ఇక ఢిల్లీలోనే ఉరేసుకోవాలా..!
(సాక్షి వెబ్ ప్రత్యేకం)
'ఆ సమయంలో నేను గానీ అక్కడుంటే.. అలా జరగనిచ్చేవాణ్నికాదు.. అసలు ఇలాంటివి జరగాలని అస్సలు కోరుకోరు' ఎవరైనా ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డప్పుడు అతడిపట్ల సానుభూతితో.. వయసు, హోదాతో సంబంధం లేకుండా చేసే వ్యాఖ్యలు! కానీ ఈ మాటలు పెదవుల వరకే ఆగిపోయి.. ఆచరణలో కానరాకుంటే.. ఇదిగో.. ఇలా మళ్లీ మళ్లీ వరుస మరణాలు.. అవే అబద్ధపు సానుభూతులు! ఏళ్ల తరబడి దేశాన్ని కుదిపేస్తున్న రైతుల బలవన్మరణాల విషయంలో ప్రభుత్వాల తీరిది!
సమస్య వచ్చినప్పుడు ప్రకటనలు చేయడం ద్వారా బయటపడొచ్చని చాణక్యుడు ఏ ఉద్దేశంతో చెప్పారో గానీ అచ్చుగుద్దినట్లు అన్నివేళలా దాన్నే ఫాలో అవుతున్నారు మన నేతలు. చెమటదారపోసి.. కాయకష్టం చేసి.. తల్లితో సమానంగా భూమిని ప్రేమిస్తూ ఆరుగాలం కష్టపడి రైతు.. తెల్లారినప్పటి నుంచి నిద్రపోయేవరకు నోట్లోకి ఎంగిలిని అందించేవాడిగా ఎవరికీ గుర్తులేకపోయినా పాలకులకు మాత్రం గుర్తుండి పోవాలి. అతడు లేకుంటే జీవమే లేదు మనుగడే లేదు. కానీ నేడు అతడి ఆత్మహత్య నాయకులకు ప్రసంగ పాఠాలయ్యాయి. ఓ గంట రెండుగంటల వినోదాత్మక చర్చలుగా మారాయి. ఈ విషయాన్ని రైతుల ఆత్మహత్యల గణాంకాలే వెల్లడిస్తున్నాయి.
దేశంలో రైతులు ఆత్మహత్యలు అనగానే ముందుగా గుర్తొచ్చేది మహారాష్ట్రలోని విదర్భ. కానీ, అలాంటి విదర్భ ఇప్పుడు దేశంలో ఎక్కడ రైతు చనిపోతే అక్కడ ఉన్నట్లే. ప్రతి ఏడాది వేల ఆత్మహత్యలు. మొన్నటి వరకు అప్పులు, నష్టం, కబ్జాలు రైతుల ప్రాణాలు తీస్తుంటే నేడు తాజాగా తలెత్తిన బంగారం లాంటి భూములను లాక్కొనేందుకు చేసే రాజకీయ ఒత్తిడులు, చట్టాలతో చేసే భూ ఆక్రమణలు వారి ఆత్మహత్యలను మరింత పెంచాయి. నిన్న మొన్నటి వరకు ఏ పొలానికో, ఇంటికో చెట్టుకో పుట్టకో నెలవైన రైతు మరణం తాజాగా దేశ రాజధానిలో గజేంద్ర రూపంలో మార్మోగింది.
సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఆప్యాయంగా వ్యవసాయం చేసుకునే రాజస్థాన్కు చెందిన గజేంద్ర సింగ్.. ఆప్ ర్యాలీలో చెట్టుపైకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తూ అక్కడే ప్రాణాలు బలితీసుకున్నాడు. ఒకప్పుడు ఓ దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడంతో అతడి భార్య కళావతి పేరును కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నోట వినడం ద్వారా ఎంతగా వెలుగులోకి వచ్చారో.. నేడు అలాగే ప్రతిపక్షాలు చేసిన రభస ద్వారా ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్.. ఇంకా ప్రముఖ నేతల ద్వారా ప్రకటనగా వచ్చిన గజేంద్ర మరణం కూడా అంత వెలుగులోకి వచ్చింది. దేశ రాజధానిలో ఓ రైతు ఆత్మహత్య రాజకీయంగా పెనుదూమారాన్ని సృష్టించింది. పార్లమెంట్లో గజేంద్ర సింగ్ ఆత్మహత్య అంశం ప్రకంపనలు సృష్టించింది.
భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన ర్యాలీలో గజేంద్ర సింగ్ ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జాతీయ మీడియాల్లో పతాక శీర్షికలను అందుకుంది. వ్యవసాయాన్నే నమ్ముకున్న తాను పంటలు పండక చాలా నష్టపోయానని, మోదీ ప్రభుత్వం భూ సేకరణ బిల్లు అంటూ తమ భూములు లాక్కుంటే ఎలా బతకాలంటూ గజేంద్ర సింగ్ తన సూసైడ్ లేఖలో ప్రస్తావించాడు. అయితే, అది ఆత్మహత్యా, హత్యా అనే చర్చ లేవనెత్తి.. ఒక మరణాన్ని చులకన చేసే ప్రయత్నం చేయకుండా ఓ సారి రైతుల ఆత్మహత్యలపై లోతుగా చర్చించుకోవాలి. పున: పరిశీలన చేసుకోవాలి. లేదంటే రైతులు ఉరి కొయ్యలకు వేలాడే హృదయవిదారక సంఘటనలు కోకొల్లలు చూడాల్సి వస్తుంది. ఏదైనా జరిగినప్పుడు రాజకీయ నేతలు, ప్రభుత్వాలు ఊకదంపుడు ఉపన్యాసాలు, ఎదుటివారిపై దుమ్మెత్తి పోయటం మానుకోవాలి. ఇప్పటికే వారు ఈ విషయంలో చేసింది శూన్యం.
ఇక దేశ రాజధానిలో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవటం వల్లే రైతుల ఆత్మ హత్యలకు ప్రచారం బాగా జరిగింది కొందరనుకుంటున్నారు. కానీ ఇలా అనుకుంటే మాత్రం పొరపాటుపడ్డట్టే. అలా అనుకుంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా పంటపొలాల్లో సతమతం అవుతున్న రైతులంతా గజేంద్రను ఆదర్శంగా తీసుకొని పార్లమెంటు ముందు పదుల సంఖ్యలో ప్రాణాలు నిలువునా తీసుకునే ప్రమాదం ఉంది. ప్రధాని నరేంద్రమోదీ కూడా పార్లమెంటులో గజేంద్ర మరణంపై స్పందిస్తూ రైతుల ఆత్మహత్యల సమస్య వేళ్లూనుకూని పోయిందని, పురాతన కాలం నాటి నుంచే ఉందని.. దీని పరిష్కరణకై అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనిప్రకటించారు. ఇది కూడా మరొక ప్రకటనగా మిగిలిపోకుండా ఆచరణ రూపంలోకి తీసుకొస్తే గజేంద్రలాంటి రైతులెందరికో మోక్షం లభించినట్లే.
(యం.నాగేశ్వరరావు)