్ల రియల్ ఎస్టేట్ దందా
 నిబంధనలకు విరుద్ధంగా వ్యవసాయభూమి మెరక
 ఆ క్రమంలో నీరు పోయే మార్గాల మూసివేత
 రైతుల ఆందోళనను పట్టించుకోని అధికారులు

 
 జగ్గంపేట : అధికారంతో, ధనబలంతో తిమ్మిని బమ్మిని చేయవచ్చని తెలుగుతమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. రాష్ట్ర విభజన తరువాత భూముల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని గ్రామాలు, ప్రధాన రహదారులను ఆనుకుని ఉన్న పచ్చటి పొలాలను రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలంగా మార్చివేస్తున్నారు.
 
 జగ్గంపేట మండలం సీతానగరం వద్ద పెద్దాపురం రోడ్డును ఆనుకుని ఉన్న సుమారు 11 ఎకరాల వ్యవసాయ భూమిని పోలవరం మట్టితో ఎత్తు చేస్తున్నారు. ఈ పొలం మీదుగానే పై ప్రాంతంలోని చెరువులు, పుష్కర కాల్వ, వర్షపు నీరు కిందకు పోవల్సి ఉంది. నీరు పోయే మార్గాన్ని కూడా మూసివేసి మెరక పనులు కానిస్తున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో రెండో స్థానంలో ఉన్న నేత అండదండలతో పొలం గల రైతు, మెట్టకు చెందిన ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ బంధువులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. పోలవరం కాల్వ నుంచి మట్టిని తోలుకునేందుకు సబ్బినీడి వెంకటరావు పేరిట తొలుత ఐదు వేల క్యూబిక్ మీటర్ల మట్టికి పోలవరం ఇరిగేషన్, మైన్స్ అధికారుల అనుమతి పొందారు. ఒక్కో ట్రిప్పుకు 12 క్యూబిక్ మీటర్ల మట్టిని మాత్రమే తరలించవలసి ఉండగా భారీగా తరలిస్తున్నారు.  క్యూబిక్ మీటరుకు రూ.70 చొప్పున చెల్లించినప్పటికీ అనధికారికంగా ఎక్కువ క్యూబిక్ మీటర్ల మట్టిని రియల్ ఎస్టేట్ పనుల కోసం తరలించడం వెనక మతలబు ఇరిగేషన్, మైన్స్ అధికారులు తేల్చవలసి ఉంది. జగ్గంపేటలో భారీ వాహనాలతో మట్టి తరలిస్తున్నా రవాణా, పోలీసు శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యవసాయ భూమిని భారీగా తరలించిన మట్టితో వ్యవసాయేతరంగా మార్పు చేస్తున్నా, తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని రైతులు గగ్గోలు పెడుతున్నా రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తూ ఊరుకోవడం విమర్శలకు తావిస్తోంది.
 
  వర్షాలు పడితే చెరువులు, పుష్కర కాలువ, పొలాల నుంచి వచ్చే మిగులు నీరు పోయే మార్గాన్ని మూసి వేసి తమ ప్రయోజనాలను దెబ్బ తీశారని బాధిత రైతు సారిపల్లి రాజబాబు గురువారం పనులు జరుగుతున్న చోటికి వచ్చి పొలం గల రైతు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.  ఒక్క రాజబాబు మాత్రమే కాదు.. అటువంటి రైతులు చాలా మంది ఆందోళన చెందుతున్నప్పటికీ అధికారుల్లో చలనం కనిపించడం లేదు. వ్యవసాయ భూమిలో అడ్డగోలుగా సాగుతున్న దందాపై జిల్లా రెవెన్యూ అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement