గద్వాల, న్యూస్‌లైన్: నడిగడ్డలో ఇక విత్తనపత్తి సాగు తగ్గనుంది. వచ్చే ఖరీఫ్ సీజన్‌లో సాగును పూర్తిగా తగ్గించేందుకు ఆయా విత్తన కంపెనీలు నిర్ణయించాయి. దీనికి పేరుకుపోయిన విత్తననిల్వలే కారణమని సీడ్ ఆర్గనైజర్లు చెబుతున్నారు. ఇదే కొనసాగితే పత్తి విత్తన రైతుల ఆదాయానికి భారీగా గండిపడుతుంది. ఏటా సిరులు పండించే విత్తనపత్తి వచ్చే ఏడాది కేవలం రెండువేల ఎకరాలకు మించి ఉండదన్న చేదు నిజాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. నాలుగు దశాబ్దాల క్రితం గద్వాల ప్రాంతంలో పత్తి విత్తనోత్పత్తి పంటసాగు ప్రారంభమైంది. ఏటా సాగువిస్తీర్ణం పెరుగుతూ గతేడాది 40వేల ఎకరాలకు విస్తరించింది.
కేవలం ఒక ఎకరాలో పత్తివిత్తనోత్పత్తి సాగుచేస్తే ఐదు క్వింటాళ్ల విత్తనోత్పత్తి జరిగి రైతుకు దాదాపు రూ.రెండులక్షల ఆదాయం సమకూరుతుంది. ఖర్చులు, పెట్టుబడులు పోనూ కనీసం లక్ష రూపాయల వరకు మిగులుతాయి. ఇంత ఆదాయం ఉన్న పత్తి విత్తనోత్పత్తి సాగుకు ఈ ప్రాంతంలో రెండెకరాల రైతు నుంచి పదెకరాలు ఉన్న రైతు వరకు ఏటా విత్తనపత్తి సాగుకు ప్రాధాన్యమిస్తున్నారు. పత్తి విత్తనోత్పత్తి అంటేనే దేశంలో గద్వాలకు గుర్తింపు తెచ్చేలా నాణ్యతా ప్రమాణాలను పాటించి తమకంటూ ప్రత్యేకత తెచ్చుకున్నారు.
గతేడాది క్రితం జూన్, జూలైలో పత్తి పంట పుప్పొడి రాకపోవడంపై వివాదం రేగింది. ఇందులో వివిధ పార్టీల నేతలు , ప్రజాసంఘాలు, రైతు సంఘాలు జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. దీనికితోడు రాజకీయ సమీకరణలు, వివిధ రకాల పంచాయితీలు, పత్తి విత్తనోత్పత్తిపై ప్రభావం చూపాయి. ఈ వేసవిలో ఖరీఫ్ పత్తి విత్తనోత్పత్తి సాగుకు కంపెనీలు ఇవ్వాల్సిన ఫౌండేషన్ సీడ్‌ను ఇవ్వడంలో జాప్యం చేస్తూ, చివరకు కేవలం 20 నుంచి 25వేల ఎకరాలకు మాత్రమే ఇచ్చారు. విస్తీర్ణం తగ్గడానికి జరిగిన కారణాలపై పలు రకాల ఆరోపణలు కూడా వచ్చాయి. కంపెనీలు తమ దగ్గర మూడు కోట్లకు పైగా ప్యాకెట్ల నిల్వలు పెరిగిపోవడం వల్లే విస్తీర్ణం తగ్గించాయని వివరణ ఇచ్చారు.
కారణాలివే..
ఈనెల 6న గద్వాలలో పత్తి విత్తనోత్పత్తి సాగు రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో వచ్చే ఖరీఫ్‌లో రెండు నుంచి మూడు వేల ఎకరాలకు మించి విత్తనోత్పత్తికి ఫౌండేషన్ సీడ్ ఇవ్వలేమని కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేశారు. వివిధ సంస్థల నుంచి వచ్చిన వ్యవసాయ నిపుణులతో వాణిజ్య పంటల వైపు రైతులు మళ్లాలని సూచనలు చేయించారు. దీనికితోడు సీడ్ ఆర్గనైజర్లు కూడా కంపెనీల సమస్యలను అర్థం చేసుకుని వచ్చే ఏడాది సీడ్ సాగుకు రైతులు ప్రాధాన్యం ఇవ్వకుండా ఇతర పంటలసాగుకు ప్రయత్నించాలని సూచించారు.
రైతుకు నష్టం..
పత్తి విత్తనోత్పత్తి సాగుతో రైతుకు అధిక లాభం రావడంతోపాటు, తక్కువ విస్తీర్ణంలో ఇంటిల్లిపాది కష్టించి రెండు చేతులా సంపాదించుకునే మార్గం ఉండేది. ఎకరా పొలంలో సీడ్‌సాగు చేసుకుంటే ఐదు క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి అవుతాయి. కిలో ప్యాకెట్ చొప్పున 500 ప్యాకెట్లను ఉత్పత్తి చేసిన రైతులకు ఒక ఎకరాపై దాదాపు రూ. లక్షల ఆదాయం సమకూరుతుంది.
పంట లేకపోతే నష్టమే..
తక్కువ విస్తీర్ణంలో ఉన్న నీళ్లతో పంటను పండించుకునే వాళ్లం. ఇంట్లో ఉన్న వాళ్లందరూ పొలంలో పనిచేసుకోవడం ద్వారా గిట్టుబాటవుతుంది.
వచ్చే ఏడాది పత్తిపంట సాగుకు కంపెనీలు ఫౌండేషన్ సీడ్ ఇవ్వకపోతే ఇతర పంటల్లో ఇంత ఆదాయాన్ని పొందలేం. సీడ్ సాగుపై ఆధారపడిన రైతులం నష్టపోతాం. విస్తీర్ణం తగ్గకుండా చూడాలి.
- రైతు వెంకటన్న, ధరూరు.
నిల్వలు పేరుకుపోవడం వల్లే..
కంపెనీల వద్ద సీడ్ నిల్వలు పెద్దఎత్తున పేరుకపోయాయి. ప్రస్తుత ఏడాది మూడు కోట్ల ప్యాకెట్ల నిల్వలు నిలిచిపోయాయి. అందుకే ప్రస్తుతం 40వేల నుంచి 25వేలకు విస్తీర్ణం తగ్గించారు. వచ్చే ఏడాది మూడువేల ఎకరాలకు మించి పత్తి సాగు ఉండే అవకాశం లేదు. నిల్వలు పూర్తిగా కమర్షియల్‌కు వెళ్లిపోవడం జరిగితే రెండేళ్లలో మళ్లీ పత్తి విత్తనోత్పత్తి గతం మాదిరిగానే అధిక విస్తీర్ణానికి పెరగొచ్చు.
-ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర సీడ్ గ్రోయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు
ఇదే ఆఖరి పంట
Published Fri, Oct 18 2013 4:23 AM | Last Updated on Fri, Mar 22 2019 6:24 PM
Advertisement
Advertisement